Published : 06/09/2021 20:31 IST

ఇష్టం లేని మొగుడితో సంసారం చేయించాలని చూశారు!

ముక్కుపచ్చలారని వయసులో బలవంతంగా మూడుముళ్లు వేయించుకుని, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో ఇంటెడు చాకిరీ చేస్తూ, చదువుకోవాల్సిన వయసులో చంకన చంటి బిడ్డనెత్తుకొని.. ఇలా బాల్య వివాహపు ఊబిలోకి కూరుకుపోయిన ఆడపిల్లల వెతలు ఇప్పటికీ అడపాదడపా కనిపిస్తూనే ఉంటాయి. తన జీవితమూ ఇందుకు మినహాయింపు కాదంటోంది హరియాణాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రేషమ్‌. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలన్న తన కలల్ని కూలదోసి పదేళ్ల వయసులోనే తన తండ్రి తనను బలవంతంగా పెళ్లి కూపంలోకి తోసేశాడని చెబుతోంది. అలాగని తాను అందరిలా చేతులు ముడుచుక్కూర్చోలేదు.. తనకు ఇష్టం లేకుండా చేసిన ఈ పెళ్లి చెల్లదని కోర్టుకెక్కింది. ఏళ్ల పాటు పోరాడి విజయం సాధించింది. అంతేకాదు.. తనలా మరెవరూ బలవకూడదని ఎక్కడ బాల్య వివాహం జరిగినా బాధితులకు తానున్నానంటూ అండగా నిలుస్తోంది. ఆడపిల్లలకూ ఇష్టాలు, కోరికలు ఉంటాయని, వాటిని లాగేసుకునే హక్కు కన్న వారికీ లేదంటూ తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

ఆడపిల్ల పుడితే బాధ్యతగా కంటే బరువుగా భావించే తల్లిదండ్రులు ఈ కాలంలోనూ ఉన్నారు. నా తండ్రి కూడా ఇందుకు మినహాయింపు కాదు. హరియాణాలోని ఓ మారుమూల గ్రామం మాది. ఆడపిల్లలంటే ఇక్కడ అందరికీ చిన్న చూపే! అమ్మాయిలు చదువుకోకూడదు.. ఉద్యోగాలు చేయకూడదు.. వారికి నచ్చిన రంగంలో రాణించకూడదు.. ఇలా మా గ్రామంలో ఆంక్షలకు కొదవే లేదు.

******

అయితే మా అమ్మకు మాత్రం నేను నా అన్నయ్యతో పాటే బాగా చదువుకోవాలని ఉండేది. ఇంట్లో నాన్న పెత్తనంతో అది జరగలేదు. నాకు ఆరేళ్ల వయసొచ్చిందో లేదో పదే పదే నా పెళ్లి ప్రస్తావనే తీసుకొచ్చేవాడు. ‘అది పసి పిల్ల.. అప్పుడే దాని మెడకు ఆ ఉరితాడు ఎందుకు?’ అని అమ్మ సర్దిచెప్తూ వచ్చేది. అలా నాలుగేళ్లకు మించి అమ్మ నా పెళ్లిని ఆపలేకపోయింది. ఈలోగా చదువుపై మక్కువతో మా ఊర్లోని సర్కారు బడికెళ్లి ఐదో తరగతి పూర్తిచేశా. ఇక మా అన్నయ్యనేమో దగ్గర్లోని ప్రైవేట్‌ స్కూల్లో చేర్పించాడు నాన్న. ఇలా చదువనే కాదు.. ప్రతి విషయంలోనూ ఆడ-మగ అన్న వ్యత్యాసం మా ఇంట్లో కొట్టొచ్చినట్టు కనిపించేది. నాకు పదేళ్లు నిండాక ఈసారి పెళ్లి ప్రస్తావన తేవడం కాదు.. ఏకంగా పెళ్లి కొడుకునే తీసుకొచ్చాడు నాన్న. అతను నాకంటే పదిహేనేళ్లు పెద్ద. అసలు నాకు పెళ్లీడు రాకముందే.. నా మనసులో ఏముందో తెలుసుకోకముందే ఇతడే నీకు కాబోయే భర్త అంటూ పెళ్లి ఖరారు చేశాడు. నాకు అప్పుడే పెళ్లి చేయద్దని అమ్మ ఎంత వారించినా తన మొండిపట్టు తనదే!

అలా నా పదేళ్ల వయసులో కేవలం నాన్న ఇష్టంతోనే నా పెళ్లి జరిగిపోయింది. అసలు వివాహబంధమంటే ఏంటో, బరువు బాధ్యతలు ఎలా ఉంటాయో, అత్తారింట్లో ఎవరితో ఎలా మెలగాలో.. ఇవేవీ అప్పటికి నాకు తెలియవు. ఒకరు చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు. మూడుముళ్లు పడ్డాక ఐదేళ్ల పాటు పుట్టింట్లోనే ఉన్నా.. అయినా నాన్న బడికెళ్లనిచ్చేవాడు కాదు.. అలాగని నేను చదువుపై ఇష్టాన్ని వదులుకోలేదు. ఎలాగోలా ఇంట్లోనే చదువుకుంటూ అమ్మ సహాయంతో చాటుమాటుగా వెళ్లి పరీక్షలు రాసేదాన్ని. ఇలా అతి కష్టం మీద పదో తరగతి పూర్తిచేశా. పదిహేనేళ్లొచ్చాక మళ్లీ నాకు నాన్న టార్చర్‌ మొదలైంది. ఇప్పటికే ఆడపిల్లను చాలా రోజులు భరించాను.. ఇక అత్తారింటికి పంపించి బరువు దించుకోవాలనేది ఆయన ఆలోచన! నిజానికి బాల్య వివాహమై.. వయసొచ్చాక ఆడపిల్లను అత్తారింటికి పంపే కార్యక్రమాన్ని మా ఊర్లో పెళ్లిలా ఘనంగా నిర్వహిస్తారు. కానీ నేను అందుకు సిద్ధంగా లేను.

******

చిన్నతనంలో పెళ్లి చేసి నా గొంతు కోస్తుంటే ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు లోకం పోకడ తెలుస్తోంది. ఏది మంచో, ఏది చెడో అర్థం చేసుకోగలుగుతున్నాను. అందుకే నేను వెళ్లనంటే వెళ్లనని మొండికేశాను. మరోవైపు నన్ను తీసుకెళ్లడానికి ఓ మంచి రోజు చూసుకొని మా అత్తింటి వాళ్లొచ్చారు. కానీ నేను వెళ్లడానికి ససేమిరా అన్నా. ‘ఇదేం విడ్డూరమమ్మా.. అత్తారింటికి వెళ్లనంటావేంటి?’ అంటూ ఇరుగుపొరుగు వాళ్ల సాగదీతలు. ‘తల్లివి.. నువ్వైనా అమ్మాయికి మంచేదో, చెడేదో చెప్పకూడదూ! అయినా పెళ్లైన అమ్మాయిని ఇలా ఎన్నాళ్లని ఇంట్లోనే అట్టే పెట్టుకుంటారు’ అంటూ నా వల్ల అమ్మ కూడా మాటలు పడాల్సి వచ్చింది. అయినా నేనేదో వాళ్ల మీద ఆధారపడినట్లు మాట్లాడారు. మరోవైపు బంధువులు, ఊరి వాళ్లు కూడా నేనేదో తప్పు చేసినట్లుగా మాట్లాడేవారు. ఇంట్లో నాన్న పెట్టే హింస కంటే వాళ్లనే మాటలే మనసును మరింతగా మెలిపెట్టేవి.

******

ఇలా అతి కష్టం మీద రోజులు గడుస్తున్న సమయంలో ఓ రోజు మా ఇంటికి మా దూరపు బంధువు ఒకరొచ్చారు. రెండ్రోజులు మా ఇంట్లోనే ఉందావిడ. ఆవిడతో మాట్లాడుతున్నంత సేపు మా అమ్మతో గడుపుతున్నట్లే అనిపించేది. ఓ వారం పాటు నన్ను వాళ్లింటికి తీసుకెళ్తానంది. ఎందుకో నాకూ కాస్త ఉపశమనంగా ఉంటుందనిపించింది. నాన్నను అడిగితే ఒప్పుకోడనుకున్నా.. కానీ వెళ్లమనేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. అమ్మకు మాత్రం ఎక్కడో సందేహంగానే అనిపించింది. సరే.. కాస్త స్థలమార్పిడి ఉంటుందన్న ఉద్దేశంతో ఆవిడతో పంపించడానికి సరేనంది. వారానికి సరిపడా లగేజ్‌ సర్దుకొని బయల్దేరా.. తీరా ఇంట్లోకి వెళ్తే గానీ తెలియలేదు.. అది మా అత్తారిల్లని!

‘ఎంత మోసం చేశారు.. నేను రావట్లేదని కిడ్నాప్‌ చేసి నన్ను తీసుకురావాలని చూశారు’ అని భావించిన నేను అక్కడ్నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించా! కానీ కుదరలేదు. ‘ఎక్కడికెళ్తావే.. ఇకపై ఇదే నీ ఇల్లు.. ఇతడే నీ మొగుడు’ అంటూ మా అత్తింటి వాళ్లు నన్ను ఇంట్లోనే బంధించేశారు. నాన్నతో పాటు వీళ్లందరూ కలిసే ఈ కిడ్నాప్‌ ప్లాన్‌ అల్లారని నాకు అప్పుడు అర్థమైంది.

ఈ విషయం ఎలాగోలా అమ్మకు చేరవేయాలనుకున్నా. కానీ అదంత సులభంగా జరగలేదు. అత్తారింట్లో పరిస్థితులు దినదిన గండంగా మారాయి. నాకు ఇష్టం లేని మొగుడితో సంసారం చేయాల్సిందేనని బలవంతపెట్టేవారు. అతడూ నా ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా ప్రవర్తించేవాడు. కానీ ఓ రోజు రాత్రి అందరూ పడుకున్న సమయంలో అక్కడి నుంచి ఎలాగోలా బయటపడ్డా. మా పుట్టింటికి వెళ్లి అమ్మ మీద పడి భోరుమన్నా. అత్తింట్లో నుంచి పారిపోయి వచ్చిందని నలుగురు నానా మాటలన్నా నేను, అమ్మ పట్టించుకోలేదు. ఇక ఇలా అయితే లాభం లేదని, నాకు ఇష్టం లేని సంసారం చేయలేనని ఫ్యామిలీ కోర్టుకెళ్లా. కేసు పలు మలుపులు తీసుకుంటూ తీర్పు రావడానికి నాలుగేళ్లు పట్టింది. అయినా సంతోషమే.. ఎందుకంటే నా ఇష్టానికి అనుగుణంగానే తీర్పొచ్చింది. న్యాయమే గెలిచింది. ఆడపిల్లలకూ స్వతంత్రత ఉందని, ఇష్టం లేకుండా చేసిన పెళ్లి చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అలా నాకు బంధ విముక్తి కలిగింది. ఈ క్రమంలో అమ్మ నా వెన్నంటే నిలిచింది. ఇక నా తరఫున వాదించిన మహిళా లాయర్‌ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.

******

ఇలా నాకు పూర్తి స్వేచ్ఛ దొరికింది. కోర్టు తీర్పుతో నాన్నలోనూ క్రమంగా మార్పొచ్చింది. నాకు ఇష్టమైన చదువుపై దృష్టి పెట్టా. డిగ్రీ పూర్తి చేశా. ప్రస్తుతం ఉద్యోగాన్వేణలో ఉన్నా. మరోవైపు నాలాంటి పరిస్థితి మరే ఆడపిల్లకు రాకూడదని.. బాల్య వివాహాలకు అడ్డు కట్ట వేసే ఓ ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్నా. నా పూర్వానుభవంతో బాల్య వివాహాలు, వాటి వల్ల కలిగే నష్టాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న నేను.. వాటన్నింటినీ తల్లిదండ్రులకు చెప్పి వారిలో కొంతైనా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా.. మరోవైపు ఆడపిల్లల్ని బడికి పంపించేందుకూ తల్లిదండ్రుల్ని ఒప్పిస్తున్నా. ఇలా ప్రస్తుతానికి బాల్య వివాహాల్ని ఆపడానికి నా వంతుగా కృషి చేస్తున్నా. అలాగని ఇది నా ఒక్కదాని బాధ్యత అని నేను చెప్పను. నేనొక్కదాన్ని పోరాడితేనే ఈ సమస్య అంతం కాదు. ఇందులో తర, తమ భేదాల్లేకుండా ప్రతి ఒక్కరూ భాగం కావాలి.. బాల్య వివాహం అనేది ఒక దురాచారం అని తల్లిదండ్రులందరికీ అవగాహన రావాలి. అప్పుడే ఆడపిల్లలకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుందని నా నమ్మకం!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని