కాస్త ఓపికుంటే మొండిఘటాల్నీ మార్చుకోవచ్చు..!

పిల్లలకు కోరిందల్లా కొనిస్తాం.. ఏం చేసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తాం.. వాళ్ల మాటలు, చేతలకు మురిసిపోతాం.. అయితే ఈ అతిగారాబమే వివిధ అనర్థాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలు మొండిగా తయారవడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు.

Published : 05 Aug 2023 12:17 IST

పిల్లలకు కోరిందల్లా కొనిస్తాం.. ఏం చేసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తాం.. వాళ్ల మాటలు, చేతలకు మురిసిపోతాం.. అయితే ఈ అతిగారాబమే వివిధ అనర్థాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలు మొండిగా తయారవడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా వాళ్లే కాదు.. పరోక్షంగా తల్లిదండ్రులూ పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. పిల్లల్ని పెంచే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

తల్లిదండ్రులే కారణమట!

చెప్తే వినకపోవడం, మంచి మాటలు చెవికెక్కించుకోకపోవడం, వాళ్లు చెప్పేది-చేసేదే కరక్ట్‌ అన్న ధోరణి.. మొండిగా ఉన్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అసలు చిన్నారులు ఇలా మారడానికి పరోక్షంగా తల్లిదండ్రులూ కొంతవరకు కారణమంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

వృత్తిఉద్యోగాలు, కుటుంబ సమస్యల కారణంగా తలెత్తే ఒత్తిళ్లను పిల్లలపై చూపే పేరెంట్స్‌ చాలామందే ఉంటారు. దీనివల్ల పిల్లల మనసు నొచ్చుకుంటుంది. వారి చిన్ని మనసుల్లో మీపై నెగెటివ్‌ భావన మొదలవుతుంది. ఇదే క్రమంగా వారిని మొండిగా తయారుచేస్తుంది.

ఏది మంచో, ఏది చెడో పిల్లలకు తెలియదు. మంచి విషయం చెప్పినా అర్థం చేసుకునే పరిణతి లేక.. తాము కోరిందే కావాలని పట్టుబడుతుంటారు. అయితే ఇలాంటి పిల్లలు వయసు పెరిగే కొద్దీ పరిణతితో ఆలోచించి.. తమ మొండి ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతర చిన్నారులతో పోల్చుతూ వీరిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. దీనివల్ల పిల్లల్లో ఒక రకమైన ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. తద్వారా సానుకూలంగా ఆలోచించడం పక్కన పెట్టి ప్రతికూలతల వైపే వారి మనసు మళ్లుతుంది. ఇదిలాగే కొనసాగితే కొన్నాళ్లకు మనం చెప్పిన మాట వినే స్థాయి దాటిపోతారు.

పిల్లలకు ప్రతి విషయంలో హద్దులు పెడుతుంటారు కొందరు తల్లిదండ్రులు. తద్వారా వాళ్లకు నచ్చిన పనుల్నీ పూర్తిచేయలేకపోతారు. ఇది వారిలో అభద్రతకు దారితీస్తుంది. ఫలితంగా తమ సంతోషం కోసం ఇకపై ఎవరిమాటా వినకూడదన్న ఆలోచనలోకి వెళ్లిపోతారు. అంటే.. ఇదీ ఓ తరహా మొండితనమేనన్నమాట!

ఏదైనా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పిల్లల్లో ఎక్కువ. అయితే ఇది పెరిగి పెద్దయ్యే క్రమంలో చాలావరకు మేలు చేసినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం వారిని మొండిగా తయారయ్యేందుకు ప్రేరేపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చెడు విషయాలకు ప్రభావితమవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుందట!

పిల్లలతో ఇలా మెలగండి!

పిల్లలు మొండిగా మారకూడదన్నా, వాళ్లలో అప్పటికే ఉన్న ఈ ప్రవర్తనను మార్చుకోవాలన్నా.. అది తల్లిదండ్రులు పిల్లలతో మెలిగే విధానం పైనే ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.

పిల్లల ప్రవర్తన ఒక్కోసారి మనకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు వారిని తిట్టో, కొట్టో మార్చుకోవచ్చనుకుంటారు చాలామంది. నిజానికి దీనివల్ల వాళ్లు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరే ఓపిక వహించి వారికి విషయాన్ని సున్నితంగా వివరించాలి.

పిల్లలు చేసే పనులకు అడ్డు చెప్పకుండా.. వారిని ప్రోత్సహించాలి. ఈ క్రమంలో పొరపాట్లు దొర్లినా.. వాటి నుంచి వారు పాఠాలు నేర్చుకోగలుగుతారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.. ఇది మొండితనం, ప్రతికూల ఆలోచనలు వారి దరిచేరనివ్వదంటున్నారు నిపుణులు.

పిల్లల ప్రవర్తన ఒక్కోసారి మనకు నవ్వు తెప్పిస్తుంటుంది. ముఖ్యంగా వాళ్లకు తెలియక చేసిన కొన్ని తప్పులు సరిదిద్దడానికి బదులు మనం ఇలా నవ్వామంటే.. వాళ్లు అదే సరైందేమోననే భావనలోకి వెళ్లిపోతారట! కాబట్టి తప్పొప్పుల గురించి వారికి నెమ్మదిగా వివరించి చెప్పాలి.

ప్రతి విషయానికి అరవడం, మీ కోపాన్ని వారిపై ప్రదర్శించడం వల్ల వాళ్ల మొండి ప్రవర్తన తగ్గకపోగా.. మరింత ఎక్కువవుతుంది. ఇక ఇలాంటి పిల్లల్ని మార్చుకోవడం చాలా కష్టం. కాబట్టి కోపతాపాల్ని వీడి సంయమనం పాటించడం మంచిది.

ప్రశంసలంటే పిల్లలకు మహా ఇష్టం. ఇలా కాస్త పొగిడితే చాలు.. అలా ఆకాశంలో విహరించేస్తుంటారు.. అంతేకాదు.. ఇలాంటి పొగడ్తలతో మొండి ఘటాల్ని కూడా క్రమంగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు.

తల్లిదండ్రులకు తమ కెరీర్‌ ఎంత ముఖ్యమో.. పిల్లల బాధ్యతా అంతే ముఖ్యం. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు తగిన సమయం కేటాయించాలి. లేదంటే అమ్మానాన్న తమను పట్టించుకోవట్లేదనే భావన వారిని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది వారిని మొండిగా తయారుచేసే ప్రమాదమూ లేకపోలేదు.

పిల్లల్ని ఎప్పుడూ బిజీగా ఉంచాలి. ఈ క్రమంలో వారికి నచ్చిన ఆటలు, ఈత, నాట్యం.. వంటి వ్యాపకాల్లో వారిని ప్రోత్సహించాలి. తద్వారా ఇతర అంశాల పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీ పిల్లల ప్రవర్తనలో మార్పు రాకపోతే.. ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం మంచిది. తద్వారా వారిచ్చే కౌన్సెలింగ్‌, ఇతర థెరపీలతో చిన్నారుల్లో క్రమంగా మార్పు గమనించచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్