Menophobia: నెలసరి అంటే భయమా?
ప్రతి నెలా నెలసరికి ముందు శారీరక, మానసిక మార్పులు కనిపించడం సహజం. అయితే వీటి ప్రభావంతో కొందరు కాస్త అసౌకర్యానికి గురైతే.. మరికొందరు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. పదే పదే ఆందోళన చెందుతూ, యాంగ్జైటీకి....
ప్రతి నెలా నెలసరికి ముందు శారీరక, మానసిక మార్పులు కనిపించడం సహజం. అయితే వీటి ప్రభావంతో కొందరు కాస్త అసౌకర్యానికి గురైతే.. మరికొందరు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. పదే పదే ఆందోళన చెందుతూ, యాంగ్జైటీకి గురవుతుంటారు. దీన్నే ‘మెనోఫోబియా’ అంటారు. ఇది నెలసరిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఫలితంగా పిరియడ్ మొదలయ్యాక నెలసరి నొప్పులు తీవ్రమవడంతో పాటు.. మానసికంగానూ కుంగుబాటు తప్పదంటున్నారు. పరిస్థితి ఇంతదాకా రాకూడదంటే.. మెనోఫోబియా లక్షణాల్ని ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..
నెలసరి ప్రారంభమవడానికి వారం ముందు నుంచే శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా కడుపుబ్బరం, వక్షోజాల్లో నొప్పి, నిద్ర పట్టకపోవడం, ఆహారపు కోరికలు, అలసట, శరీరం నీటిని నిలుపుకొని కాస్త ఉబ్బడం.. వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ, చిరాకు, లైంగిక కోరికలు తగ్గిపోవడం.. తదితర మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ‘ప్రి-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్)’గా పిలిచే ఈ దశ చాలామందిలో సహజం. అయితే కొంతమందిలో పీఎంఎస్ లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. దీన్నే ‘మెనోఫోబియా’ / ‘ప్రి-మెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ (పీఎండీడీ)’గా చెబుతున్నారు నిపుణులు.
ఈ లక్షణాలున్నాయా?
రుతుస్రావ వయసులో ఉన్న ప్రతి వంద మంది మహిళల్లో ఐదుగురు మెనోఫోబియాను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజువారీ జీవనశైలిపై ప్రతికూల ప్రభావం చూపే ఈ సమస్యను కొన్ని శారీరక, మానసిక లక్షణాల ద్వారా గుర్తించచ్చంటున్నారు నిపుణులు.
⚛ చిరాకు, కోపం కట్టలు తెంచుకోవడం.. దీని ప్రభావం అనుబంధం పైనా పడుతుంది.
⚛ నిరాశకు లోనవడం.. ప్రతి దానికీ టెన్షన్ పడిపోవడం..
⚛ చిన్న సమస్యనైనా తట్టుకోలేక ఏడవడం..
⚛ ఏ పనీ చేయాలనిపించదు.. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు..
⚛ పనిపై ఏకాగ్రత తగ్గిపోవడం..
⚛ శరీరంలోని శక్తి క్షీణించి విపరీతమైన అలసట, నీరసానికి గురవడం..
⚛ ఆహారపు కోరికలు కలగడం.. దీంతో నచ్చినవి అతిగా తినేయడం..
⚛ కండరాలు-కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు తీవ్రమవడం..
⚛ ఎక్కువ ఒత్తిడికి లోనవడం వల్ల తలనొప్పి వేధించడం.. ఉన్నట్లుండి ఒళ్లంతా చెమటలు పట్టడం..
ఇక ఇప్పటికే పలు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్న వారు.. ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటి సమస్యలకు సంబంధించిన కుటుంబ చరిత్ర ఉన్న వారిలో మెనోఫోబియా రిస్క్ ఎక్కువంటున్నారు నిపుణులు.
ఇలా చేస్తే ఉపశమనం!
సాధారణంగానే నెలసరి సమయంలో అసౌకర్యంగా ఉంటుందంటే.. మెనోఫోబియాతో ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది. మరి, ఈ సమయంలో కొన్ని జీవనశైలి మార్పులు, చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
⚛ మెనోఫోబియాతో తలెత్తే మానసిక సమస్యల్ని దూరం చేసుకోవడానికి క్యాల్షియం సమర్థంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలో క్యాల్షియం ఎక్కువగా ఉన్న పాలు, పాల పదార్థాలు, సోయా ఉత్పత్తులు.. వంటివి తీసుకోవాలి. అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు క్యాల్షియం సప్లిమెంట్లు కూడా వాడచ్చు.
⚛ అలాగే విటమిన్ బి-6 కూడా మెనోఫోబియాతో తలెత్తే శారీరక, మానసిక సమస్యలకు చెక్ పెడుతున్నట్లు మరో అధ్యయనం చెబుతోంది. కాబట్టి ఇందుకోసం డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లు వాడడంతో పాటు.. తృణధాన్యాలు, శెనగలు, కోడిగుడ్లు, మాంసం, ఆకుకూరలు, పండ్లు.. ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.
⚛ ఈ సమయంలో తలెత్తే అతి ఆహారపు కోరికలకు చెక్ పెట్టాలంటే.. ప్రాసెస్డ్ ఫుడ్‌కు బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉప్పు, చక్కెర అధికంగా ఉండే చిప్స్, క్యాండీ బార్స్.. వంటివి పక్కన పెట్టి.. నట్స్, డ్రైఫ్రూట్స్ ఎంచుకోవాలి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కడుపు నిండుగా ఉండేలా చేసి ఎక్కువ సమయం ఆకలేయకుండా ఉంటుంది.
⚛ కాఫీలో ఉండే కెఫీన్ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఇలా జరగకూడదంటే రోజుకు ఒకట్రెండు కప్పులకు మించి తాగకూడదు.
⚛ ఆహారంతో పాటు వ్యాయామాలూ మెనోఫోబియా లక్షణాల్ని తగ్గిస్తాయి. అందులోనూ ఏరోబిక్స్ సాధన చేయడం వల్ల మెరుగైన ఫలితం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
⚛ ఇక యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు, మసాజ్ థెరపీ.. వంటివి మానసిక సమస్యల్ని దూరం చేసి ప్రశాంతతను చేరువ చేస్తాయి.
⚛ ఒత్తిడి, కోపం, చిరాకు.. వంటివి మరీ ఇబ్బంది పెడుతుంటే.. నిపుణుల కౌన్సెలింగ్/కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ తీసుకోవడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
అయితే ఇన్ని చేసినా మీ సమస్య తగ్గకపోయినా.. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోయినా.. వెంటనే నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం. వారు మీ ఆరోగ్య స్థితి, లక్షణాల్ని బట్టి తగిన చికిత్స అందిస్తారు. ఫలితంగా మెనోఫోబియా నుంచి ఉపశమనం పొందడంతో పాటు ప్రశాంతత సొంతమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.