Plus Size Fashions: మీ వార్డ్‌రోబ్‌లో ఇవి ఉన్నాయా?
స్టైల్‌ని సైజుతో ముడిపెట్టకుండా.. ప్లస్ సైజ్ మహిళల వార్డ్‌రోబ్‌లోనూ కొన్ని ఫ్యాషన్లు తప్పనిసరిగా ఉండాలంటున్నారు. తద్వారా వారి స్టైలే కాదు.. ఆత్మవిశ్వాసమూ ఇనుమడిస్తుందంటున్నారు. మరి, అవేంటి? లావుగా ఉన్నా వాటితో ఎలా మెరిసిపోవచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి
‘జీన్సా.. వేసుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తానేమో?’, ‘స్కర్ట్స్ ఎంచుకుంటే నలుగురూ ఏమనుకుంటారో..?’ లావుగా ఉండే వారు ఇలా తాము ఎంచుకునే దుస్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. చూసేవారు నవ్వుతారేమోనన్న ఉద్దేశంతో తమకు నచ్చిన దుస్తుల్నీ పక్కన పెట్టేస్తుంటారు. ఇక ఈ వడపోతలన్నీ పోను.. వారి వార్డ్‌రోబ్‌లో ఉండే ఫ్యాషన్ ఆప్షన్లను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. అయితే లావుగా ఉన్నంత మాత్రాన ఇలా మనసు చంపుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. స్టైల్‌ని సైజుతో ముడిపెట్టకుండా.. ప్లస్ సైజ్ మహిళల వార్డ్‌రోబ్‌లోనూ కొన్ని ఫ్యాషన్లు తప్పనిసరిగా ఉండాలంటున్నారు. తద్వారా వారి స్టైలే కాదు.. ఆత్మవిశ్వాసమూ ఇనుమడిస్తుందంటున్నారు. మరి, అవేంటి? లావుగా ఉన్నా వాటితో ఎలా మెరిసిపోవచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
‘జీన్స్’.. కంఫర్టబుల్‌గా!
లావుగా ఉన్న మహిళలు పక్కన పెట్టే ఫ్యాషన్లలో జీన్స్ ముందు వరుసలో ఉంటుంది. ఇది వేసుకుంటే తమ శరీరాకృతి ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, తద్వారా మరింత లావుగా కనిపిస్తామేమోనన్న ఉద్దేశంతో దీన్ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ శరీరాకృతితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఈ ఫ్యాషన్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాస్త లావుగా ఉన్న వారు.. తమ నడుము చుట్టుకొలతను బట్టి జీన్స్‌ని ఎంచుకోవడంతో పాటు.. ముదురు రంగులో ఉన్న వాటికి ప్రాధాన్యమివ్వడం ముఖ్యమంటున్నారు. అలాగే హై-వెయిస్ట్ స్టైల్, సాగే గుణం ఉన్న మెటీరియల్‌తో తయారుచేసిన జీన్స్‌ని ఎంచుకుంటే కాస్త నాజూగ్గా కనిపించే అవకాశం ఉంటుందట! మరీ బిగుతుగా ఉన్న జీన్స్ వేసుకోవడానికి అసౌకర్యంగా అనిపిస్తే.. కింది భాగంలో వదులుగా ఉండేలా లేదంటే ఓవర్ సైజ్‌డ్ జీన్స్‌ని ఎంచుకోవచ్చు. పైగా ఇప్పుడిదే ట్రెండ్ కూడా! ఇలాంటి జీన్స్‌కి జతగా షర్ట్స్, క్రాప్‌టాప్స్, బ్లేజర్స్, పెప్లమ్ టాప్స్.. మీకు నచ్చిన/నప్పినవి ఏవైనా కంఫర్టబుల్‌గా ధరించి మెరిసిపోవచ్చు.
స్టైలిష్ ‘స్కర్ట్’!
ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్స్‌లో స్కర్ట్స్ ముందుంటాయి. స్టైలిష్ లుక్‌తో పాటు సౌకర్యాన్నీ అందించే ఇవి శరీరాకృతినీ ఇనుమడింపజేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ప్లస్ సైజ్ మహిళలు వీటిని నిస్సంకోచంగా ఎంచుకోవచ్చంటున్నారు. ఫుల్ లెంత్, ప్లీటెడ్, డెనిమ్, ఎ-లైన్.. ఇలా విభిన్న డిజైన్లలో రూపొందించిన స్కర్ట్స్ ప్రస్తుతం అతివల మనసు దోచుకుంటున్నాయి. కాస్త లావుగా ఉన్న వారు స్లిట్ లేకుండా, పొడవుగా ఉన్న మ్యాక్సీ స్కర్ట్స్‌ని ఎంచుకోవచ్చు. ఇవి గుబురుగా ఉండకుండా స్లిమ్ లుక్‌ను అందిస్తాయి. అలాగే శరీరం బయటికి కనిపించకుండా.. సౌకర్యవంతంగానూ ఉంటుంది. కాబట్టి లావుగా ఉన్న వారు ఇలా తమ స్టైల్ కోషెంట్ తగ్గకుండా.. ఫ్యాషన్ విషయంలో రాజీ పడకుండా స్కర్ట్స్‌ని ఎంచుకోవచ్చు.
‘పలాజో’తో పర్‌ఫెక్ట్ లుక్!
పొడవుగా, వదులుగా.. వింటేజ్ స్టైల్‌ని పోలి ఉండే పలాజోలు ఎలాంటి శరీరాకృతికైనా ఇట్టే నప్పేస్తాయి. మరీ సన్నగా ఉన్న వారిని చక్కటి శరీరాకృతిలో, లావుగా ఉన్న వారిని.. వారి శరీరాకృతి కనిపించకుండా దాచేసే ప్రత్యేకతలున్న పలాజోలు ప్లస్ సైజ్ మహిళలకు చక్కటి ఫ్యాషనబుల్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అయితే వీటిలోనూ అడ్డు గీతలున్నవి కాకుండా.. నిలువు గీతలున్నవి ఎంచుకుంటే కాస్త పొడవుగా, సన్నగా కనిపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇందులో ప్యాంట్స్, స్కర్ట్స్ రెండు స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకున్న పలాజోను బట్టి.. షర్ట్స్, క్రాప్‌టాప్స్, కుర్తా.. ఇలా ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అయితే వాటిలోనూ స్లీవ్‌లెస్ కాకుండా.. స్లీవ్స్ ఉన్నవి ఎంచుకుంటే లావుగా కనిపించే కనిపించే అవకాశం తక్కువగా ఉంటుంది.
జాకెట్/బ్లేజర్ ట్రెండ్!
ట్రెడిషనల్ నుంచి వెస్టర్న్ దాకా.. తాము ధరించే ప్రతి అవుట్‌ఫిట్ పైకి జాకెట్‌ను ఎంచుకొని లుక్‌ని పూర్తి చేస్తున్నారు ఈ కాలపు అమ్మాయిలు. అయితే ఈ జాకెట్/బ్లేజర్లను ఎంచుకోవడానికి కూడా ప్లస్ సైజ్ అమ్మాయిలు/మహిళలు ఇబ్బంది పడుతుంటారు. కానీ శరీరాకృతికి తగినట్లుగా ఫిట్‌గా ఉండే వాటిని ఎంచుకుంటే.. ఈ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మార్కెట్లో ఉండే వాటి కంటే.. మీ శరీర కొలతల్ని బట్టి నిపుణులతో కుట్టించుకుంటే మరింత పర్‌ఫెక్ట్ లుక్‌ని సొంతం చేసుకోవచ్చట! ఈ తరహా జాకెట్స్‌ని జీన్స్-టీషర్ట్, స్కర్ట్స్, కొన్ని సందర్భాల్లో చీరలపైకీ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక కార్పొరేట్ స్టైల్ కోరుకునే వారు బ్లేజర్స్‌ని ఎంచుకుంటే ప్రొఫెషనల్‌గా, బాసీ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు. ఇవి లావుగా ఉండే శరీరాకృతిని దాచేస్తాయి కూడా!
‘షేప్ వేర్’ ఉన్నాయా?
లావుగా ఉన్న వారు ఎంత సేపూ సన్నగా కనిపించడం పైనే దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలో వదులైన దుస్తులు ధరించినా.. పొట్ట ఎత్తుగా కనిపించడం, పిరుదులు-తొడలు లావుగా కనిపించడం.. ఇలా ఎక్కడో ఒక చోట లావున్నారన్న విషయం బయటపడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్లస్ సైజ్ మహిళల వార్డ్‌రోబ్‌లో షేప్ వేర్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు నిపుణులు. పొట్ట, నడుము, పిరుదులు, తొడలు, వక్షోజాలు.. ఇలా లావుగా ఉన్న ఆయా శరీర భాగాల్ని కవర్ చేయడానికి ప్రస్తుతం వివిధ షేప్ వేర్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. సాగే గుణం ఉన్న మెటీరియల్‌తో తయారుచేయడం వల్ల ఇవి సౌకర్యాన్నీ అందిస్తాయి.. కాబట్టి లో-దుస్తులుగా వీటిని ధరిస్తే.. మీకు నచ్చిన దుస్తుల్లో స్టైలిష్‌గా మెరిసిపోవచ్చు.
స్టైల్ ‘స్టేట్‌మెంట్’!
దుస్తులే కాదు.. వాటికి మ్యాచింగ్‌గా ధరించే జ్యుయలరీ, ఇతర యాక్సెసరీస్ కూడా మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. అయితే లావుగా ఉన్న మహిళలు.. భారీ ఆభరణాల కంటే సింపుల్ యాక్సెసరీస్‌ని ఎంచుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే హెవీ జ్యుయలరీ వల్ల ఇంకాస్త లావుగా కనిపిస్తామేమోనన్నది వారి భావన. అయితే ఇలాంటి వారు కొన్ని రకాల మోడ్రన్ జ్యుయలరీని ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో స్టేట్‌మెంట్ నెక్ పీసెస్, ఓవర్‌సైజ్‌డ్ ఇయర్ రింగ్స్, పొడవాటి చెయిన్స్, ట్రైబల్ జ్యుయలరీ.. వంటివి వారికి నప్పుతాయంటున్నారు. తద్వారా స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.