ఆ ఊళ్లో మగాళ్లుండడానికి వీల్లేదు..!

ఎర్రటి ఎండ.. కనుచూపుమేరంతా ఎడారి ప్రాంతం.. నీటి బొట్టు నేల రాలితే రెప్పపాటులో ఆవిరయ్యేంత వేడి.. చుట్టూ దట్టమైన కొండలు, ముళ్ల పొదలు, మట్టి దిబ్బలు. అయినాసరే.. తను చేరుకోవాల్సిన గమ్యం వైపు ఎంతో ఆత్రుతతో, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో పరిగెడుతూ వస్తోంది ఓ యువతి.

Updated : 16 Mar 2024 15:04 IST

ఎర్రటి ఎండ.. కనుచూపుమేరంతా ఎడారి ప్రాంతం.. నీటి బొట్టు నేల రాలితే రెప్పపాటులో ఆవిరయ్యేంత వేడి.. చుట్టూ దట్టమైన కొండలు, ముళ్ల పొదలు, మట్టి దిబ్బలు. అయినాసరే.. తను చేరుకోవాల్సిన గమ్యం వైపు ఎంతో ఆత్రుతతో, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో పరిగెడుతూ వస్తోంది ఓ యువతి. నమ్మినవారే మోసం చేయడంతో ఆ బాధను దిగమింగుకొని, కన్నీటిని నేలపై రాలనివ్వకుండా అటువైపే తీక్షణంగా చూస్తూ లక్ష్యం చేరుకొంటోంది. అలా పరిగెడుతూ ఓ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ అందరూ తనలాంటి యువతులు, మహిళలే. అందరిదీ తనలాంటి కథే. తనలాంటి ఆవేదనే. ఒకప్పుడు తనలాగా కన్నీరు కార్చినవారే. అయితే కష్టాలను, కన్నీళ్లను దిగమింగి ఆత్మవిశ్వాసాన్ని రగిలించుకొనే ప్రయత్నంలో ఉన్నవారంతా తమకోసం ఏర్పరుచుకున్న ప్రదేశం అది. ఆ ప్రాంతమే 'ఉమోజా గ్రామం'.

జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాక, తమకంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకొని, చేతనైన పనులు చేసుకుంటూ ఆత్మగౌరవమే వూపిరిగా బతుకుతున్నారు అక్కడి మహిళలు. ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా తమ వంతు పోరాటం చేస్తూ.. తమలాంటి తోటి మహిళలనే తమ కుటుంబ సభ్యులుగా భావించి జీవితం గడుపుతున్నారు. ఇలా పురుషులకు ప్రవేశం లేకుండా, మహిళలు తమకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఈ గ్రామం గురించి, దాని నేపథ్యం గురించి తెలుసుకుందాం రండి..

అక్కున చేర్చుకుంటూ..

కెన్యా రాజధాని నైరోబీకి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంబూరు జిల్లాలోని ఓ కుగ్రామం 'ఉమోజా'. ఇక్కడ ఉండే మహిళలంతా ఒకప్పుడు అత్యాచారాలు, అఘాయిత్యాల బారిన పడినవారే. కుటుంబ సభ్యుల చిత్రహింసలు తట్టుకోలేక, ఆత్మాహుతికి సైతం ప్రయత్నించిన వారిని అమ్మలా అక్కున చేర్చుకొంటోందీ గ్రామం. ఒకప్పుడు బ్రిటిషు సైనికుల చేతుల్లో లైంగిక వేధింపులకు గురైన కొంతమంది మహిళలు, సాంబూరుకు చెందిన రెబెక్కా లోలోసోలీ అనే మహిళ నేతృత్వంలో 1990లో తమలాంటి మహిళలకోసం ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. వీరంతా పురుషుల ద్వారా వివిధ రకాల వేధింపులకు గురైనవారే. ఆ చిత్రహింసలను తట్టుకోలేక సమాజానికి దూరంగా ఓ మహిళా లోకాన్ని సృష్టించుకున్నారు. అందులో పురుషులను ఏమాత్రం అనుమతించరు.

జీవితంపై ఆశలు కల్పిస్తూ..

ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన లోలోసోలీ చిన్నప్పటి నుంచే స్త్రీ స్వేచ్ఛ, సాధికారత వంటి భావాలతో పెరిగింది. పెళ్లి తర్వాత కూడా సమాజంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలను అడ్డుకొనే ప్రయత్నం చేసేది. కానీ సాంబూరు ప్రాంత పురుషులు దీన్ని వ్యతిరేకించారు. సమాజంలో పురుషులే అధికులన్న భావన వారి నరనరాల్లో జీర్ణించుకుపోవడంతో ఆమెపై దాడి కూడా చేశారు. దీంతో వూరికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న లోలోసోలీకి సరిగ్గా అదే సమయంలో లైంగిక వేధింపులకు గురైన మరికొందరు మహిళలతో పరిచయం ఏర్పడింది. వీరంతా ఒకే ప్రాంతంలో కలిసి నివసించాలని నిర్ణయించుకున్నారు. అలా ఈ గ్రామం ఆవిర్భవించింది. గ్రామం ఏర్పాటు సమయంలోనే అందులోకి పురుషులకు ప్రవేశం కల్పించకూడదని వారంతా నిర్ణయించుకున్నారు. ఏటా ఇక్కడ ఎన్నికలు కూడా జరుగుతాయి.

సాధికారత దిశగా..

ఉమోజాలో నివసించే మహిళలు ఎవరూ సంపన్నులు కారు. జీవితంలో ఎన్నో బాధలు పడి, నరకాన్ని ప్రత్యక్షంగా చవిచూసినవారే. అన్ని బాధల నుంచి బయటపడ్డారు కాబట్టి తొణకని ఆత్మవిశ్వాసంతో స్వయంఉపాధిని కల్పించుకున్నారు. ఈ గ్రామానికి దగ్గర్లో ఉండే 'సాంబూరు నేషనల్ రిజర్వ్'కు పర్యటకుల తాకిడి అధికం. దీనినే ఆధారంగా చేసుకొని, ఆదాయం పొందే క్రమంలో జొన్నన్నం, చెరకును అమ్మడం ప్రారంభించారు. దీనికోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్క్ చుట్టూ తిరిగి, అతి కష్టం మీద కొంత డబ్బును సంపాదించేవారు. కానీ మహిళల సంఖ్య పెరిగే కొద్దీ ఈ ఆదాయం ఎటూ సరిపోయేది కాదు. తర్వాత కెన్యా సంప్రదాయ రాళ్లు, బీడ్స్ అమ్మడం మొదలుపెట్టారు. ఇవి పర్యటకులను ఆకర్షించడంతో వారి ఆదాయం కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఇలా అంతా కలిసి కొంత డబ్బును సమకూర్చుకొని కొంత భూమిని కొని, దాన్ని తమ గ్రామంలో ఉండే మహిళల అభ్యున్నతికి కేటాయించాలని లోలోసోలీ నిర్ణయించింది. అయితే విషయం తెలుసుకున్న స్థానిక పురుషులు లోలోసోలీతో పాటు మిగిలిన మహిళలపై దాడి చేశారు. విచక్షణారహితంగా వారిని కొట్టారు.

తిరగబడితేనే..!

ఎన్ని కష్టాలెదురైనా, ఉమోజా మహిళలు సాధికారతను సాధించే విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడట్లేదు. ఇప్పటికే వారి పిల్లల కోసం ప్రాథమిక పాఠశాలను నిర్మించి, అందులో ఓ అధ్యాపకురాలిని నియమించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరి గురించి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీ అభివృద్ధికి మేమూ సాయపడతామంటూ ముందుకు వస్తున్నాయి. ఈగ్రామానికి కొత్తగా వచ్చే మహిళలకు తోటి మహిళలే అక్కడి నియమ నిబంధనల గురించి వివరిస్తారు. అత్యాచారాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఉమోజాలో ప్రత్యేకంగా న్యాయవాది కూడా ఉన్నారు. అక్కడే పుట్టిపెరిగి, పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు వారిష్టప్రకారం వివాహం చేసుకొని, కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. మహిళలంతా కలిసికట్టుగా తిరగబడినప్పుడే భ్రూణ హత్యలు, బాల్యవివాహాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు.. వీటన్నింటికీ ముగింపు పలకగలుగుతామన్నది వీరి నిశ్చితాభిప్రాయం. ఈ గ్రామంలో పురుషులకు అనుమతి లేదు. కానీ ఇంటి నిర్మాణం, తవ్వకాలు వంటి కొన్ని పనులకు మాత్రం నిర్ణీత వేళల్లో మాత్రమే వారిని అనుమతిస్తారు. అలాగే ఆ గ్రామంలోని మహిళలు కన్న మగపిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఊరు విడిచి వెళ్లిపోవాల్సిందే!

ఇదీ ఉమోజా గురించి టూకీగా.. మహిళల పైన పురుషుల అఘాయిత్యాలను, అరాచకాలను వ్యతిరేకిస్తూ కేవలం ఆడవారే కలిసి జీవిస్తూ శ్రమైక జీవనంలోని ఆనందాన్ని, స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటుతోంది ఈ ఉమోజా గ్రామం!

Photos: umojawomen.or.ke

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్