ఆయన సిగరెట్ల వల్ల నేనూ బలైపోయా!

కొన్ని అలవాట్లు మన జీవితాన్నే మార్చేస్తాయి. మంచి అలవాట్లు మన జీవితాన్ని ఎంత చక్కటి దారిలోకి తీసుకెళ్తాయో.. చెడు అలవాట్లు అంతకుమించి ప్రాణాపాయాన్ని కలిగిస్తాయి. కానీ మనం ఎలాంటి తప్పూ చేయకుండానే మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. జీవితాన్ని నరకప్రాయంగా మార్చుతుంది పొగ తాగడం అనే అలవాటు.. మనం సిగరెట్లు తాగకపోయినా.....

Published : 13 Mar 2022 13:06 IST

కొన్ని అలవాట్లు మన జీవితాన్నే మార్చేస్తాయి. మంచి అలవాట్లు మన జీవితాన్ని ఎంత చక్కటి దారిలోకి తీసుకెళ్తాయో.. చెడు అలవాట్లు అంతకుమించి ప్రాణాపాయాన్ని కలిగిస్తాయి. కానీ మనం ఎలాంటి తప్పూ చేయకుండానే మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. జీవితాన్ని నరకప్రాయంగా మార్చుతుంది పొగ తాగడం అనే అలవాటు.. మనం సిగరెట్లు తాగకపోయినా మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొలీగ్స్ వల్ల.. వారి పొగతాగే అలవాటు వల్ల మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. ఇదే విషయాన్ని చెబుతూ తన జీవితాన్నే ఉదాహరణగా చూపిస్తున్నారు పుణేకు చెందిన సుమన. ఇంతకీ ఆమె కథేంటో తన మాటల్లోనే విందాం..

నా పేరు సుమన. నాకు చిన్నతనంలోనే మా బావతో పెళ్లి జరిగింది. తను ఓ పెద్ద ఇంజినీర్. పనిలో భాగంగా ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది.. ప్రతి విషయమూ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునేవారాయన. స్ట్రిక్ట్‌గానూ ఉండేవారు. అయితే ఆయనకున్న చెడు అలవాటల్లా ఒకటే.. అదే పొగతాగడం.. అదే ఆయన జీవితాన్ని నాశనం చేస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. పొగతాగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని నాకు అప్పట్లో పెద్దగా తెలియకపోయినా.. నాకున్న అవగాహనతో సిగరెట్ మానేయమని ఆయనకు సలహా ఇస్తుండేదాన్ని. అయితే మావారు ఎప్పుడూ నా సూచనలు పట్టించుకోలేదు. ఆయన నా మాట విని ఉంటే ప్రస్తుతం నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో.
ఉన్నట్లుండి ఓసారి ఆయనకు స్ట్రోక్ వచ్చింది. హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించాం. కొన్నిరోజులకు ఆయన బాగయ్యారు. ఇప్పుడైనా పొగతాగడం మానేయమని ఆయనను బతిమాలేదాన్ని. కానీ ఆయన వినలేదు. సిగరెట్ల సంఖ్య తగ్గించారే కానీ పూర్తిగా మానేయలేదు. ముందు కంటే కాస్త మేలు అనుకున్నా. ఆ తర్వాత ఐదేళ్లకు ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈసారి డాక్టర్లు పొగతాగడం పూర్తిగా ఆపితేనే ఆరోగ్యం బాగవుతుందని ఆయనను హెచ్చరించారు. దాంతో ఆయన సిగరెట్ మానేశారు. ఆపై తొమ్మిదేళ్లకు ఆయన నిద్రలోనే చనిపోయారు. ఇది నాపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. పిల్లల సహకారంతో కొన్నాళ్లకు తిరిగి మామూలు మనిషినయ్యా..

అయితే కొద్దిరోజుల తర్వాత నా గొంతు పీలగా మారడం గమనించా. ఎంత కష్టపడినా గట్టిగా మాట్లాడలేకపోయేదాన్ని. దీంతో డాక్టర్‌ని సంప్రదించాను. వారు పరీక్షలేమీ చేయకుండానే మందులు రాసిచ్చారు. సంవత్సరం పాటు అవే మందులు వాడాను. అయితే ఒకరోజు రాత్రి పూర్తిగా వూపిరి కూడా పీల్చుకోలేని స్థితిలో ఉండగా మా పిల్లలు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. దీంతో డాక్టర్లు పరీక్షలన్నీ చేసి నా గొంతులో అల్సర్ ఉందని చెప్పారు. అయితే అసలు కారణం అది కాదని వారి మాటల ద్వారా నాకు తెలుస్తూనే ఉంది.. కొన్ని రోజులకు అసలు నిజం నాకు తెలిసింది. నాకు క్యాన్సర్ ఉందని.. ఆపరేషన్ చేసి నా స్వరపేటికతో పాటు థైరాయిడ్ గ్రంథిని కూడా తొలగించాలని.! ఈ విషయం విన్న తర్వాత నేను ఎంతో కుంగిపోయాను. నాకే ఎందుకు ఈ సమస్య వచ్చిందా అని ఏడ్చాను. జీవితంలో ఎప్పుడూ ఒక సిగరెట్ కూడా తాగలేదు. కట్టెల పొయ్యి కూడా ఉపయోగించలేదు. అలాంటప్పుడు నాకు ఈ సమస్య ఎందుకొచ్చిందా? అని ఆరా తీశా. అప్పటివరకూ నాకు తెలియని ఓ నిజం తెలిసింది. నేను సిగరెట్ తాగితేనే కాదు.. నా చుట్టుపక్కల ఉన్నవారు సిగరెట్ తాగినా దాని ప్రభావం నాపై ఉంటుందని, దీన్నే 'పాసివ్ స్మోకింగ్' అంటారని తెలుసుకున్నాను.

ఆ బాధలో ఉండగానే నా స్వరపేటిక, థైరాయిడ్ గ్రంథి తొలగించారు. నా గొంతుకు ఓ రంధ్రాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని 'స్టోమా' అంటారట. నా కడుపుకి ఓ పీఈజీ ట్యూబ్‌ని ఏర్పాటుచేసి దాని ద్వారా ఆహారాన్ని తీసుకునే ఏర్పాటు చేశారు. వాయిస్ ప్రోస్థసిస్ ద్వారా నా గొంతులో మెషీన్ ఏర్పాటు చేసి దాని సాయంతో నేను మాట్లాడగలిగే ఏర్పాటు చేశారు వైద్యులు.

ఒకప్పుడు నేను చాలా తక్కువగా మాట్లాడేదాన్ని. ఈ రెండో జీవితంలో మాట్లాడే శక్తిని ఇచ్చి దేవుడు మనకు ఎంత మేలు చేశాడో నేను అర్థం చేసుకున్నా. ఇప్పటికీ మాట్లాడేటప్పుడు గొంతు దగ్గరున్న రంధ్రాన్ని మూస్తూ, తెరుస్తూ మాట్లాడాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ నాకు హ్యాండ్స్ ఫ్రీ డివైజ్‌ని ఏర్పాటు చేస్తామని దానివల్ల ఎలాంటి శ్రమా లేకుండా సాధారణంగానే మాట్లాడే వీలుంటుందని చెప్పినప్పుడు ఎంతో ఆనందం కలిగింది.

*****

ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నా అంటే.. పొగ తాగడం ఎంత ప్రమాదకరమైనదో చెప్పడానికే.. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఫ్యాషన్ పేరుతోనో, ఒత్తిడి పేరుతోనో సిగరెట్లు తాగుతున్నారు. ఆడైనా, మగైనా.. ఎవరైనా సరే పొగతాగడం వల్ల మీతో పాటు, మీ ఇంట్లో వాళ్లకు కూడా ఇబ్బందే.. అలాగే మీ ఇంట్లో లేదా ఆఫీసులో మీ పక్కన ఎవరైనా పొగ తాగేవారుంటే దానివల్ల మీ ఆరోగ్యమూ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే మీ కోసం, మీ వాళ్ల కోసం పొగ తాగడం మానేయండి. మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఎవరైనా పొగ తాగేవారుంటే ఎన్ని ఇబ్బందులెదురైనా సరే.. వారితో పోరాడైనా ఆ అలవాటును మాన్పించండి. దీనివల్ల మీ కుటుంబమంతా ఆనందంగా ఉండగలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్