అత్తగారూ.. తెలుసుకోండివి!

కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టే కోడలికి ఒక్కటే దిగులు.. అత్తగారు తననెలా ఆదరిస్తారోనని! తాను చేసే పనులు, మెలిగే విధానం ఆమెకు నచ్చుతాయో లేదోనని మొహమాటపడుతుంటారు కొత్త కోడళ్లు. అయితే ఇలా కోడలి మదిలో ఉన్న భయాలను తొలగించి.. ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేయడం అత్తగారి చేతిలోనే ఉందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

Published : 16 Feb 2022 19:13 IST

కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టే కోడలికి ఒక్కటే దిగులు.. అత్తగారు తననెలా ఆదరిస్తారోనని! తాను చేసే పనులు, మెలిగే విధానం ఆమెకు నచ్చుతాయో లేదోనని మొహమాటపడుతుంటారు కొత్త కోడళ్లు. అయితే ఇలా కోడలి మదిలో ఉన్న భయాలను తొలగించి.. ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేయడం అత్తగారి చేతిలోనే ఉందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం కీలకమంటున్నారు.

ఏదైనా సమానంగానే..!

చాలామంది అత్తలు తమ కూతుళ్లని ఒకలా, కోడళ్లను మరోలా చూస్తుంటారు. కొంతమంది కోడళ్లు కూడా ఈ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలో కన్న కూతురిపై ఉన్న ప్రేమతో, కొడుకుపై ఉన్న అనురాగంతో.. సందర్భానుసారం, ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో/ఫంక్షన్లప్పుడు.. వాళ్లకు కానుకలివ్వడం, కోడలి విషయంలో మొండిచేయి చూపించడం.. వంటివి చేస్తుంటారు. ఇలాంటి అసమానతలే క్రమంగా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. అందుకే అకేషన్‌ ఏదైనా/ఎవరిదైనా కూతురికి కానుకలు పెట్టాలనుకున్నప్పుడు.. అదే బహుమతిని అదనంగా కోడలి కోసం కూడా కొనడం మర్చిపోవద్దంటున్నారు. ఇలా ఇద్దరికీ ఒకేసారి బహుమతులు అందివ్వడం వల్ల.. ‘నువ్వూ నా కన్న కూతురితో సమానం!’ అన్న మాట అత్తగారు కోడలికి చెప్పకనే చెప్పినట్లవుతుంది. ఒకవేళ ఒకేసారి ఇద్దరికీ బహుమతులు కొనలేని పక్షంలో కోడలు పుట్టినరోజు, పెళ్లిరోజు, సీమంతం.. వంటి ప్రత్యేక సందర్భాల్లో మీరివ్వాలనుకున్న కానుకను అందించచ్చు. ఈ చిన్న ప్రయత్నమే అత్తాకోడళ్ల మధ్య సఖ్యతను పెంచుతుందంటున్నారు నిపుణులు.

గుర్తుపెట్టుకోండి.. గుర్తు చేయండి!

పుట్టింటిని వదిలి మీకోసం మీ ఇంటికి వచ్చిన కోడలు.. ఇక ఎప్పటికీ మీలో ఒకరిగా ఉండిపోవాల్సిందే! ఈ క్రమంలో మీతో, మీ కుటుంబంతో తను అనురాగాన్ని పెంచుకోవాలంటే అత్తగారిగా మీరు చేయాల్సింది మరొకటుంది! అదేంటంటే.. తనకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్ని గుర్తుపెట్టుకోవడం! పుట్టినరోజు, పెళ్లిరోజు.. వంటివి ఏడాదికోసారి వస్తాయి. ఆయా తేదీల్ని గుర్తుపెట్టుకొని.. అందరికంటే ముందుగా మీరే ఆమెకు విషెస్‌ చెప్పడం, చిన్న పార్టీ ఏర్పాటుచేసి ఆమె తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని ఆహ్వానించడం.. ఇలా ఆమె విషయంలో మీరు చూపే ప్రత్యేక చొరవే మీ మనసులో తనకున్న స్థానమేంటో తెలియజేస్తాయి. ఫలితంగా అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి అరమరికల్లేకుండా, ప్రేమానురాగాలకు మాత్రమే చోటుంటుందనడంలో సందేహం లేదు.

ఇంటి గుట్టు గడప దాటకుండా..!

అత్తాకోడళ్లిద్దరూ ప్రేమగా మెలిగినప్పటికీ.. మూడో వ్యక్తి తలదూర్చినప్పుడే వాళ్ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొంతమంది కావాలనే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు.. మీరు ఎప్పటిలాగే ఖాళీ సమయంలో ఇరుగుపొరుగు వాళ్లతో మాట్లాడినప్పుడు.. వాళ్లు మీ కోడలి గురించి తెలుసుకోవాలని ఆరాటపడడం, ఆమెలోని లోపాల్ని ఎత్తిచూపడం, లేనిపోనివి కల్పించి చెప్పడం.. ఇలా ఏదో ఒకటి చేసి మీ మధ్య గొడవ రాజేయాలని చూస్తుంటారు. ఇలాంటి సమయంలో మీ మనసు అదుపు తప్పకుండా ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. వాళ్ల మాటల్లో నిజానిజాలు తెలుసుకోకుండా మీరు మీ కోడలిని అనుమానించడం, అనవసరంగా వాళ్లను ఓ మాట అనడం, పొరుగు వాళ్లతో మాట్లాడేటప్పుడు మీ కోడలి గురించి గుసగుసలాడడం.. ఇలా చేస్తే మీ ఇంటి గుట్టు మీరే బయటపెట్టుకున్నట్లవుతుంది. కాబట్టి నిజంగా అత్తాకోడళ్ల మధ్య భేదాభిప్రాయాలుంటే గడప దాటకుండా, మూడో వ్యక్తికి మాట్లాడే అవకాశమివ్వకుండా మీరిద్దరే పరిష్కరించుకోవడం మంచిది. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

తప్పెవరిదో తెలుసుకోండి!

ఎంత ప్రాణమిచ్చుకున్నా భార్యాభర్తలిద్దరికీ అప్పుడప్పుడూ కొన్ని విషయాల్లో గొడవలు జరగడం సహజమే! అయితే ఒక్కోసారి కొన్ని గొడవలు పెద్దవాళ్ల దాకా వెళ్లొచ్చు. ఇలాంటప్పుడు చాలామంది అత్తలు తమ కోడళ్లదే తప్పని.. కొడుకులకే సపోర్ట్‌ చేస్తుంటారు. తద్వారా మీ కోడలికి మీపై నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడచ్చు. కాబట్టి ఎవరికీ మద్దతు తెలపకుండా ముందు తప్పెవరిదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగని తప్పు చేసిన వారిని నిందించకుండా.. వారు తమ పొరపాటును గ్రహించి సరిదిద్దుకునే అవకాశమివ్వండి. ఈ క్రమంలో మీరివ్వాలనుకునే సలహాలు వారితో పంచుకోవచ్చు. ఇలా ప్రతి విషయంలోనూ కోడలితో పారదర్శకంగా వ్యవహరిస్తే అసలు అత్తాకోడళ్ల మధ్య భేదాభిప్రాయాలే రావంటున్నారు నిపుణులు.

అనుమానించద్దు.. అర్థం చేసుకోండి!

ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా కొంత సమయం కేటాయించుకోవాలని ఉంటుంది. కొత్తగా పెళ్లైనా ఎప్పుడూ భర్తతోనే గడపకుండా.. తన స్నేహితులతో అలా బయటికి వెళ్లాలని, షాపింగ్‌ చేయాలని చాలామంది అమ్మాయిలు కోరుకోవడం సహజం. ఇలాంటప్పుడు ‘నా కొడుకుతో కాకుండా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లడమేంటి?’ అని విసుక్కున్నారనుకోండి.. మీరు తనను అనుమానిస్తున్నారేమోనన్న ఆలోచన మీ కోడలిలో మొదలవుతుంది. ఇది ఇద్దరి మధ్య అనుబంధానికి ఏ మాత్రమూ మంచిది కాదు. కాబట్టి కొన్నిసార్లు ఆమెకంటూ కాస్త ఫ్రీ స్పేస్‌ను వదిలేయడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే తన విషయంలో మీకేదైనా పొరపాటుగా అనిపిస్తే ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, సమస్యను పరిష్కరించుకోవడం వల్ల మీరిద్దరూ అత్తాకోడళ్లలా కాదు.. తల్లీకూతుళ్లలా కలిసిపోవచ్చు.
 

ఇలా అత్తగారే కాదు.. కోడలూ అత్తగారిని అమ్మలా భావించి అన్ని విషయాలూ పంచుకోవాలి.. ప్రేమగా చూసుకోవాలి. తద్వారా ఇద్దరి మధ్య మంచి అవగాహన, అనుబంధం ఏర్పడతాయి. ఇవి కలకాలం వారిని కలిపే ఉంచుతాయి.. కాదంటారా?!
మరి, మీరు మీ కోడలితో అనుబంధాన్ని పెంచుకునే క్రమంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? Contactus@vasundhara.net వేదికగా మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్