వాళ్ల కోసం ఆ 40 రోజులూ.. రోజుకో లక్ష..!

‘మనం సుఖంగా, సంతోషంగా ఉండడమే కాదు.. మన చుట్టూ ఉన్న వారికి చేతనైన సహాయం చేసినప్పుడే అసలైన సంతృప్తి..’ అంటోంది బాలీవుడ్‌ నేచర్‌ లవర్‌ దియా మీర్జా. పర్యావరణమంటే ప్రాణం పెట్టే ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమవుతుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా విరాళాలు అందిస్తూ.. నిధులు సమకూరుస్తూ తన ఉదారతను చాటుకుంటుంది.

Published : 02 Dec 2021 19:12 IST

(Photo: Instagram)

‘మనం సుఖంగా, సంతోషంగా ఉండడమే కాదు.. మన చుట్టూ ఉన్న వారికి చేతనైన సహాయం చేసినప్పుడే అసలైన సంతృప్తి..’ అంటోంది బాలీవుడ్‌ నేచర్‌ లవర్‌ దియా మీర్జా. పర్యావరణమంటే ప్రాణం పెట్టే ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమవుతుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా విరాళాలు అందిస్తూ.. నిధులు సమకూరుస్తూ తన ఉదారతను చాటుకుంటుంది. డిసెంబర్‌ 9న తన పుట్టినరోజును పురస్కరించుకొని మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పనిలో పడిందీ బ్యూటీ. ఇందులో తన అభిమానుల్నీ భాగం చేయాలని ఆరాటపడుతోంది.

కరోనాను కాదని ఎంతోమంది రేయింబవళ్లు తమ జీవితాన్ని డ్యూటీకే అంకితం చేశారు. వారిలో కొంతమంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. అటవీ సంరక్షణలో భాగమైన వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది కూడా తమ విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారు. అలాంటి బాధిత కుటుంబాల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది దియా. ఇందుకు తన పుట్టినరోజైన డిసెంబర్‌ 9ని సందర్భంగా చేసుకుంది.

రోజుకో లక్ష చొప్పున..!

‘డిసెంబర్‌ 9న నా పుట్టినరోజును పురస్కరించుకొని ఎంతోమంది అభిమానులు నాకు బొకేలు, కానుకలు పంపుతుంటారు. అయితే ఈసారి వాటికి బదులుగా నా కోసం ఓ మంచి పని చేయండి. పూల బొకేలు, కానుకలకయ్యే ఖర్చును ఆదా చేసి.. వాటిని WTI (Wildlife Trust of India) అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించండి. తద్వారా కొవిడ్‌కు బలైన వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది, ఉద్యోగుల కుటుంబాలకు మీ వంతుగా సహాయపడిన వారవుతారు. అదే మీరు నాకిచ్చే అత్యుత్తమ బహుమతి. ఇక నేను కూడా నా పుట్టినరోజు నాటి నుంచి మొదలుకొని 40 రోజుల పాటు రోజుకో లక్ష చొప్పున విరాళంగా అందించబోతున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ బాలీవుడ్‌ అందం.

సేవలో తరిస్తూ..!

ఇలా విరాళాలివ్వడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం దియాకు కొత్తేమీ కాదు. వివిధ అంశాలపై ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో మమేకమై పని చేస్తోందామె.

* ముంబయికి చెందిన ‘క్యాన్సర్‌ పేషెంట్స్‌ ఎయిడ్‌ అసోసియేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలిగా కొనసాగుతోంది దియా. ఈ క్రమంలోనే ఏడాదికి ముగ్గురు నలుగురు క్యాన్సర్‌ బాధితుల్ని దత్తత తీసుకొని వారి బాగోగులు చూస్తోంది. వారి చికిత్సకు అవసరమైన ఖర్చులు, ఇతర సౌకర్యాలు సమకూర్చుతోంది. అంతేకాదు.. క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ‘ప్రేర్నా’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసిందామె.

* మూగ జీవాలంటే ఈ ముద్దుగుమ్మకు ఎనలేని ప్రేమ. ఈ క్రమంలోనే 2010లో లక్నో జూపార్క్‌ నుంచి రెండు చిరుతపులి పిల్లల్ని దత్తత తీసుకొని.. వాటికి అమ్మగా మారింది. వాటికి ముద్దుగా అశోక, నక్షత్ర అనే పేర్లు కూడా పెట్టుకుందామె.

* పర్యావరణంపై మక్కువతో 2017 నుంచి యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌ (భారత్‌)గా కొనసాగుతోంది దియా. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో, వన్యప్రాణి సంరక్షణ చర్యల్లో భాగమవుతుంటుంది. అంతేకాదు.. పరిశుభ్రమైన గాలి, నదుల పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం.. వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది. ఇలా ఐక్యరాజ్యసమితితో కలిసి చేస్తోన్న దియా సేవల్ని గుర్తించిన కెన్యాకు చెందిన Ol Pejeta వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, అక్కడి ఓ పిల్ల ఖడ్గ మృగానికి దియా పేరు పెట్టి గౌరవించింది.

* భ్రూణ హత్యల నిర్మూలన, హెచ్‌ఐవీ అవగాహన.. తదితర అంశాలకు సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసింది దియా.

* మూగ జీవాల హక్కుల్ని కాపాడే PETA, పిల్లల సంరక్షణకు ఏర్పాటైన CRY.. వంటి స్వచ్ఛంద సంస్థలకు నిధులు సైతం అందించిందీ బాలీవుడ్‌ బ్యూటీ.

* ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ ఎన్జీవోతో మమేకమై పోషకాహార లోపం, లింగ సమానత్వం, నాణ్యమైన విద్య, పిల్లల అక్రమ రవాణా.. వంటి అంశాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది దియా.

* క్యాన్సర్‌, గుండె జబ్బులు, తలసేమియా, అవయవ మార్పిడి అనంతరం అందించే మందులు.. తదితర సమస్యలున్న పేద పిల్లలకు అండగా నిలిచేందుకు ఏర్పాటైన ‘జెనెసిస్‌ ఫౌండేషన్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతోందామె.

* పులుల పరిరక్షణ కోసం Sanctuary Asia, Save The Tiger India సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘Leave Me Alone’ అనే ప్రచార కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటోందీ యానిమల్‌ లవర్.

* తన సేవలకు గుర్తింపుగా ‘గ్రీన్‌ గ్లోబ్‌ ఆనర్‌’, ‘IIFA గ్రీన్‌ అవార్డ్‌’.. వంటి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుందామె. ఇలా సేవ చేయడం తన తల్లి దీపా మీర్జా నుంచే నేర్చుకున్నానంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిందీ ‘గ్రీన్‌’ బ్యూటీ. వృత్తిరీత్యా ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన దీప.. మద్యపానానికి బానిసైన వారికి పునరావాసం కల్పించడానికి కృషి చేస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో వైభవ్‌ రేఖితో ఏడడుగులు నడిచిందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ జంటకు అవ్యాన్‌ అనే కొడుకున్నాడు. ఓవైపు తన సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ, అప్పుడప్పుడూ తెరపై కనిపిస్తూ.. మరోవైపు అమ్మతనాన్నీ ఆస్వాదిస్తోందీ సొగసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్