చలికాలంలో చర్మానికి!

చలికాలం రాగానే చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం, పగుళ్లు రావడం.. వంటి సమస్యలు సహజం. అయితే ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసుకునే ఫేస్‌ ప్యాక్స్ ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు.

Published : 16 Dec 2023 18:59 IST

చలికాలం రాగానే చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం, పగుళ్లు రావడం.. వంటి సమస్యలు సహజం. అయితే ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసుకునే ఫేస్‌ ప్యాక్స్ ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

అరటి, పెరుగుతో..

బాగా పండిన అరటిపండు తీసుకొని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. దానికి చెంచా చొప్పున తేనె, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని నిర్జీవమైపోయిన చర్మంపై అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందచ్చు. పెరుగు, తేనె చర్మానికి తేమని అందిస్తే, అరటిపండు నిర్జీవంగా మారిన చర్మానికి తిరిగి జీవం పోస్తుంది.

బాదంతో..

బాదంపై ఉండే పొట్టు తొలగించి కొద్దిగా పాలు జత చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖం, మెడకి ప్యాక్‌లా వేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. ప్రకాశవంతమైన చర్మం మన సొంతమవుతుంది. అలాగే శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్నీ ఈ ప్యాక్‌ దూరం చేస్తుంది.

శెనగపిండి, టొమాటోతో..

కొద్దిగా శెనగపిండి తీసుకొని అందులో తగినంత టొమాటో రసం వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇందులో కాస్త రోజ్‌వాటర్ కూడా జత చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా అప్లై చేసుకొని 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చక్కని స్క్రబ్‌లా పని చేసి చర్మంపై ఉన్న మృతకణాల్ని తొలగిస్తుంది. అలాగే నిర్జీవమైన చర్మానికి తిరిగి జీవం పోసి తాజాగా కనిపించేలా చేస్తుంది.

చలికాలంలో నిర్జీవమైపోయిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు.. గులాబీ రేకుల పేస్ట్‌, పచ్చిపాలు, రోజ్‌వాటర్, తేనె, చక్కెర, ఓట్స్, నిమ్మరసం, స్ట్రాబెర్రీ, క్యారట్స్, చాక్లెట్, వాల్‌నట్స్, కొబ్బరినూనె.. మొదలైన పదార్థాలు ఉపయోగించి కూడా ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగించచ్చు. వీటి వల్ల కూడా చలికాలంలో చర్మ సమస్యలన్నీ తొలగిపోయి ప్రకాశవంతంగా కనిపించేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్