విజ్ఞత పెంచే భూనామాసనం

ఈ పిల్లలు ఎప్పుడు పెద్దవుతారో, అల్లరిచేష్టలు ఎప్పుడు మానుకుంటారో, మానసిక పరిపక్వత ఎప్పుడొస్తుందో అని దిగులుపడటం ఏదో సందర్భంలో తల్లులందరూ చేసే పనే. అది నెరవేరేందుకు కూడా ఒక ఆసనం ఉందంటే అతిశయం కాదు. నుదుటి మీద కనుబొమల మధ్య జ్ఞానానికి సూచిక అయిన ఆజ్ఞాచక్ర ఉంటుంది.

Updated : 27 May 2023 05:39 IST

ఈ పిల్లలు ఎప్పుడు పెద్దవుతారో, అల్లరిచేష్టలు ఎప్పుడు మానుకుంటారో, మానసిక పరిపక్వత ఎప్పుడొస్తుందో అని దిగులుపడటం ఏదో సందర్భంలో తల్లులందరూ చేసే పనే. అది నెరవేరేందుకు కూడా ఒక ఆసనం ఉందంటే అతిశయం కాదు. నుదుటి మీద కనుబొమల మధ్య జ్ఞానానికి సూచిక అయిన ఆజ్ఞాచక్ర ఉంటుంది. భూనామాసనం చేస్తే ఆ చక్రం విచ్చుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వేసవిలో చిన్నారులకు ఈ ఆసనాన్ని అలవాటు చేయండి..

ఇలా చేయాలి.. యోగా మ్యాట్‌ మీద కాళ్లు ముందుకు చాపుకొని సదుపాయంగా కూర్చోవాలి. నెమ్మది నెమ్మదిగా కుడికాలును కుడివైపునకు, ఎడమకాలును ఎడమవైపుకు జరపాలి. అలా సాధ్యమైనంతగా జరిపి, రెండు చేతులనూ నేల మీద పెట్టి మెల్లగా ముందుకు వంగాలి. మోచేతులను కింద ఆనించి ఫొటోలో చూపిన విధంగా అరచేతుల్లో చుబుకాన్ని ఉంచాలి. ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి జాగ్రత్తగా కాళ్లను యథాస్థితికి తీసుకురావాలి. ఇది పిల్లలు తేలిగ్గానే చేయగలుగుతారు.  ఆసనం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మధ్యలో కొంచెం సేదతీరి మళ్లీ చేయాలి. ఒకేసారి కాళ్లను దూరం జరపకూడదు. కొన్నిరోజులు ప్రాక్టీస్‌ చేసిన తర్వాత రెండు కాళ్లూ సరళరేఖలా తిన్నగా తీసుకురావడం తేలికవుతుంది.

ఇవీ ప్రయోజనాలు.. ఆజ్ఞాచక్ర తెరుచుకుంటుంది. విజ్ఞత పెరుగుతుంది. పిల్లల్లో అల్లరి తగ్గి నిశ్శబ్దత చోటుచేసుకుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల కాళ్లు, నడుము వెన్నెముక, మెడ, భుజాలు బలపడతాయి. థైరాయిడ్‌ గ్రంథులు క్రమబద్ధమౌతాయి. కీళ్లకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తవు. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. కాలేయం పనితీరు సవ్యంగా ఉంటుంది. కొవ్వు కరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. శరీరం ఉత్తేజితమౌతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఇది నిదానంగా, జాగ్రత్తగా చేయాల్సిన ఆసనం. తొందరపడి ఒకేసారి కాళ్లను దూరంగా జరిపితే ప్రమాదం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్