Published : 16/11/2021 17:24 IST

నిజ జీవితంలోనూ తను అలాంటివాడేనేమో అనుకున్నా!

(Photo: Instagram)

‘ప్రేమించడం కన్నా ఎదుటివారి ప్రేమను పొందడం గొప్ప విషయం అంటుంటారు.. ఈ విషయంలో నేను మాత్రం అందరికంటే అదృష్టవంతురాలిని!’ అంటోంది కొత్త పెళ్లి కూతురు పత్రలేఖ. బాలీవుడ్‌ నటుడు, తన ఇష్టసఖుడు రాజ్‌కుమార్‌ రావ్‌తో తాజాగా ఏడడుగులు నడిచి తన పదకొండేళ్ల ప్రేమాయణాన్ని శాశ్వతమైన అనుబంధంగా మార్చుకుందీ ముద్దుగుమ్మ. అది ప్రేమైనా, పెళ్లైనా ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం నిత్యనూతనమవుతోందంటోన్న ఈ లవ్లీ బ్రైడ్‌ చెప్పే తమ ప్రేమ కబుర్లేంటో తెలుసుకుందాం రండి..

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు రాజ్‌కుమార్‌ రావ్‌ - పత్రలేఖలది పదకొండేళ్ల ప్రేమానుబంధం. ‘సిటీ లైట్స్‌’, ‘సంఝానా’.. వంటి సినిమాల్లో కలిసి తెర పంచుకున్న వీరు.. జీవితాన్నీ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తామిద్దరూ కలిసి గడిపిన ప్రత్యేక క్షణాల్ని ఫొటోల రూపంలో తమ ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ తమ ప్రేమ సంగతుల్ని బయటపెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రేమ కబుర్లను ఓ ప్రముఖ సోషల్‌ మీడియా బ్లాగ్‌ ద్వారా ఇలా పంచుకుంది పత్రలేఖ.

అలా చెప్తే జోక్‌ చేస్తున్నాడనుకున్నా!

‘‘Love Sex Aur Dhokha’ సినిమాలో భాగంగా తొలిసారి రాజ్‌ను చూశాను. చూడగానే విచిత్రమైన వ్యక్తిలా అనిపించింది.. అతని క్యారక్టర్‌ నిజ జీవితంలోనూ ఆ సినిమాలోని పాత్రలాగే ఉంటుందేమో అనుకున్నా. దాంతో అతనిపై నాకున్న అభిప్రాయం మసకబారింది. అయితే కొన్నాళ్ల తర్వాత ఓసారి ఇద్దరం కలిసినప్పుడు.. ‘నేను నిన్ను తొలిసారి ఓ యాడ్‌ షూట్‌లో చూశాను. పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనిపించింది..’ అని తను చెబుతుంటే జోక్‌ చేస్తున్నాడనుకున్నా. ఆపై ఇద్దరం కలిసి ఓ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు.. పని పట్ల తనకున్న తపన, అంకితభావాన్ని దగ్గర్నుంచి గమనించా. ఇలా ఇద్దరి మధ్య మాటల ప్రవాహం పెరిగింది. వృత్తిపరమైన విషయాలు, సినిమా పట్ల ఉన్న ఇష్టం, అభిరుచులు.. వంటివన్నీ ఒకరితో ఒకరం పంచుకునే వాళ్లం. కలిసి డేట్స్‌కి వెళ్లకపోయినా.. లాంగ్‌ డ్రైవ్స్‌కి వెళ్లే వాళ్లం.. సినిమాలు చూసేవాళ్లం. ఒక్కోసారి ఇంట్లోనే సమయం గడిపే వాళ్లం.

ఇక ఆడిషన్స్‌కైతే కలిసే వెళ్లే వాళ్లం. తన పనులు మానుకొని మరీ రాజ్‌ నాకోసం వచ్చిన సందర్భాలూ ఎన్నో! ఓసారైతే నన్ను చూడ్డానికి విమానాశ్రయం నుంచి జుహూ వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతేకాదు.. అప్పటికి తన సంపాదన అంతంతమాత్రమే అయినా.. నా ఫేవరెట్‌ బ్యాగ్‌ కొని బహుమతిగా అందించాడు. నిజానికి అది చాలా ఖరీదైంది. ఇలా చెప్పుకుంటూ పోతే మా పదకొండేళ్ల ప్రేమ బంధంలో మర్చిపోలేని మధురానుభూతులు, ఒకరినొకరు అర్థం చేసుకున్న సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి..’

అన్నింట్లోనూ సమానమే!

‘ప్రేమను పంచుకోవడంలోనే కాదు.. గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంలోనూ మా మధ్య సమానత్వం ఉంటుంది. ఇందుకు మీకు ఓ ఉదాహరణ చెప్తా. ఓ ఆర్టికల్‌లో భాగంగా ‘రాజ్‌కుమార్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ పత్రలేఖతో సమయం గడుపుతున్నాడు..’ అని వచ్చింది. దానికి రీట్వీట్‌ చేసిన రాజ్‌.. ‘పత్రలేఖ తన బాయ్‌ఫ్రెండ్‌ రాజ్‌కుమార్‌తో సమయం గడుపుతోంది..’ అంటూ బదులిచ్చాడు. అంటే.. అది ప్రేమికులైనా, దంపతులైనా.. ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు.. ఇద్దరూ సమానమే అని చెప్పడమే అతని ట్వీట్‌లో ఉన్న ముఖ్యోద్దేశం. ప్రేమంటే బహుమతులివ్వడం, డేట్స్‌కి వెళ్లడంలోనే లేదు.. అన్ని వేళలా భాగస్వామి పక్కనే ఉండి వారిని ముందుకు నడిపించడం..! భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు తెలియదు.. కానీ ఈ క్షణం ఇద్దరం కలిసి నడుస్తున్నామన్న భావన ఎంతో సంతృప్తినిస్తోంది..’ అంటూ రాజ్‌ తన జీవితంలో ఉండడం అదృష్టమంటూ ఉప్పొంగిపోతోందీ నవ వధువు.

పెళ్లితో పీటముడి!

ఇలా తమ పదకొండేళ్ల ప్రేమ బంధాన్ని తాజాగా పెళ్లితో శాశ్వతం చేసుకుందీ బాలీవుడ్‌ జంట. నవంబర్‌ 15న జరిగిన వీరి వివాహానికి చండీగఢ్‌ వేదికైంది. పెళ్లిలో వధూవరులిద్దరూ సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. పత్రలేఖ ఎరుపు రంగు చీరలో ముస్తాబు కాగా.. రాజ్‌ క్రీమ్‌ కలర్‌ కుర్తా-చుడీదార్‌ ధరించాడు. ఇలా తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయిందీ కొత్త జంట. ‘పదకొండేళ్ల స్నేహం, ప్రేమ, రొమాన్స్‌.. పెళ్లితో శాశ్వతమయ్యాయి. మా జీవితాల్లో ఇంతకంటే సంతోషకరమైన, గొప్ప రోజు మరొకటి లేదు.. పత్రలేఖకు భర్తనైనందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది..’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు రాజ్‌.

మరోవైపు పత్రలేఖ కూడా తమ పెళ్లి ఫొటోల్ని పంచుకుంటూ.. ‘రాజ్‌కి భార్యనవడం కన్నా మధురానుభూతి మరొకటి లేదు.. నేను చాలా అదృష్టవంతురాలిని!’ అంటూ రాసుకొచ్చింది. ఇలా తమ సందేశాలతో మరోసారి సమానత్వాన్ని చాటుకుంటూ.. నేటి జంటలకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతోందీ అందాల జంట. ఇక పెళ్లి తర్వాత జరిగిన వివాహ విందులోనూ మెరిసిపోయారీ క్యూట్‌ కపుల్‌.

ఇక అంతకుముందు జరిగిన నిశ్చితార్థపు వేడుకలో ఇద్దరూ మోకాళ్లపై కూర్చొని ఉంగరాలు మార్చుకోవడం అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ క్యూట్‌ కపుల్‌!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని