చలికాలంలో ఇలా స్నానం చేస్తే చర్మం పొడిబారదు!

చలికాలం మొదలైందంటే వింధ్యకు నరకమే! అటు చర్మం పొడిబారిపోవడంతో పాటు ఇటు పాదాల్లో పగుళ్లతో తెగ ఇబ్బంది పడిపోతుంటుందామె.

Published : 12 Dec 2021 15:30 IST

చలికాలం మొదలైందంటే వింధ్యకు నరకమే! అటు చర్మం పొడిబారిపోవడంతో పాటు ఇటు పాదాల్లో పగుళ్లతో తెగ ఇబ్బంది పడిపోతుంటుందామె.

సంధ్యదీ ఇదే పరిస్థితి. వేసవి కాలంలో జిడ్డుగా మారే తన చర్మం చలికాలంలో మాత్రం పొడిబారిపోయి కళ తప్పుతుందని తెగ బాధపడుతుందామె.

ఇలా చలికాలం వచ్చిదంటే చాలు.. చాలామంది ఎదుర్కొనే సౌందర్య సమస్య చర్మం పొడిబారిపోవడం. అయితే దీన్నుంచి విముక్తి పొందడానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవడం, బయట దొరికే క్రీమ్‌లు వాడడం.. వంటివి చేస్తుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనమే అందిస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే రోజూ స్నానం చేసే క్రమంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఏంటా చిట్కాలు? రండి.. మనమూ తెలుసుకొని పాటించేద్దాం..!

శీతాకాలంలో చాలామందిలో చర్మం, పెదాలు పొడిబారడంతో పాటు మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. అంతేకాదు.. మోకాళ్లు, మోచేతులు.. వంటి భాగాల్లో చర్మం కందిపోయినట్లుగా నల్లగా, గరుకుగా మారిపోతుంటుంది. మరి, ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే రోజూ స్నానం చేసే క్రమంలో ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించమంటున్నారు సౌందర్య నిపుణులు.

నూనెతో మర్దన!

చలికాలమనే కాదు.. కొంతమందికి రోజూ స్నానానికి ముందు చర్మాన్ని నూనెతో మర్దన చేసుకోవడం అలవాటు. అయితే ఈ అలవాటు శీతాకాలంలో మరింత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నువ్వుల నూనె, ఆలివ్‌ నూనె, ఆవ నూనె.. వంటివి మరింత మేలు చేస్తాయట! అయితే వీటిని శరీరానికి అప్లై చేసుకునే ముందు కాస్త వేడి చేసుకోవడం మాత్రం మరవద్దు. ఇలా స్నానానికి ముందు చర్మానికి నూనె రాసుకొని మర్దన చేసుకోవడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది.. అలాగే కండరాలూ రిలాక్సవుతాయి. అంతేకాదు.. నూనె రాసుకొని స్నానం చేయడం వల్ల మన చర్మంపై పడే నీళ్లు.. చర్మం రంధ్రాల్లోకి చేరిన నూనెను బయటికి పోకుండా లాక్‌ చేస్తాయి. తద్వారా ఆ నూనెను చర్మం గ్రహించి తేమగా మారుతుంది. ఫలితంగా పొడి చర్మం సమస్య నుంచి విముక్తి పొందడంతో పాటు నవయవ్వనంగానూ మెరిసిపోవచ్చు.

మసాజ్‌ ఇలా!

స్నానానికి ముందు చర్మానికి నూనె రాసుకున్న తర్వాత నేరుగా చేత్తో మర్దన చేసుకోవడం కాకుండా.. కాస్త గరుకుగా ఉండే లూఫా లేదంటే టవల్‌తో మృదువుగా మసాజ్‌ చేసుకోమంటున్నారు నిపుణులు. తద్వారా చర్మం పైపొరల్లో రక్తప్రసరణ సజావుగా జరిగి చర్మం సున్నితంగా మారుతుంది.. మెరుపును సంతరించుకుంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ గరుకుగా ఉండే మోకాళ్లు, మోచేతులు.. వంటి భాగాల్లో ఈ పద్ధతి పాటించడం వల్ల అక్కడ నలుపుదనంతో పాటు గరుకుదనం కూడా మటుమాయమైపోతుంది. అలాగే స్నానానికి ముందు మోకాళ్లు, మోచేతుల్ని నిమ్మచెక్కతో రుద్దుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది.

ఈ బాడీ ప్యాక్‌ ట్రై చేయండి!

చలికాలంలో పొడి చర్మాన్ని దూరం చేసుకోవాలంటే స్నానానికి ముందు వేసుకునే బాడీ ప్యాక్స్‌ కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఈ క్రమంలో కప్పు శెనగపిండిలో చిటికెడు పసుపు వేసి.. కొద్దికొద్దిగా పెరుగు లేదా పాలు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరానికి పట్టించి.. కాసేపటి తర్వాత మృదువుగా రుద్దుకోవాలి. ఇలా అరగంటయ్యాక శరీరాన్ని శుభ్రం చేసుకొని ఆపై స్నానం చేయాలి. ఈ పద్ధతిని రోజూ స్నానం చేసే ముందు అలవాటు చేసుకోవడం వల్ల చల్లగాలులకు చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఈ బాడీ ప్యాక్‌ చర్మాన్ని శుభ్రం చేస్తుంది కూడా!

సబ్బు వాడుతున్నారా?

శీతాకాలంలో చర్మం పొడిబారడానికి మనం స్నానానికి ఉపయోగించే సబ్బులు కూడా ఒక కారణమే! ఎందుకంటే ఆల్కహాల్‌ గుణాలు అధికంగా ఉన్న సబ్బుల్ని వాడడం వల్ల చర్మం మరింత పొడిబారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాలంలో గ్లిజరిన్‌ ఆధారిత సబ్బుల్ని ఉపయోగించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే మీ చర్మతత్వాన్ని బట్టి మీకు ఏ సబ్బు నప్పుతుందో.. కొనే ముందు ఓసారి లేబుల్‌ని పరిశీలించడం లేదంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

వీటిని వాడద్దు!

స్నానం చేసిన తర్వాత చర్మం, జుట్టు త్వరగా ఆరిపోవాలని కొంతమంది బ్లోయర్స్‌, హెయిర్‌ డ్రయర్స్‌.. వంటివి ఉపయోగిస్తుంటారు. నిజానికి అవి మన చర్మాన్ని ఆరబెట్టడం అటుంచితే మరింత పొడిబారిపోయేలా చేస్తాయి. ఇందుకు వీటి నుంచి వెలువడే అధిక ఉష్ణోగ్రతే కారణం. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్దే పొడి టవల్‌ తో శరీరమంతా నెమ్మదిగా అద్దుతూ తుడుచుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి డ్యామేజ్‌ కలగకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. మనం స్నానానికి ఉపయోగించే నీళ్లు కూడా మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి!

* మీ చర్మం పొడిబారి దురద పెడుతున్నప్పుడు స్నానం చేసే నీటిలో అరకప్పు వెనిగర్‌, టేబుల్‌స్పూన్‌ తేనె కలుపుకోండి. స్నానం పూర్తయ్యాక ఈ నీటిని శరీరంపై నుంచి పోసుకోవడం వల్ల పొడి చర్మం, దురద.. రెండూ క్రమంగా తగ్గుముఖం పడతాయి. అలాగే చర్మం మృదువుగా కూడా మారుతుంది.

* ఒకవేళ మీరు బాత్‌టబ్‌లో స్నానం చేయాలనుకుంటే అందులో గోరువెచ్చటి నీటిని నింపి.. ఆపై కొద్దిగా పాల పొడి కలపండి. ఈ మిశ్రమంలో కాసేపు సేదదీరితే పొడి చర్మం, దురద.. వంటి సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. చర్మానికి పోషణ కూడా అందుతుంది.

* ఇక స్నానం పూర్తయ్యాక నాణ్యమైన మాయిశ్చరైజర్‌ రాసుకోవడం తప్పనిసరి. తద్వారా చర్మం తేమను కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు. చలికాలంలో పొడి చర్మం సమస్య నుంచి విముక్తి పొందాలంటే స్నానం చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారుగా! అయితే మరి మనమూ ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించేద్దాం.. మృదువైన చర్మాన్ని సొంతం చేసుకుందాం..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్