ఆహారానికి అదనపు బలం.. ఫోర్టిఫికేషన్!
యీసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి? .. ఎప్పుడో వందేళ్ల క్రితం గురజాడ అడిగిన ప్రశ్న ఇప్పుడు మన ప్రభుత్వాన్ని వేధిస్తోంది. ఏకంగా దేశంలో సగానికి పైగా మహిళలూ మూడోవంతు పిల్లలూ పోషకాహార లేమితో బాధపడుతోంటే... దాని ప్రభావం లక్షల కోట్ల రూపాయల నష్టంగా దేశ ఆర్థిక వ్యవస్థమీద పడుతోంటే... తప్పనిసరి పరిస్థితుల్లో రంగంలోకి దిగింది ప్రభుత్వం. బియ్యంలో ప్రత్యేకంగా పోషకాలు కలిపి(ఫోర్టిఫికేషన్) సరఫరా చేసేందుకు సన్నద్ధమైంది. ఒక్క బియ్యమే కాదు, ఫోర్టిఫైడ్ ఆహారపదార్థాలు మార్కెట్లో ఇంకా చాలానే కనిపిస్తున్న నేపథ్యంలో- అసలేమిటీ ఫోర్టిఫికేషన్... ఎందుకు, ఎలా చేస్తారూ... దానివల్ల ప్రయోజనాలేమిటీ అన్నది చూద్దాం!
ఇప్పుడంటే కరోనా అన్న అనుమానంతో తుమ్మినా దగ్గినా ఆస్పత్రికి పరిగెడుతున్నాం కానీ కొంతకాలం క్రితం వరకూ ఒకపట్టాన ఆస్పత్రికి వెళ్లే అలవాటు చాలామందికి ఉండేది కాదు. జ్వరం వస్తే రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే అదే పోతుందిలే అనుకోవడం, జలుబు చేస్తే మందులు వేసుకున్నా వేసుకోకపోయినా అది వారం రోజులవరకూ ఎటూ తగ్గదులెమ్మని సర్దిచెప్పుకోవడం... అందరికీ తెలిసిందే. అలా చూసి చూసి అప్పటికీ తగ్గకపోతే పూర్తిగా నీరసించిన పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లేవాళ్లు. డాక్టరు జబ్బు తగ్గడానికి ఇంజెక్షన్లూ మందులతో పాటు బలం పుంజుకోవడానికి ఓ టానిక్కు కూడా రాసిచ్చే వారు. చాలావరకూ అది ఐరన్ లేదా మల్టివిటమిన్ సప్లిమెంట్ అయి ఉండేది.రాను రాను అనారోగ్యంతో సంబంధం లేకుండా టానిక్కులు వాడే పరిస్థితి వచ్చేసింది. పిల్లలతో మొదలుపెట్టి గర్భిణులూ మెనోపాజ్ దశలో ఉన్నవారూ వృద్ధులూ... అందరూ ఏదో ఒక రూపంలో విటమిన్ సప్లిమెంట్లను తీసుకోకతప్పడం లేదు. ఆఖరికి పైసా ఖర్చులేకుండా శరీరం తనంతట తాను తయారుచేసుకునే ‘డి’ విటమిన్‌ని కూడా ఇప్పుడు మాత్రల రూపంలో తీసుకుంటున్నాం. అంతేకాదు, మన దేశంలోనే ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారనీ, ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు పోషకాహారలేమి వల్ల సరైన ఎదుగుదల లేకుండా ఉంటున్నారనీ ప్రభుత్వం చేపట్టిన సర్వేలే చెబుతున్నాయి.
ఐదేళ్లలోపు పిల్లల్లో 68 శాతం మరణాలకు పోషకాహారలోపమే కారణమట. నూటికి ఇరవై మంది పోషకాహారలోపంతో పుడుతుండగా రెండేళ్ల వయసొచ్చేసరికి నలభై మంది పిల్లలు ఆ కోవలో చేరు తున్నారట. ప్రపంచ దేశాల ఆహార పరిస్థితుల గురించి ఏటా విడుదల చేసే గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లోని 107 దేశాల్లో మనం 94వ స్థానంలో- అంటే, ‘తీవ్రంగా ఆకలితో అలమటిస్తున్న దేశా’ల కేటగిరిలో ఉన్నాం.ఈ పరిస్థితి ప్రజారోగ్యం పాలిట పెనుముప్పుగా మారుతుందనీ, ఆరోగ్యంగా ఏపుగా ఎదగాల్సిన పిల్లలు బాల్యంలోనే గిడసబారిపోతున్నారనీ ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తోంటే; ఇది పిల్లల శారీరక, మానసిక సామర్థ్యాల్ని దెబ్బతీస్తుందనీ ఫలితంగా చదువుల్లోనూ ఆటల్లోనూ వెనకబడిపోవడమే కాక పెద్దవాళ్లయ్యాక పనుల్లోనూ రాణించలేరనీ దాంతో దేశ ఉత్పాదక శక్తి తగ్గిపోతుందనీ ఆర్థిక నిపుణులు సెలవిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం 2018లోనే ‘ఎనీమియా ముక్త్ భారత్’ పథకాన్ని ప్రారంభించింది. తిండిలేక ఆకలితో బాధపడటం వేరే సంగతి. కానీ తింటున్నా ఈ పరిస్థితి ఉందీ అంటే- ఆహారంలో సూక్ష్మపోషకాలు లోపించడమే కారణమని తెలుసుకుంది. దాంతో ఇనుము తదితర ఖనిజాలనూ ‘బి’ విటమిన్లనూ బియ్యంలో కలిపి పంపిణీ చేస్తే పేదలందరికీ అన్నిరకాల పోషకాలూ కనీస స్థాయిలోనైనా అందుతాయని భావించి ఆ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం. దానివల్ల ప్రయోజనం కనిపించడంతో ఇప్పుడు పేదలకు ఇచ్చే రేషన్‌లోనూ, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలోనూ అలా పోషకాలు చేర్చిన బియ్యాన్నే పంపిణీ చేయాలని నిర్ణయించింది.
విడిగా ఇవ్వచ్చుగా..?
ఐరన్ సప్లిమెంట్లనూ విటమిన్లనూ టాబ్లెట్ల రూపంలో ఇవ్వచ్చు. కానీ వాటిని తప్పనిసరిగా అందరూ వేసుకుంటున్నారో లేదో పర్యవేక్షించడం సాధ్యం కాదు. మర్చిపోవడం, మందులుగా భావించి మింగడానికి ఇష్టపడకపోవడం లాంటి సమస్యలుంటాయి. అదే ఆహారంలో కలిపేస్తే... చౌకగా పని అవుతుంది, ప్రత్యేకించి పంపిణీ, పర్యవేక్షణ అవసరం ఉండదు. అందుకని ఫోర్టిఫైడ్ బియ్యం ద్వారా సమస్యని పరిష్కరించాలని అనుకుంటోంది ప్రభుత్వం.
ఫోర్టిఫైడ్ బియ్యం అంటే..?
ఏ సూక్ష్మ పోషకాలూ విటమిన్లూ ఖనిజాలూ లోపించడం వల్ల పోషకాహారలోపం తలెత్తుతోందో వాటన్నిటినీ బియ్యంలో చేరుస్తారు. దానికో ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఏదైనా ఒక ఆహార పదార్థానికి మరో పదార్థాన్ని జతచేసి దాన్ని పోషకాలపరంగా సుసంపన్నం చేయడాన్ని ‘ఫోర్టిఫికేషన్’ ప్రక్రియ అంటారు. పంట పండించేటప్పుడే జన్యుమార్పిడి, బ్రీడింగ్ లాంటి పద్ధతుల ద్వారా పోషకవిలువలు పెరిగేలా చర్యలు తీసుకోవడాన్ని ‘బయో ఫోర్టిఫికేషన్’ అంటారు. హైబ్రిడ్ రకాలు ఇలాగే తయారవుతాయి. ఇది మంచి విధానమే కానీ సులభం కాదు. అందుకని చాలావరకూ ఇండస్ట్రియల్ ఫోర్టిఫికేషన్ చేస్తారు. అంటే పరిశ్రమలో తయారయ్యే పదార్థాలకూ, ప్రాసెసింగ్ చేసేవాటికీ అలా చేసే క్రమంలోనే అదనపు పోషకాలను కలుపుతారు. ఉప్పు, నూనెలు, పాలు లాంటి వాటికి అలా చేస్తారు. ఇక, ధాన్యం ఫోర్టిఫికేషన్కి కోటింగ్, డస్టింగ్ లాంటి చాలారకాల పద్ధతులున్నాయి. మనదేశంలో బియ్యం ఫోర్టిఫికేషన్కి ‘ఎక్స్‌ట్రూషన్’ అనే పద్ధతి వాడుకలో ఉంది. ఎక్స్‌ట్రూడర్ మిషన్‌లో పొడిగా ఉన్న బియ్యపు పిండినీ, కలపాలనుకున్న పోషకాలనూ, నీటినీ తగు మోతాదుల్లో పోస్తారు. అవన్నీ సమంగా కలిసిపోయాక ఆ పిండిని మామూలు బియ్యం గింజల్లా తయారుచేస్తుంది ఎక్స్‌ట్రూడర్ మిషన్. కలిపే పోషకాల మోతాదులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయిస్తుంది. అలా తయారైన గింజలన్నీ ఒకే సైజులో అచ్చం బియ్యంలాగే ఉంటాయి. ‘ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్’ అనే వాటిని నేరుగా కాకుండా మామూలు బియ్యంలో కలిపి వాడాలి. కిలో మామూలు బియ్యానికి పది గ్రాములు ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ కలపాలన్నది లెక్క. అలా కలిపిన బియ్యాన్నే ప్రభుత్వం సరఫరా చేయబోతోంది.
మామూలుగా వండవచ్చా?
ఫోర్టిఫైడ్ బియ్యం గింజలూ మామూలు బియ్యంలాగే గట్టిగా ఉంటాయి. బియ్యంలో కలిపేస్తే వాటిని గుర్తుపట్టలేం. ఎప్పట్లాగే బియ్యాన్ని కడిగి వండుకోవచ్చు. ఉడికాక మెతుకుల్లో కూడా ఏమీ తేడా తెలియదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా రైసు మిల్లులు వీటిని తయారుచేస్తున్నాయి. గత రెండేళ్లలో తయారీ సామర్థ్యం 7,250 టన్నుల నుంచి 60వేల టన్నులకు పెరిగింది. ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేయడానికి కిలోకు అరవై పైసలు మాత్రమే అదనంగా ఖర్చవుతుందనీ, కానీ దాని ఫలితంగా ఉత్పాదకత పెరిగి 49,800 కోట్ల లబ్ధి కలుగుతుందనీ ఎఫ్ఎస్ఎస్ఏఐ చెబుతోంది. భవిష్యత్తులో తృణధాన్యాలనూ ఫోర్టిఫై చేసే ఆలోచన ఉంది.
ఫోర్టిఫై చేసినట్లు తెలిసేదెలా?
ఫోర్టిఫైడ్ ఉత్పత్తులను గుర్తించడానికి ఒక అధికారిక చిహ్నం ఉంది. ప్యాక్ చేసిన సంచుల మీద నీలిరంగులో ప్లస్ గుర్తు, దానిపక్కన ‘ఎఫ్’ అన్న ఆంగ్ల అక్షరం ఉంటాయి. ఫోర్టిఫికేషన్‌లో ఏమేమి కలిపిందీ కూడా దానిమీద ముద్రించి ఉంటుంది. 15 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా బియ్యం ఫోర్టిఫికేషన్ని 2019-20లోనే ప్రారంభించాల్సి ఉండగా ఆరు రాష్ట్రాలు ప్రారంభించి గత జూన్ వరకు రెండు లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశాయి.
దానివల్ల ఫలితం కనిపించిందా?
‘మా అబ్బాయి మూడు నెలల్లోనే రెండున్నర కిలోల బరువు పెరిగాడు’ ‘నాకు హిమోగ్లోబిన్ ఏడు దాటేది కాదు, ఇప్పుడు పన్నెండుంది...’ ‘మా పాప చాలా బలహీనంగా ఉందని బడి మాన్పించాం. మధ్యాహ్న భోజనం పెడుతున్నామని టీచరు బలవంతాన తీసుకెళ్లేది. అది తిన్నాక నిజంగానే పాప ఆరోగ్యం మెరుగుపడింది’ ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ జరుగుతున్న చోట ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్లిన పరిశీలకులకు ఇలాంటి మాటలెన్నో వినిపిస్తున్నాయిప్పుడు. కర్ణాటకలోని ఐదారు జిల్లాల్లోనూ యూపీ, గుజరాత్‌లలోనూ దాదాపు ఏడులక్షల మంది పిల్లలకు అక్షయపాత్ర గత నాలుగేళ్లుగా మధ్యాహ్న భోజనంలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వాడుతోంది. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయనీ పిల్లలు ఆరోగ్యంగా చురుగ్గా తయారయ్యారనీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.ఇక, రేషన్ కింద మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఏడాది పాటు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయగా బియ్యం వాడటానికి ముందూ తర్వాతా వారి ఆరోగ్యంలో తేడా స్పష్టంగా తెలిసింది. మహిళల్లోనూ పిల్లల్లోనూ రక్తహీనత సమస్య బాగా తగ్గింది. గుజరాత్, కర్ణాటక, తెలంగాణ... ఎక్కడెక్కడ పైలట్ ప్రాజెక్టుగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేశారో అక్కడ తిరిగి పరీక్షలు నిర్వహించగా పోషకాహారలోపం చాలావరకూ తగ్గుతున్నట్లు గమనించారు.
దేన్నైనా ఫోర్టిఫై చేయొచ్చా?
ఫోర్టిఫికేషన్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పట్నుంచో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో కోల్పోయిన సూక్ష్మపోషకాలను తిరిగి కలపడానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు చాలాకాలంగా ఈ ప్రక్రియని వాడుతున్నాయి. మన దేశంలోనూ వనస్పతిని విటమిన్ ‘ఎ’ తో ఫోర్టిఫై చేయాలని 1953లోనే ప్రభుత్వం చట్టం చేసింది. ఉప్పుకి అయోడిన్ కలపడాన్ని 1962లో తప్పనిసరి చేసింది. అమెరికా లాంటి దేశాల్లో ఫోర్టిఫికేషన్ తప్పనిసరి. గోధుమపిండికి ఇనుము, ‘బి’ విటమిన్లను కలుపుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 16 దేశాల్లో జరుగుతున్న ఫోర్టిఫికేషన్ విధానాలను విశ్లేషించి దానివల్ల ప్రయోజనం ఉందని తేల్చింది.
మార్కెట్లో దొరుకుతాయా?
బియ్యమూ గోధుమలను ఫోర్టిఫై చేసి అమ్మడం మన దేశంలో చాలాకాలంగా ఉంది. దావత్, లోహిత, ఆస్బా లాంటి బ్రాండ్లు ఆ ధాన్యాన్ని అమ్ముతున్నాయి. ఇక నూనెలు, పాలు, ఉప్పులను చాలా కంపెనీలు ఫోర్టిఫై చేసి అమ్ముతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ వారి వెబ్సైట్ చూడవచ్చు.
దీనికి ప్రత్యామ్నాయం లేదా?
లేకేం... నిజానికి ఫోర్టిఫికేషన్‌లో కలుపుతున్న సూక్ష్మపోషకాలన్నీ సహజంగా ఆహార పదార్థాల్లో ఉండాల్సినవే. కానీ పంటలు పండించే నేలలో క్రమేణా సారం తగ్గిపోవడం వల్ల కొన్ని పోషకాలు లోపిస్తోంటే, ధాన్యాన్ని మిల్లు పట్టించినప్పుడూ పాలిష్ చేయించినప్పుడూ దాని పై పొట్టులో ఉండే పోషకాలు పోతున్నాయి. తీసుకునే ఆహారంలో వైవిధ్యం కొరవడటం మరో కారణం. అల్పాదాయ వర్గాలవారు స్తోమత లేక సమతులాహారానికి దూరమవుతుండగా, స్తోమత ఉన్నవారు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ వాడుతూ ఆహార నాణ్యతమీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ సూక్ష్మపోషకాల లోపం ఏర్పడుతోంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటానికి ఇనుములోపం ఒక్కటే కారణం కాదనీ శరీరం ఇనుమును గ్రహించడానికి అవసరమైన ఇతర విటమిన్లూ, మాంసకృత్తులూ ఆహారంలో కొరవడటం వల్ల రక్తహీనత ఏర్పడుతోందనీ అంటున్నారు నిపుణులు. ఫోర్టిఫికేషన్ అనేది తాత్కాలిక పరిష్కారమేననీ దీర్ఘకాలంలో నాణ్యమైన, వైవిధ్యభరితమైన ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది వేస్తుందనీ వారు చెబుతున్నారు.
వైవిధ్యభరితమైన ఆహారం అంటే?
తెల్ల బియ్యం ఒక్కటే కాకుండా తరచూ వేర్వేరు తృణధాన్యాలను వాడుకోవాలి. కూరగాయలూ పండ్లూ ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కొక్కరూ రోజుకి 400 గ్రాముల పండ్లూ కూరగాయలూ తీసుకోవాలని జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకి- అన్నం మనకి ప్రధాన ఆహారం. అది తినడం కోసం కూర చేసుకుంటాం. అది రుచిగా ఉండడం కోసం అరకిలో కూరగాయలకు ఉప్పూకారాలూ మసాలాలూ చేర్చి వండి ఇంటిల్లి పాదీ తినడం సాధారణ విషయమే. కానీ అన్నంలో ఉండేది కేవలం కార్బోహైడ్రేట్లు కాబట్టి శరీరానికి కావలసిన మిగిలిన పోషకాలన్నీ కావాలంటే అన్నంతో సమానంగా కూరగాయల్నీ తినాలంటున్నారు నిపుణులు. అలాగే పండ్లు అనగానే చాలామంది అవి ఖరీదెక్కువ అనుకుంటారు. మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఆహార పదార్థాలతో పోలిస్తే అవి ఖరీదు కాదు, పైగా పోషకాలు ఎక్కువ. అరటి, ఆపిల్, జామ లాంటి ఎప్పుడూ దొరికేవే కాకుండా, సీజన్లో మాత్రమే లభించే నారింజ, బత్తాయి, దానిమ్మ, నేరేడు, మామిడి, తాటిముంజెలు... వేటినీ వదలకుండా తినడం చాలా అవసరం. శరీరానికి కావలసిన సూక్ష్మ పోషకాలనూ విటమిన్లనూ బయోయాక్టివ్ కాంపౌండ్స్నీ, యాంటి ఆక్సిడెంట్స్నీ ఇచ్చేది ఈ పండ్లే. వాటిలో ఉండే సీ విటమిన్ శరీరం ఆహారంలోని ఐరన్‌ని గ్రహించేలా చేస్తుంది. బీపీ, మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం లాంటివి రాకుండా చూసేదీ పండ్లే. అలాంటిది వాటిని కొనుక్కుని తినగల స్తోమత ఉన్నవాళ్లు కూడా తినకపోవడానికి కారణం చాలామందికి వాటి మీద ధ్యాస, అవగాహన ఉండక పోవడం. అలాంటివారు టిఫిన్ టైమ్, టీ టైమ్, లంచ్ టైమ్ లాగే ఫ్రూట్ టైమ్ పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యంగా తింటున్నామో లేదో తెలిసేదెలా?
ప్రతి కుటుంబమూ ఇంట్లో ఉన్న సభ్యుల వయసుల్ని బట్టీ వారి వారి ఆహార అవసరాల్ని బట్టీ రోజువారీ ఆహారప్రణాళికను రూపొందించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ క్రమంలో తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
ఐదు రంగులు: తెల్లని అన్నం, పచ్చని పప్పులకు తోడుగా కనీసం మరో మూడు రంగుల్లో కూరగాయలూ పండ్లూ ఆహారంలో ఉండేలా చూసుకోవడాన్ని నియమంగా పెట్టుకోవాలి. ఉల్లిపాయల్నీ, ఆలుగడ్డల్నీ కూరగాయల్లో కాకుండా పిండిపదార్థాల్లో లెక్కవేయాలి. బీన్స్, కాలిఫ్లవర్, క్యాప్సికమ్ లాంటి కూరగాయలు మంచిది. అలాగే గుడ్డు కూడా. కొలెస్టరాల్ అని భయపడి గుడ్డు తినరు చాలామంది. తిన్నా పసుపు సొన పడేస్తారు కొందరు. వైద్యులు వద్దని చెబితే తప్ప గుడ్డు అందరికీ మంచిదే. దాన్ని మొత్తంగా తినాలి. అలా తీసుకోకపోతే శరీరం తనకు కావలసిన కొలెస్టరాల్‌ని కృత్రిమంగా తయారుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు.
వేర్వేరు నూనెలు: ఒకే రకమైన వంటనూనె వాడకూడదు, మారుస్తూ ఉండాలి. నువ్వులనూనె, వేరుశెనగ, రైస్‌బ్రాన్,సన్‌ఫ్లవర్... ఇలా తరచూ మార్చి వాడాలి.
వెయ్యి రోజులు: బిడ్డను కనాలను కున్నప్పటినుంచి మొదలుపెట్టి బిడ్డకు రెండో పుట్టిన రోజు వరకూ మూడేళ్లనీ వెయ్యి రోజుల ఛాలెంజ్ అంటారు. ఆ వెయ్యిరోజులూ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే జీవితమంతా ఆరోగ్యంగా ఉంటుంది. గర్భంతో ఉన్న సమయంలో తల్లి సరైన ఆహారం తీసుకోకపోతే బిడ్డ పోషకాహార లోపంతో పుడుతుంది. ఫలితంగా తేలిగ్గా ఇన్ఫెక్షన్లకు గురవడమే కాక పెద్దయ్యాక జీవనశైలి వ్యాధులు వచ్చే అవకాశాలూ పెరుగుతాయి. అందుకని ఆ వెయ్యి రోజుల్నీ తల్లీబిడ్డల వర్తమాన, భవిష్యత్ ఆరోగ్యాలకు పెట్టుబడిగా భావించి పౌష్టికాహారం ఇవ్వాలి.
* * *
పాలు, నూనె, ఉప్పు, బియ్యం, గోధుమపిండి కొనేటప్పుడు, అవి అవసరమైన పోషకాలతో ఫోర్టిఫై చేసినట్లుగా తెలిపే ప్లస్ గుర్తు పాకెట్ మీద ఉండేలా చూసుకోవాలి...నెయ్యి, నూనె, ఉప్పు, చక్కెర లాంటివి వాడేటప్పుడు కాస్త తగ్గించి వేసుకోవాలి... అంటుంది ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ప్రకటన.ఆ ప్లస్సూ మైనస్సులను దృష్టిలో పెట్టుకుని పండ్లూ కూరగాయల మీద ఖర్చుని కాస్త పెంచుకుంటే... ఆరోగ్యం లెక్కలన్నీ పక్కాగా ఉంటాయన్న మాట!
ఎందులో... ఏమేం కలుపుతారు?
మన దేశంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ ఆధ్వర్యంలో ఐదు రకాల ఆహారపదార్థాల్లో ఫోర్టిఫికేషన్ జరుగుతోంది. పాలలో విటమిన్ ఎ, డి; బియ్యమూ గోధుమల్లో ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి12; వంట నూనెల్లో విటమిన్ ఎ, డి; ఉప్పులో అయోడిన్, ఐరన్ కలుపుతున్నారు. ఫోలిక్ యాసిడ్ కలపడం వల్ల పుట్టుకతో వచ్చే స్పైనా బిఫిడా జబ్బుని నివారించవచ్చు. ప్రస్తుతం ప్రతి వెయ్యిమందిలోనూ నలుగురికి ఈ జబ్బు ఉంటోంది. అయోడిన్ చేర్చడం వల్ల గాయిటర్ నుంచీ, మెదడుకి సంబంధించిన సమస్యల నుంచీ పిల్లల్ని కాపాడుకోవచ్చు, ‘ఎ’ విటమిన్ వల్ల రేచీకటి, ఇతర దృష్టిలోపాలూ రావు. ఇనుము, బి విటమిన్లు రక్తహీనతను తగ్గించి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. విటమిన్ డి, కాల్షియం లాంటివి రికెట్స్ని నివారించి, ఎముకల్ని బలోపేతం చేస్తాయి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్