చిన్న మేయర్, చిన్న ఎమ్మెల్యే.. ప్రజాసేవ కలిపింది ఇద్దరినీ..!

విద్యార్థి సంఘంలో చేరి తోటి విద్యార్థుల కోసం గళమెత్తేలా చేసింది..తర్వాత ప్రత్యక్ష రాజకీయాల దిశగా అడుగు వేయించింది..ఇప్పుడు ఆ సేవే వారితో ఏడడుగులు వేయిస్తోంది..!

Updated : 19 Feb 2022 19:07 IST

(Photos: Instagram)

వాళ్లిద్దరికీ ప్రజాసేవంటే ఇష్టం..

అదే వారిని చదువుకునే దశ నుండి ప్రేరేపించింది..

విద్యార్థి సంఘంలో చేరి తోటి విద్యార్థుల కోసం గళమెత్తేలా చేసింది..

తర్వాత ప్రత్యక్ష రాజకీయాల దిశగా అడుగు వేయించింది..

ఇప్పుడు ఆ సేవే వారితో ఏడడుగులు వేయిస్తోంది..!

వాళ్లే కేరళకు చెందిన యువ మేయర్ ఆర్యా రాజేంద్రన్‌, యువ ఎమ్మెల్యే సచిన్‌ దేవ్‌. ఈ పొలిటికల్‌ కపుల్‌ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ క్రమంలో వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం...

దేశంలోనే అత్యంత చిన్న వయస్కురాలైన మేయర్‌ ఆర్యా రాజేంద్రన్‌, కేరళ అసెంబ్లీలో చిన్న వయస్కుడైన ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. చిన్నతనం నుంచే ప్రజా సేవకు ఆకర్షితులైన వీరు విద్యార్థి దశలోనే విద్యార్థి సంఘం (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరి తోటి విద్యార్థుల హక్కుల కోసం గళమెత్తారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరిన ఈ ఇద్దరిలో ఒకరు దేశంలోనే అత్యంత చిన్న వయసులో మేయర్‌ అయితే మరొకరు చిన్న వయసులో అసెంబ్లీలో అడుగు పెట్టి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టే క్రమంలో మరోసారి వార్తల్లో నిలిచారు.

చిన్న వయసులోనే మేయర్!

‘రాజకీయాలంటేనే రొంపి... అందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి... అవమానాలు భరిస్తూ ముందుకెళ్లాలి. ఇక మహిళలు అయితే ఇందులోకి అడుగు పెట్టకపోవడమే మంచిది’... ప్రస్తుత రాజకీయాలపై నేటి తరం అభిప్రాయాలివి. ఈ కారణాలతోనే దేశానికి వెన్నెముక అని చెప్పుకునే యువత పాలిటిక్స్‌ అంటేనే విముఖత చూపిస్తున్నారు. సామర్థ్యం ఉన్నా మనకెందుకీ తలనొప్పి వ్యవహారాలంటూ మౌనంగా ఉంటున్నారు. అయితే సమర్ధులందరూ ఇలాగే ఇంట్లో కూర్చుంటే సమాజానికి మంచిది కాదంటూ రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తోంది ఆర్యా రాజేంద్రన్. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా... ఎలాంటి రాజకీయ చరిత్ర లేకున్నా... ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే అతి పిన్న వయసులోనే తిరువనంతపురం మేయర్గా ఎంపికై రెండేళ్ల క్రితం యావద్దేశం దృష్టినీ ఆకర్షించింది.

ఆర్య తండ్రి రాజేంద్రన్‌ ఎలక్ట్రీషియన్‌. తల్లి శ్రీలత ఎల్‌ఐసీ ఏజెంట్. మొదటి నుంచీ వీరి కుటుంబం సీపీఎం మద్దతుదారులు. ఈ క్రమంలో ఆరేళ్ల వయసులోనే వామపక్షాల ఆధ్వర్యంలో నడిచే బాల సంఘంలో చేరింది ఆర్య. ఆసియాలోనే అత్యధిక మంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. సుమారు పది లక్షల మంది పిల్లలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పిల్లల్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ద్వారా స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం సంపాదించుకుంది ఆర్య. ఆ ఆత్మవిశ్వాసంతోనే కాలేజీలోనూ తోటి విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపుతూ వచ్చింది. ఈ క్రమంలో బాల సంఘం తరఫున చురుగ్గా సేవలదిస్తుండడంతో ఆమెను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది సీపీఎం అధిష్టానం. అలాగే విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐలో చేరి తోటి విద్యార్థుల హక్కుల కోసం గళమెత్తింది.

రాజకీయాలతోనే అభివృద్ధి!

పార్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసింది ఆర్య. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులపై దృష్టి పెట్టి వారిని బృందాలుగా తయారుచేసింది. తమ అవసరాలు, అభిప్రాయాలను పాలకుల ఎదుట వినిపించేలా వారిలో ధైర్యం నింపింది. అయితే రాజకీయాల ద్వారానే అభివృద్ధికి వేగంగా బాటలు పడతాయని నమ్మిన ఆమె తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికలను వేదికగా చేసుకుంది. ముదవన్ముగల్ వార్డు కౌన్సిలర్‌గా బరిలోకి దిగిన ఆమె సీపీఎం తరఫున పోటీ చేసిన అతిపిన్న వయస్కురాలు కావడం విశేషం.

2020లో జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్య.. అతి పిన్న వయసులోనే  మేయర్‌గా ఎన్నికై వార్తల్లో నిలిచింది. అప్పటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం ఈమె ఎస్‌ఎఫ్‌ఐ స్టేట్ కమిటీ మెంబరుగానూ వ్యవహరిస్తున్నారు.

యంగెస్ట్ ఎమ్మెల్యే..!

ఇక ఆర్య మనువాడబోతున్న సచిన్‌ దేవ్(28) కేరళ అసెంబ్లీలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాడు. సచిన్ తండ్రి కేఎమ్‌ నందకుమార్‌ విశ్రాంత ఉద్యోగి. తల్లి షీజ ప్రభుత్వ టీచర్. సచిన్‌ ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. సచిన్‌కి ప్రజాసేవంటే చాలా ఇష్టం. అతని పొలిటికల్‌ కెరీర్‌ కూడా ఎస్‌ఎఫ్‌ఐతోనే మొదలైంది. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలపై గళమెత్తాడు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. గత సంవత్సరం కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బలుస్సెరి నియోజక వర్గానికి సీపీఎం తరఫున పోటీ చేసి గెలుపొందాడు. తద్వారా ఆ ఎన్నికల్లో గెలుపొందిన అతి చిన్న వయసున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాడు.

ఒకే భావజాలం!

వీరిద్దరి పెళ్లి గురించి ఆర్యే స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ‘పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు, పార్టీతో పంచుకునే ముందు ఇద్దరం కలిసి చర్చించుకున్నాం. అయితే పెళ్లి తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చదువు, ఇతర కారణాల వల్ల దానికి మరింత సమయం పట్టచ్చు. మా ఇరువురి కుటుంబ సభ్యులు మా పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. మేమిద్దరం విద్యార్థి సంఘం (ఎస్‌ఎఫ్‌ఐ)లో సంస్థాగతంగా ఎన్నో స్థాయుల్లో పని చేశాం. రాజకీయంగా ఇద్దరం ఒకే భావజాలాన్ని అనుసరిస్తాం’ అని చెప్పుకొచ్చింది.

ఆర్యా.. గుడ్ క్యాచ్!

వీరి పెళ్లి ప్రకటన వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఈ పొలిటికల్‌ కపుల్‌కి అభినందనలు వెల్లువెత్తాయి. అందులో కేరళకు చెందిన ప్రముఖ నేత శశిథరూర్‌ కూడా ఉన్నారు. ఆయన వారికి శుభాకాంక్షలు చెప్తూ.. కాస్త చమత్కారం కూడా జోడించారు. ఈ సందర్భంగా ఆర్యతో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘సచిన్ దేవ్‌తో వివాహబంధంలోకి అడుగుపెడుతున్న తిరువనంతపురం యువ మేయర్ ఆర్యా రాజేంద్రన్‌కు అభినందనలు. ఇద్దరు గొప్ప క్రికెటర్ల పేర్లను కలిపిపెట్టుకున్న వ్యక్తి దొరకడం మంచి క్యాచ్ అని నేను ఆమెకు చెప్పా. ఈ యువ జంటకు నా ఆశీస్సులు’ అని థరూర్ ట్వీట్ చేశారు. భారత క్రికెట్ స్టార్లు సచిన్ తెందూల్కర్, కపిల్ దేవ్‌ను ఉద్దేశించి ఆయన ఈ మాటన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్