Real Hero: సామూహిక అత్యాచారం.. అయినా ప్రపంచ పర్యటన ఆపలేదు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా.. మహిళా సమానత్వం, సాధికారత గురించి చర్చలే! అయితే ఇవి మాటలకే పరిమితం తప్ప చేతల్లో అమలవ్వట్లేదన్న విషయం మరోసారి నిరూపితమైంది. 

Updated : 16 Mar 2024 15:04 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా.. మహిళా సమానత్వం, సాధికారత గురించి చర్చలే! అయితే ఇవి మాటలకే పరిమితం తప్ప చేతల్లో అమలవ్వట్లేదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ప్రపంచ యాత్రలో భాగంగా మన దేశానికి వచ్చిన ఓ విదేశీయురాలిపై సామూహిక అత్యాచారం జరగడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! దేశవ్యాప్తంగా మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చిన ఈ ఘటనపై సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఎంతోమంది స్పందిస్తున్నారు.. బాధిత మహిళకు అండగా నిలుస్తున్నారు. అయితే ఆ మహిళ మాత్రం ఈ చేదు అనుభవం తాలూకు జ్ఞాపకాల్ని భారత్‌లోనే వదిలేసి తన యాత్రలో భాగంగా నేపాల్‌ చేరింది. వెళ్లే ముందు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకుండా.. జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లాలంటూ అమ్మాయిలకో చక్కని సందేశాన్నీ అందించింది. ఇలా తన బాధను దిగమింగి ఆమె చాటిన స్ఫూర్తి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్త్రీని దేవతగా కొలిచే దేశం మనది. అయినా ఇక్కడ అమ్మాయిలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడూ విదేశీ మహిళల పైనా ఇలాంటి ఘటనలు జరగడం చూస్తుంటాం. భారత్‌లో పర్యటించడానికి వచ్చిన ఓ స్పెయిన్‌ మహిళకూ ఇటీవల ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. దీంతో దేశంలో మహిళల భద్రత మరోసారి చర్చనీయాంశంగా, ప్రశ్నార్థకంగా మారింది.

అసలేం జరిగింది?!

ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆసక్తితో ఆరేళ్ల క్రితం తన భర్తతో కలిసి విడివిడిగా మోటార్‌ బైక్స్‌పై వరల్డ్‌ టూర్‌కి బయల్దేరింది స్పెయిన్‌కు చెందిన ఓ మహిళ. వివిధ దేశాలు చుట్టి పాకిస్థాన్‌ మీదుగా ఆరు నెలల క్రితం భారత్‌లోకి అడుగుపెట్టింది. అప్పట్నుంచి ఇక్కడి పర్యటక ప్రదేశాలన్నీ సందర్శిస్తూ ఎన్నో మధురానుభూతుల్ని సొంతం చేసుకుందామె. అంతేకాదు.. ఇక్కడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూనే మధ్యమధ్యలో సమయం దొరికినప్పుడల్లా శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లోనూ పర్యటించిందామె. ఇక ఇటీవలే భారత్‌ టూర్‌ ముగించుకొని నేపాల్‌ చేరాలనుకున్న ఆమె.. అంతలోనే సామూహిక అత్యాచారానికి గురవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నేపాల్ వెళ్లడం కోసం జార్ఖండ్‌లోని ధుమ్‌కా అనే నగరానికి చేరిన ఈ భార్యాభర్తలిద్దరూ రాత్రి ఆలస్యం కావడంతో అక్కడి ఓ నిర్జన ప్రదేశంలో తాత్కాలిక గుడారం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభించాలనుకున్న వారికి అది కాళరాత్రిగా మిగిలిపోయింది. తాత్కాలిక గుడారంలో ఉన్న వారిద్దరిపై ఏడుగురు కామాంధులు దాడి చేశారు. ఆ మహిళ భర్తను బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆ ఏడుగురు మృగాళ్లు తనపై అఘాయిత్యానికి ఒడిగట్టారంటూ బాధిత మహిళ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

అదే కాళరాత్రైంది!

‘మేము భారత్‌లో అడుగుపెట్టి ఆరు నెలలు దాటింది. ఇన్ని నెలల పర్యటనలో సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించాం. ఎన్నో మధురానుభూతుల్ని మూటగట్టుకున్నాం. ఈ దేశ ఆతిథ్యాన్ని, ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాల్ని ఆస్వాదించాం. ఇలా సంతృప్తిగా భారత పర్యటన ముగించుకొని నేపాల్‌లో అడుగుపెట్టాలనుకున్న మేము మార్చి 1న రాత్రి ఆలస్యం కావడంతో జార్ఖండ్‌లోని ధుమ్‌కా అనే పట్టణంలో బస చేయాలనుకున్నాం. అక్కడి ఓ ప్రదేశంలో ఆగి తాత్కాలిక గుడారాన్ని ఏర్పాటుచేసుకున్నాం. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం కావడంతో ఆ ప్రదేశం మాకు అనువుగా అనిపించింది. అయితే అంతలోనే అక్కడికి దగ్గర్లో ఇద్దరు పురుషుల గొంతు వినబడడంతో బయటికొచ్చి చూశాం. వాళ్లు తమ స్నేహితులతో ఫోన్‌ మాట్లాడుతున్నట్లుగా గుసగుసలు మాకు వినిపించాయి. దీంతో మా వద్ద ఉన్న టార్చ్‌తో పరిశీలించేసరికి ఐదుగురు వ్యక్తులు మా దగ్గరికి రావడం గుర్తించాం. మరో ఇద్దరు మా టెంట్‌లోకి ప్రవేశించి మా వద్ద ఉన్న కొన్ని స్వీయ రక్షణ వస్తువులు, నగదు తీసుకున్నారు. వాళ్లలో ఒక్కరు తప్ప మిగతా ఆరుగురు యువకులే! ముందు నా భర్తతో గొడవ పడి ఆయన్ని బంధించారు. నన్ను నేలకేసి కొట్టి పిడిగుద్దులు గుద్దారు. ఆపై ఒకరి తర్వాత ఒకరు నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎంత వారించినా నాపై దాడి చేస్తూనే.. సుమారు రెండున్నర గంటల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై అక్కడ్నుంచి వాళ్లు పారిపోయారు. అప్పటికే వాళ్ల దెబ్బలతో నడవలేని స్థితిలో ఉన్న మేము నెమ్మదిగా ప్రధాన రహదారి పైకి చేరుకున్నాం. అంతలోనే పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అటువైపుగా రావడంతో పోలీసులు మమ్మల్ని ఆస్పత్రిలో చేర్పించి మా వాంగ్మూలం తీసుకున్నారు..’ అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని గుదిగుచ్చిందీ స్పానిష్‌ మహిళ. ఈ ఘటనకు కారణమైన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

ఛీ ఛీ.. వీళ్ల పని సిగ్గుచేటు!

‘అంతర్జాతీయ మహిళా వారోత్సవా’లు ప్రారంభమైన తొలి రోజునే ఓ విదేశీయురాలిపై ఇలా సామూహిక అత్యాచార ఘటన జరగడం శోచనీయం! దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు.

‘కొందరు భారతీయులు ఒలింపిక్స్‌లో పతకం నెగ్గితే దేశమంతా గర్విస్తుంది.. కానీ ఇలాంటి కామాంధుల వల్ల ప్రస్తుతం దేశమంతా తలదించుకునే పరిస్థితి ఎదురైంది..’ అంటూ గాయని చిన్మయి తనదైన రీతిలో ఈ ఘటనను ఖండించింది. అయితే ఈ ఘటనలో గాయపడిన బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని తాజాగా నేపాల్‌ చేరింది.. ఎవరో కొందరి వల్ల తనకు జరిగిన ఈ అన్యాయానికి దేశం మొత్తాన్ని నిందించడం సరికాదంటోన్న ఆమె.. వెళ్లే ముందు ఇక్కడున్న అమ్మాయిలకు ఓ స్ఫూర్తిదాయక సందేశాన్నీ అందించింది.

వీటిని ఇక్కడే వదిలి వెళ్తున్నా!

‘ఆరు నెలలుగా భారత్‌లో పర్యటించా. ఏనాడూ ఎలాంటి చేదు అనుభవం నాకు ఎదురుకాలేదు. పైగా ఇక్కడి ప్రజలు ఎంతో సున్నిత మనస్కులు. ఎవరో కొంతమంది వ్యక్తుల వల్ల దేశం మొత్తాన్ని నిందించడం సరికాదు. జరిగిందేదో జరిగిపోయింది.. తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడితేనే మరొకరు ఇలాంటి పొరపాటు చేయడానికి భయపడతారు. ఇక వెళ్లే ముందు ఇక్కడి అమ్మాయిలకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ఇలాంటి సంఘటనల్ని మర్చిపోవడం అంత సులభం కాదు.. జీవితాంతం వీటి తాలూకు చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. అయినా వీటిని అక్కడే వదిలేసి ముందుకు సాగాలి. నేనూ నా జీవితంలో జరిగిన ఈ చేదు ఘటనను భారత్‌లోనే వదిలేసి నా ప్రపంచ యాత్రను పునఃప్రారంభిస్తున్నా..’ అంటూ వెళ్లే ముందు తన సందేశంతో ఇక్కడి అమ్మాయిల్లో ధైర్యం నూరిపోసిందీ స్పానిష్‌ మహిళ. ఈ క్రమంలో- ఆమె ధైర్యానికి, పాజిటివిటీకి మహిళా లోకం జోహార్లు పలుకుతోంది. తనకు జరిగిన అన్యాయాన్ని, బాధను దిగమింగుకొని తోటి మహిళల భద్రతను కాంక్షించిన ఈ విదేశీయురాలిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. నిలువెత్తు ధైర్యానికి, స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ మహిళే నేటి 'రియల్ హీరో' కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్