ఆత్మవిశ్వాసం ఉందా.. లేదా? చెక్ చేసుకోండిలా..!

కొంతమంది అమ్మాయిలు తమలో ఆత్మవిశ్వాసం లోపించిందని.. ఫలితంగా తాము ఏమీ సాధించలేకపోతున్నామని.. బాధపడుతుంటారు. కానీ ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్న వారిలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి....

Published : 25 Jul 2023 18:24 IST

కొంతమంది అమ్మాయిలు తమలో ఆత్మవిశ్వాసం లోపించిందని.. ఫలితంగా తాము ఏమీ సాధించలేకపోతున్నామని.. ఏ పని చేయాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని బాధపడుతుంటారు. అయితే ఆత్మవిశ్వాసం.. ఒకేసారి అబ్బే విద్య కాదు. మనం చేసే పనుల ద్వారా క్రమంగా మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ఈ క్రమంలో- ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్న వారిలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.

సొంతంగా నిర్ణయాలు..
అమ్మాయిలు ఏం చదవాలి.. ఎక్కడ చదవాలి.. ఎలాంటి ఉద్యోగం చేయాలి.. మొదలైన అంశాలలో కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ తుది నిర్ణయం పెద్దలదే. వారిది చిన్న వయసు కావడం వల్ల వారికేమీ తెలీదనే భావన కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. అయితే ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిల్లో తాము ఏం చేయాలో వారే నిర్ణయం తీసుకొనే సామర్థ్యం ఉంటుంది. అలాగని ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వరని కాదు. ఎదుటివారి భావాలను గౌరవిస్తూనే.. తమ వాణిని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే తాము తీసుకొన్న నిర్ణయం సరైనదేనా? కాదా? అని ఆలోచించుకోవడంతో పాటు.. దానివల్ల జరిగే మంచిచెడులను కచ్చితంగా బేరీజు వేసుకోగలుగుతారు. ఫలితంగా తాము పూర్తి చేయదలుచుకున్న కార్యాన్ని చేరుకొనే దిశగా సాయం చేసేందుకు కుటుంబ సభ్యులను, స్నేహితులను ఒప్పించగలరు.

'నో' చెప్పడం తెలుసు..!
ఎవరైనా మనకు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకపోయినా.. మొహమాటానికి పోయి ఆ పనిని పూర్తి చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మేం ఈ పని చేయలేమని చెప్పలేం. కానీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న అమ్మాయిలు తమకు నచ్చని పనులు చేయమని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు. అలాగే ఆ పనిని ఎందుకు చేయమంటున్నారో దానికి గల కారణాలను సైతం నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అలాగే ఇతరులు తమ అభిప్రాయాలను పంచుకొన్నప్పుడు అవి అంత ఆమోదయోగ్యంగా లేకపోయినా.. కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల వాటిని అంగీకరించాల్సి ఉంటుంది. అదే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే అమ్మాయిల విషయానికొస్తే.. ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అసంబద్ధంగా అనిపిస్తే.. వాటిని అంగీకరించడానికి ఇష్టపడరు. అలాగే వారి ఆలోచన ఎందుకు తప్పో కూడా ధైర్యంగా వివరించగలరు.

అసూయ ఉండదు..
ఇతరులు తమకంటే కొన్ని విషయాల్లో మెరుగ్గా ఉన్నా లేదా వారు చేస్తున్న పనిలో విజయం సాధించినా వారిని చూసి అసూయ చెందేవారు మన చుట్టూ చాలామందే ఉంటారు. ఇది మనకు ఎలాంటి మేలు చేయకపోగా.. హానికరంగా మారుతుంది. మరి ఆత్మవిశ్వాసం ఉన్నవారిలో ఈ లక్షణం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. తమ పనేదో తాము చూసుకొని వెళతారు తప్ప.. ఇతరుల వ్యవహారాలు తెలుసుకోవాలనే ఆసక్తి వారికుండదు. ఫలితంగా తాము చేస్తున్న పని పైనే పూర్తి శ్రద్ధ పెట్టి, సాధించాలనుకొన్న కార్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. కొందరు స్వార్థంతో ఇతరులకు సాయం చేయాలనే విషయాన్ని సైతం పట్టించుకోరు. కానీ తమపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్న వారు మాత్రం ఎవరికైనా సాయం అవసరమైతే చేయడానికి వెనుకాడరు. అలాగే ఇతరులను సైతం ప్రోత్సహించి వారిని ఎదిగేలా చేయగలరు. తమను ఇతరులతో పోల్చుకొనే లక్షణం వీరికి ఉండదు.

వాటి గురించి కుమిలిపోరు!
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని సరిదిద్దుకొంటేనే మనిషిగా ఓ మెట్టు ఎక్కడంతో పాటు.. కెరీర్‌లోనూ విజయం సాధించగలం. అయితే కొందరికి తమలోని లోపాలను ఎవరైనా ఎత్తి చూపినా.. సరిదిద్దుకోమని చెప్పినా ఎక్కడలేని కోపం వస్తుంది. అంతేకానీ వాటిని సరిదిద్దుకొందామనే ఆలోచన వారికి ఉండదు. అదే ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవాళ్లు తమ లోపాలను ఎవరైనా గుర్తించి చెబితే వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే దాన్నుంచి బయటపడటానికి సన్నిహితుల సాయం సైతం తీసుకొంటారు. అలాగే ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్న అమ్మాయిల్లో కనిపించే మరో లక్షణం శారీరకంగా వారిలో ఏవైనా లోపాలుంటే వాటికి పెద్దగా ప్రాధాన్యమివ్వరు. అవి తమ ఎదుగుదలకు అడ్డంకిగా ఎంతమాత్రం పరిగణించరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్