ఉగాది ‘ఫేస్ ప్యాక్స్’తో మెరిసిపోదామా?!

తెలుగు లోగిళ్లన్నీ సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. పచ్చపచ్చటి తోరణాలతో, రంగురంగుల పూలతో.. ముంగిళ్లన్నీ అలంకరించుకుని ముగ్ధమనోహరంగా ముస్తాబయ్యే తరుణమే ‘ఉగాది’. మరి ఈ పండగ స్పెషల్‌ ఉగాది పచ్చడి. అయితే ఇది ఆరోగ్యాన్ని అందించడానికి....

Published : 01 Apr 2022 12:16 IST

తెలుగు లోగిళ్లన్నీ సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. పచ్చపచ్చటి తోరణాలతో, రంగురంగుల పూలతో.. ముంగిళ్లన్నీ అలంకరించుకుని ముగ్ధమనోహరంగా ముస్తాబయ్యే తరుణమే ‘ఉగాది’. మరి ఈ పండగ స్పెషల్‌ ఉగాది పచ్చడి. అయితే ఇది ఆరోగ్యాన్ని అందించడానికి మాత్రమే కాదు.. ఇందులో వాడే ఆరు పదార్థాలు అందాన్ని ద్విగుణీకృతం చేయడానికీ ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..!

వేపతో..

* వేప పువ్వు చర్మ సంబంధిత సమస్యలన్నీ తొలగిస్తుంది. ఇందుకోసం వేప పువ్వుల్ని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలున్న చోట అప్త్లె చేస్తే సరిపోతుంది.

* ఇక వేపాకులు.. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలను తొలగిస్తాయి. గుప్పెడు వేపాకుల్ని రెండు లీటర్ల నీటిలో మరిగించండి. ఆకులు రంగు మారి నీళ్లంతా ఆకుపచ్చగా అయ్యేంత వరకు మరగనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టుకొని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ స్నానం చేసే నీటిలో మూడు టేబుల్‌స్పూన్ల చొప్పున కలుపుకొని స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్‌హెడ్స్‌తో పాటు వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి.

* దీన్ని స్కిన్ టోనర్‌గానూ వాడచ్చు.. ఈ నీటిలో ఓ కాటన్ బాల్‌ని ముంచి రోజూ రాత్రి ముఖాన్ని తుడుచుకోండి. దీనివల్ల పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు.. వంటివన్నీ తగ్గిపోతాయి.

* వేపాకుల్ని మెత్తగా చేసి ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. అదెలాగంటే.. కొన్ని వేపాకులను తీసుకుని, అందులో కాస్త నారింజ తొక్కల పొడిని కలిపి కొద్దిపాటి నీటితో మెత్తని గుజ్జులా మారే వరకు మరిగించాలి. తర్వాత దాంట్లో కొద్దిగా తేనె, పెరుగు, సోయాపాలు వంటివి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయండి.. ఫలితంగా మొటిమలు, వైట్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మానికి తేమనందిస్తుంది. ఈ ప్యాక్‌ని వారానికి మూడు సార్లు వేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

* కొన్ని వేపాకులను తగినన్ని నీళ్లలో వేసి మరిగించండి.. ఇందులో కొద్దిగా తేనెను కలిపి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జును జుట్టుకు పట్టించి, అరగంట ఆరనిచ్చి తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. బిరుసుగా ఉన్న జుట్టును పట్టులా, మెత్తగా, మృదువుగా మారుస్తుంది. అలాగే చుండ్రును కూడా తొలగిస్తుంది.

మామిడితో..

మామిడిలో ఉండే గుణాలు నల్లమచ్చలు, మొటిమలు..వంటి సమస్యల్ని పోగొట్టి ముఖంలో కొత్త కాంతిని నింపుతాయి. మామిడిని స్క్రబ్బింగ్, ట్యానింగ్, ఫేస్‌వాష్, ఫేస్ ప్యాక్.. ఇలా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బాదం, ఓట్ మీల్.. లాంటి వాటితోనూ మామిడి గుజ్జుని కలిపి ముఖాన్ని అందంగా మెరిపించుకోవచ్చు.

* పచ్చి మామిడి కాయలను నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఇలా తయారైన నీటిని దెబ్బ తగిలిన ప్రాంతంలో రాస్తే రక్తస్రావం తగ్గుతుంది. అలాగే ఈ నీటితో ముఖం శుభ్రపరుచుకుంటే మొటిమలు, మచ్చలు.. వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు.

* మండే వేసవిలో చర్మంపై ట్యాన్ ఏర్పడటం సహజమే..! ఆ ట్యాన్‌ను మామిడితో వదిలించొచ్చు.. ఇందుకోసం మనకు కావాల్సిందల్లా ఒక చెంచా గోధుమ పిండి, కొద్దిగా మామిడి పండు గుజ్జు. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి వదిలేయండి. అలా ఒక అరగంట ఆరనిచ్చి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే సరి..! ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలు బాగా తెరుచుకుని, అందులో పేరుకున్న మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. ఫలితంగా ట్యాన్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

* చర్మ రంగు కాస్త తక్కువగా ఉన్న వారు మెరిసిపోవాలంటే ఈ ప్యాక్‌ను ప్రయత్నించి చూడండి. చెంచా మామిడి గుజ్జులో కొద్దిగా బాదం పేస్ట్ వేసి, మూడు చెంచాల పాలు పోసి మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.

* మామిడి తొక్కను బాగా ఎండబెట్టి తయారుచేసిన పొడిని స్క్రబ్బింగ్‌ కోసం ఉపయోగించచ్చు. ఈ పొడిలో కాస్త పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా ఒక అరగంట ఆరనిచ్చి ఆ తర్వాత గుండ్రంగా రుద్దుకోవాలి. ఆపై శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

చింతపండుతో..

* రెండు టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జులో అర టీస్పూన్ గంధం పొడి, అర టీస్పూన్ ముల్తానీ మట్టి, కొద్దిగా పెరుగు, కొన్ని చుక్కల రోజ్‌వాటర్.. వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరి..! ఇది ముఖాన్ని తాజాగా ఉంచడంతో పాటు చర్మ సమస్యల్నీ దూరం చేస్తుంది.

* కొద్దిగా చింతపండు గుజ్జులో అర టీస్పూన్ చొప్పున పసుపు, బార్లీ పొడి, నాలుగైదు చుక్కల రోజ్‌వాటర్, కీరదోస రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసి పూర్తిగా ఆరిపోయేంత వరకు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఆపై మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్