Updated : 29/12/2021 21:06 IST

Celebrity Weddings: పెళ్లిళ్లలో ‘ట్రెండ్‌’ సెట్‌ చేశారు!

(Photo: Instagram)

పెళ్లంటే కట్టూ-బొట్టూ దగ్గర్నుంచి వేడుకల దాకా.. కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు పాటించడం ఆనవాయితీ! అయితే వీటిలోనూ కొత్తదనం కోరుకుంటున్నారు ఈ కాలపు వధువులు. పాత పద్ధతుల్ని మార్చి తమ వివాహంలో కొత్త సంప్రదాయాలకు తెరతీస్తూ సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది కొందరు సెలబ్రిటీ వధువులూ ఇదే చేశారు. తద్వారా తమ పెళ్లి వేడుకల్ని ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ’గా నిలుపుకొన్నారు. మరి, అలా తమ పెళ్లితో ‘ట్రెండ్‌’ సెట్‌ చేసిన ముద్దుగుమ్మలెవరో తెలుసుకుందాం రండి..

మహిళా పురోహితురాలే కావాలంటూ..!

సాధారణంగా వివాహాలు, ఇతర శుభకార్యాల్లో పురుషులే పురోహితులుగా వ్యవహరించడం మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్‌ మారుతోంది. ఆలయాల్లో పూజలు, శుభకార్యాలు.. మహిళా పురోహితుల చేతుల మీదుగా జరగడం అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ప్రముఖుల వివాహంలో మహిళా పురోహితురాలికి ప్రాధాన్యమివ్వడం మాత్రం దియా మీర్జా పెళ్లిలోనే తొలిసారి చూశామని చెప్పచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యాపారవేత్త వైభవ్‌ రేఖితో ఏడడుగులు నడిచిందీ ఈ ముద్దుగుమ్మ. అయితే సాధారణంగానే పితృస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే దియా.. తన పెళ్లి ద్వారా మరోసారి ఈ పద్ధతికి కళ్లెం వేసింది.

‘మా వివాహం మహిళా పురోహితురాలు షీలా అత్తా చేతుల మీదుగా జరిగింది. ఒక మహిళ చేతుల మీదుగా వివాహం జరగడం చిన్నతనం నుంచి నేనెక్కడా చూడలేదు. కానీ కొన్నేళ్ల క్రితం నా స్నేహితురాలు అనన్య వివాహంలో ఈ పద్ధతి చూశాను. తన పెళ్లి ఆమె ఆంటీ షీలా అత్తానే జరిపించారు. ఇక నా పెళ్లికి ఆమెనే పురోహితురాలిగా పంపి.. అనన్య నాకు పెద్ద బహుమతి ఇచ్చింది..’ అంటూ తన పెళ్లి ద్వారా స్త్రీపురుష సమానత్వాన్ని చాటుకుంది దియా.

కేవలం ఇదొక్కటే కాదు.. కన్యాదానం, అప్పగింతలు.. వంటి వాటికి కూడా తన వివాహంలో చోటివ్వలేదీ బ్యూటీ. ఇక సహజంగానే పర్యావరణంపై ప్రేమ చూపే ఈ బాలీవుడ్‌ అందం.. తన పెళ్లి ఆద్యంతం పర్యావరణహితమైన వస్తువులు, అలంకరణ సామగ్రినే ఉపయోగించి తనదైన ప్రత్యేకతను చాటుకుంది.


నుదుటన సింధూరం దిద్దింది!

పెళ్లిలో వరుడు వధువు మెడలో తాళి కట్టడం, ఆమె నుదుటన సింధూరం దిద్దడం ఆనవాయితీ! కానీ ఈ పద్ధతిని పూర్తిగా మార్చేసి తన పెళ్లితో కొత్త ట్రెండ్‌ని సెట్‌ చేసింది బాలీవుడ్‌ దివా పత్రలేఖ. తన ప్రియుడు, బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌తో నవంబర్‌లో పెళ్లి పీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ.. తాను తన భర్తతో సింధూరం దిద్దించుకోవడమే కాదు.. తిరిగి తన భర్త పాపిట్లో తిలకం దిద్ది తన వాడిని చేసుకుంది. ఈ క్రమంలో రాజ్ అడిగి మరీ తన భార్యతో తన నుదుటన సింధూరం దిద్దించుకోవడం విశేషం. ‘పదకొండేళ్ల అనుబంధం మాది. ఇదే ప్రేమ, అనురాగం, సమానత్వాన్ని ఏడేడు జన్మలకూ కొనసాగించాలనుకుంటున్నాం..’ అంటూ మురిసిపోయారీ లవ్లీ కపుల్. ఇలా తమ పెళ్లితో భార్యాభర్తలిద్దరూ సమానమే అంటూ చాటి చెప్పారు రాజ్‌-పత్రలేఖ.


వెయిల్‌తో కట్టిపడేసింది!

మన పెళ్లిళ్లలో పద్ధతులే కాదు.. వధూవరులు ధరించే దుస్తులకూ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వధువు తలపై నుంచి ముసుగు (వెడ్డింగ్‌ వెయిల్‌) ధరించి పెళ్లి పీటలపై కూర్చోవడం మన సంప్రదాయం. అయితే అది కూడా ఎరుపు రంగులో జరీ, ఎంబ్రాయిడరీ.. వంటి హంగులద్ది రూపొందించిన వెయిల్‌తో అలంకరించుకోవడం మన హిందూ వివాహాల్లో ఎక్కువగా చూస్తుంటాం. కానీ తన పెళ్లిలో ఈ ట్రెడిషన్‌ని సరికొత్తగా ప్రదర్శించింది సోనమ్‌ చెల్లెలు, ఫ్యాషన్‌ డిజైనర్‌ రియా కపూర్‌. ఈ ఏడాది ఆగస్టులో కరణ్‌ బలూచీని వివాహమాడిన ఆమె.. తన పెళ్లికి ఎరుపు రంగు కాకుండా తెలుపు రంగు చీరను ఎంచుకుంది. దానికి మ్యాచింగ్‌గా ముత్యాలతో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న బ్రైడల్‌ వెయిల్‌ను ధరించి అందరినీ కట్టిపడేసింది.
తనే కాదు.. వరుణ్‌ ధావన్‌ని పెళ్లాడిన నటాషా దలాల్‌ కూడా తన పెళ్లికి సిల్వర్‌ కలర్‌ లెహెంగా ఎంచుకుంది. ఇక మరోవైపు యామీ గౌతమ్‌ తన వివాహంలో ఏళ్ల కిందటి తన తల్లి చీరను ధరించి మెప్పించింది.


అక్కచెల్లెళ్లే అన్నదమ్ములయ్యారు!

భారతీయ పెళ్లిళ్లలో తోబుట్టువులే ప్రత్యేకంగా నిర్వహించే వేడుకలు కొన్నుంటాయి. ‘Phoolon Ki Chadar’ వేడుక కూడా అలాంటిదే! వధువు అన్నదమ్ములు పూలతో అలంకరించిన మంచం నీడలో ఆమెను నడిపిస్తూ వివాహ వేదిక వద్దకు తీసుకురావడమే ఈ తంతు నేపథ్యం. అయితే ఏళ్లుగా వస్తోన్న ఈ సంప్రదాయాన్ని తిరగరాశారు కత్రినా అక్కచెల్లెళ్లు. ఇటీవలే తన ప్రియుడు విక్కీ కౌశల్‌తో ఏడడుగులు నడిచిన క్యాట్‌ను ఆమె సోదరీమణులే వివాహ వేదిక వద్దకు సాదరంగా తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇదే ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. తన ఆరుగురు అక్కచెల్లెళ్లతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుందీ బ్రిటిష్ బ్యూటీ.

‘పెరిగి పెద్దయ్యే క్రమంలో మేమంతా ఒకరికొకరు ప్రాణంగా మెలిగాం. ప్రతి విషయంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం.. ఎంతో కేరింగ్గా ఉన్నాం. నా ఆరుగురు అక్కచెల్లెళ్లే నా బలం. ఈ ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..’ అంటూ భావోద్వేగానికి గురైంది కత్రినా.

ఇలా ఈ సెలబ్రిటీ వధువులు సరికొత్త వివాహ సంప్రదాయాలకు తెరతీసి ఈ ఏడాది సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. మరికొంతమంది తారలు ఈ ఏడాది తమ ఇష్టసఖులతో ఏడడుగులు నడిచి తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు. మరి, ఈ కొత్త జంటల పెళ్లి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!

ప్రణీత సుభాష్‌ - నితిన్‌ రాజు


గుత్తా జ్వాల – విష్ణు విశాల్


సునీత – రామకృష్ణ వీరపనేని


ఆనంది - సోక్రటీస్


విద్యుల్లేఖా రామన్‌ - సంజయ్


శ్రద్ధా ఆర్య – రాహుల్‌ నగల్


అంకితా లోఖండే - విక్కీ జైన్


కార్తికేయ – లోహితా రెడ్డి


జస్ప్రీత్‌ బుమ్రా - సంజనా గణేశన్


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని