Published : 12/08/2021 19:35 IST

కరోనా కాలంలో విమాన ప్రయాణమా? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

చదువుకోవడానికో, బిజినెస్‌ పని మీదో, ఆఫీస్‌ పనుల దృష్ట్యా.. ఇలా కారణమేదైనా ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలామందికి విమాన యానం చేయక తప్పట్లేదు. అయితే ఎప్పటికప్పుడు గాలిని శుద్ధి చేసే వెంటిలేషన్ సిస్టమ్‌ విమానాల్లో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందంటున్నారు నిపుణులు. అలాగని నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రమాదం మన దాకా రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో విమాన యానం చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

ప్రస్తుతం మన దగ్గర కొవిడ్‌ తీవ్రత కాస్త తగ్గినా.. ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. కాబట్టి ఆయా దేశాలకు వెళ్లినప్పుడు లేదంటే దేశీయంగానే ఇతర రాష్ట్రాలకు/ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొన్ని కనీస జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ముందే ట్రిప్‌ ప్లాన్‌ చేసుకున్న వారు వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకోవాలి. దాంతో పాటు ఈ కనీస జాగ్రత్తలు కూడా పాటిస్తే.. క్షేమంగా వెళ్లి.. పని పూర్తిచేసుకొని.. ఆరోగ్యంగా తిరిగి రావచ్చు.

రెండు మాస్కులతోనే రక్షణ!

కరోనా భయంతో ఎక్కడికెళ్లినా మాస్క్‌ ధరిస్తున్నాం. అయితే రద్దీగా ఉండే ప్రదేశాల్లో రెండు మాస్కులు ధరించడం సురక్షితం అని చెబుతోంది సీడీసీ. తద్వారా వైరస్‌ ముప్పు 95 శాతం దాకా తగ్గుతుందని సూచిస్తోంది. విమాన ప్రయాణం కూడా రద్దీతో కూడుకున్నదే కాబట్టి.. విమానాల్లో ప్రయాణించే వారు కూడా రెండు మాస్కులు ధరిస్తేనే ఇతరుల నుంచి కొవిడ్‌ సోకకుండా జాగ్రత్తపడచ్చంటోంది. ఈ క్రమంలో లోపల సర్జికల్‌ మాస్క్‌.. దానిపై నుంచి క్లాత్‌ మాస్క్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ 95 మాస్క్‌ అయితే ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది. ఇక దీంతో పాటు అదనంగా మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్‌, డిస్ఇన్ఫెక్టంట్‌ వైప్స్‌, టిష్యూస్‌.. వంటి ఒకసారి వాడిపడేసే వస్తువుల్ని హ్యాండ్‌బ్యాగ్‌లో చేతికందేలా అమర్చుకుంటే వాడుకోవడానికి మరింత సులభంగా ఉంటుంది.

స్టైల్‌ కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

విమాన ప్రయాణం అనగానే చాలామంది మహిళలు మోడ్రన్‌ అవుట్‌ఫిట్స్‌కే ప్రాధాన్యమిస్తుంటారు. ఈ క్రమంలో స్లీవ్‌లెస్‌, ఆఫ్‌-షోల్డర్‌, జీన్స్‌-క్రాప్‌టాప్‌, త్రీ-బై-ఫోర్త్‌.. ఇలా ఎవరికి నచ్చినవి వారు ఎంచుకుంటుంటారు. స్టైలిష్‌ లుక్‌ని అందించే ఈ దుస్తులు ప్రయాణాల్లో సౌకర్యవంతంగా ఉండడమే వీటిని చాలామంది ఎంచుకోవడానికి ముఖ్య కారణం. కానీ ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో స్టైల్‌ కంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. అందుకే శరీరం మొత్తం కవరయ్యేలా ఉండే జీన్స్‌-ఫుల్‌ స్లీవ్స్‌ షర్ట్‌/టీషర్ట్‌, గౌన్‌/ఫ్రాక్.. వాటికి జతగా ఫుల్‌స్లీవ్స్‌ డెనిమ్‌ జాకెట్‌, పాదాలు కవరయ్యేలా షూస్‌, కళ్లద్దాలు, స్కార్ఫ్‌తో ముఖాన్ని కవర్‌ చేయడం, చేతులకు గ్లౌజులు.. వంటివి ఎంచుకోవాలి. ఎవరేమనుకున్నా ఇలా శరీరం మొత్తం కప్పి ఉంచే లాంటి దుస్తులు వేసుకుంటే ఆయా ఉపరితలాల నుంచి వైరస్‌ చర్మానికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు.

కిటికీ పక్కన కూర్చోండి!

ఏ ప్రయాణమైనా కిటీకీ పక్కన సీట్లో కూర్చోవడానికే మనం ఆరాటపడుతుంటాం. ఈ కరోనా కాలంలో విమాన యానం చేసే వారికి ఈ సీటే సురక్షితం అని చెబుతున్నారు నిపుణులు. ఎమోరీ యూనివర్సిటీ, జార్జియా టెక్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలింది. విమానంలో సూక్ష్మక్రిములు ఎక్కువగా చేరని ప్రదేశాలేమైనా ఉన్నాయంటే.. అది విండో సీటే అని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ముందే బుకింగ్‌ చేసుకుంటే కిటికీ పక్కన సీట్లను ఎంచుకోవచ్చు. అప్పటికప్పుడు ప్రయాణమంటే ఇది కుదరచ్చు.. కుదరకపోవచ్చు. కాబట్టి ఏ సీటైనా కూర్చునే ముందు శానిటైజ్‌ చేసుకోవడం, ఆ చుట్టుపక్కల ఉపరితలాలు తాకకపోవడం, చేతుల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం, తోటి ప్రయాణికులతో మాట్లాడకపోవడం.. వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా ప్రయాణం చేయచ్చు.

ఆ పదార్థాలు వద్దు!

విమాన ప్రయాణమంటేనే విలాసవంతంగా ఉంటుంది.. ఇక అందులో సర్వ్‌ చేసే ఆహార పదార్థాల విషయంలో ఎక్కువ శుచి-శుభ్రత పాటిస్తుంటారు.. అనుకుంటారు చాలామంది. నిజానికి ఇలాంటి సౌకర్యం అన్ని విమానాల్లో ఉండచ్చు.. ఉండకపోవచ్చు అంటోంది యూఎస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ. విమానాల్లో ఉండే నీటి ట్యాంకులు అన్ని వేళలా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పలేమని, కాబట్టి ఆ నీటితో తయారుచేసిన టీ/కాఫీ.. వంటివి తీసుకోకపోవడమే ఉత్తమం అని చెబుతోంది. ఈ తిప్పలన్నీ ఎందుకు అనుకున్న వాళ్లు ఇంటి నుంచే పండ్లు, డ్రైఫ్రూట్స్‌ సలాడ్స్‌.. వంటివి వెంట తీసుకెళ్లచ్చు. అయితే ఇంటి నుంచి తీసుకెళ్లాలనుకున్న పదార్థాలేవైనా పరిమిత బరువులోనే ఉంటే ఇబ్బంది ఉండదు. పైగా ఇంటి ఆహారమైతే వైరస్‌ ముప్పు కూడా చాలా వరకు తగ్గుతుందంటున్నారు నిపుణులు.

 

ఇవి గుర్తుపెట్టుకోండి!

* విమానాశ్రయంలో కుర్చీలు, ఏటీఎంలు, చెక్‌-ఇన్‌ మెషీన్స్‌, ఎస్కలేటర్స్‌.. వంటి ఉపరితలాల్ని తాకిన ప్రతిసారీ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఎప్పుడూ మన చేతిలో ఉండే మొబైల్‌నూ శానిటైజ్‌ చేయాల్సిందే!

* మనం వెంట తీసుకెళ్లిన లగేజ్‌ బ్యాగ్స్‌ చెక్‌ చేసేటప్పుడు, వాటిని విమానంలో స్టోరేజ్‌ యూనిట్‌లో భద్రపరిచేటప్పుడు.. ఎంతోమంది చేతులు మారుతుంటాయి. కాబట్టి ప్రయాణం ముగిసి అవి తిరిగి మన దగ్గరికొచ్చిన తర్వాత డిస్‌-ఇన్ఫెక్టంట్‌ వైప్స్‌తో వాటి హ్యాండిల్స్‌ తుడవాలి. అలాగే బ్యాగ్‌పై శానిటైజర్‌ స్ప్రే చేస్తే మరీ మంచిది.

* టైంపాస్‌ కావట్లేదంటూ ఇతరులతో మాట్లాడడం కంటే హాయిగా మొబైల్‌లో ఏదైనా సినిమా చూడడం, నచ్చిన పాటలు వినడం.. వంటివి చేస్తే వైరస్‌ ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

* అలాగే ఏదైనా అనారోగ్యాలున్నా, ఒంట్లో నలతగా అనిపించినా.. ప్రయాణం మానుకొని ఇంట్లో ఉండడమే సురక్షితం అని చెబుతోంది సీడీసీ.

ఇక ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్న తర్వాత వెంట తీసుకెళ్లిన వస్తువులన్నీ శానిటైజ్‌ చేసుకోవడం, దుస్తులు ఉతుక్కోవడం, శుభ్రంగా స్నానం చేయడం.. వంటివి తప్పనిసరి! ముందు జాగ్రత్తగా ఓ మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా వేరే గదిలో ఉండగలిగితే.. మరీ మంచిది! ఈ సమయంలో ఏదైనా అనారోగ్యం బారిన పడితే దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడచ్చు.. మీరూ ముందే అలర్ట్‌ అయి తగిన చికిత్స తీసుకోవచ్చు..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి