Ranlia Wedding : పెళ్లిలోనూ అలా ‘ప్రేమ’ను పంచుకున్నారు!
మనసుకు నచ్చిన వాడు, మనల్ని మెచ్చిన వాడు ఒకరే అయితే.. అతడితోనే ఏడడుగులు నడిస్తే.. అసలు ఆ అమ్మాయి ఆనందానికి పట్టపగ్గాలుంటాయా చెప్పండి. ప్రస్తుతం అలాంటి అమితానందంలోనే తేలియాడుతోంది బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ఆలియా భట్. ఊహ తెలిసినప్పట్నుంచి నటుడు రణ్‌బీర్....
(Photos: Instagram)
మనసుకు నచ్చిన వాడు, మనల్ని మెచ్చిన వాడు ఒకరే అయితే.. అతడితోనే ఏడడుగులు నడిస్తే.. అసలు ఆ అమ్మాయి ఆనందానికి పట్టపగ్గాలుంటాయా చెప్పండి. ప్రస్తుతం అలాంటి అమితానందంలోనే తేలియాడుతోంది బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ఆలియా భట్. ఊహ తెలిసినప్పట్నుంచి నటుడు రణ్‌బీర్‌నే వలచి వరించిన ఆమె.. తాజాగా అతడితోనే ఏడడుగులు నడిచింది. ఐదేళ్ల పాటు గాఢమైన ప్రేమలోకంలో విహరించిన ఈ జంట.. మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. ఏ బాల్కనీలోనైతే తమ ప్రేమ మొదలైందో.. అదే బాల్కనీలో ఇద్దరూ పెళ్లి బాసలు చేసుకున్నారు. ముద్దూ మురిపెంలో మునిగితేలారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ ముద్దుల జంట ముచ్చటైన ప్రేమకథేంటో తెలుసుకుందాం రండి..
‘పెళ్లెప్పుడు’ అని అడిగిన ప్రతిసారీ దాటవేస్తూ వచ్చారు ఆలియా-రణ్‌బీర్‌లు. వివాహానికి ఒకట్రెండు రోజుల ముందు వరకూ ఈ విషయంపై మౌనం వహించారు. అయితే ఇలా అభిమానుల ఎదురుచూపులకు తాజాగా తెరదించారీ లవ్లీ కపుల్. మొన్నటిదాకా ప్రేమికులుగా ఉన్న వీరిద్దరూ.. నేడు దంపతులుగా అందరిముందుకొచ్చే సరికి.. ఈ ముద్దుల జంటను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోలేదంటే అతిశయోక్తి కాదు.
మిక్స్ అండ్ మ్యాచింగ్‌గా మెరిసిపోయారు!
ఈ కాలపు వివాహాల్లో వధూవరులిద్దరూ తమ పెళ్లి దుస్తుల్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడం కామనైపోయింది. రణ్‌లియా జంట కూడా ఇదే ట్రెండ్‌ని కొనసాగించింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో ఇరు కుటుంబాలు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో భాగంగా.. ఈ జంట సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయింది. ఆలియా ఐవరీ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ ఆర్గంజా చీరలో తళుక్కుమనగా.. రణ్‌బీర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన సిల్క్ ఐవరీ షేర్వాణీ ధరించాడు. ఇలా దుస్తులకు తగ్గట్లుగా భారీ ఆభరణాలు ధరించి ఆకట్టుకున్నారీ క్యూట్ కపుల్. ఇక తమ పెళ్లి ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకున్న ఆలియా.. ‘గత ఐదేళ్లుగా ఏ బాల్కనీలోనైతే మా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామో.. అదే బాల్కనీలో మా వివాహం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇద్దరం కలిసి మరిన్ని మధురమైన జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం..’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ లవ్‌బర్డ్స్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
11 ఏళ్లకే ప్రేమ పుట్టింది!
ఆలియా-రణ్‌బీర్‌ల ప్రేమ విషయానికొస్తే.. ఆలియానే నాలుగాకులు ఎక్కువ చదివిందని చెప్పచ్చు. ఎందుకంటే తన ఇష్టసఖుడి గురించి ఎక్కడైనా, ఎప్పుడైనా నిర్మొహమాటంగా బయటపెడుతుంటుందీ ముద్దుగుమ్మ.
‘చిన్నతనంలోనే తెరపై రణ్‌బీర్‌ను చూసి ఇష్టపడ్డా. పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. మీకు మరో నిజం చెప్పనా..? నా మనసులో ఎప్పుడో అతడితో మూడు ముళ్లు వేయించుకున్నా. బర్ఫీ సినిమా చూశాక అతడిపై మరింత ప్రేమ పెరిగింది. అతడే నా బిగ్గెస్ట్ క్రష్..’ అంటోందీ బాలీవుడ్ అందం. అయితే అప్పటికే రణ్‌బీర్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన ఆలియా తన పదకొండేళ్ల వయసులో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘బ్లాక్’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లింది. అక్కడే తొలిసారి తన కలల రాకుమారుడిని కలిసింది. ఇక ఆ తర్వాత తన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మీడియా సమావేశంతో పాటు ‘కాఫీ విత్ కరణ్’.. ఇలా రణ్‌బీర్‌పై తనకున్న ప్రేమను తెలియజేయడానికి ఆలియా ఎదురుచూడని సందర్భమే లేదంటే అతిశయోక్తి కాదు.
అతడి ‘బ్రహ్మాస్త్రం’తో..!
అయితే అప్పటిదాకా తమ మనసులో దాచుకున్న ప్రేమను ఒకరితో ఒకరు పంచుకోకపోయినా.. 2017లో చిత్రీకరణ ప్రారంభమైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో ఆలియా-రణ్‌బీర్‌లు మరింత దగ్గరయ్యారని చెప్పచ్చు. ఫిల్మ్ మేకర్ అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆలియాతో ప్రేమలో పడిపోయానని చెబుతున్నాడీ హ్యాండ్‌సమ్ హీరో.
‘నేను కాస్త మిత భాషిని. ఆలియా నటన, తనతో కలిసి పనిచేస్తున్న క్రమంలో తన మంచి మనసు నాకెంతో నచ్చాయి. నేను నా జీవితంలో ఏ ప్రేమ కోసమైతే వెతుకుతున్నానో అది ఆలియా ద్వారా నాకు దొరికింది. మా బంధాన్ని మరింత దృఢం చేసుకోవాలి.. అందుకు మాక్కాస్త ప్రైవసీ కావాలి..’ అంటూ తనతో ఆలియా ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడీ రొమాంటిక్ హీరో.
అయితే అప్పటిదాకా ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం బయటికి పొక్కినా.. ఇద్దరూ కలిసి తొలిసారి మీడియాకు కనిపించింది మాత్రం 2018లో సోనమ్-ఆనంద్‌ల వివాహ రిసెప్షన్‌లోనే అని చెప్పచ్చు. ఇక అప్పట్నుంచి లంచ్-డిన్నర్ డేట్స్, ఫ్యామిలీ పార్టీలు, ప్రముఖుల సెలబ్రేషన్స్, వెకేషన్స్‌లో చెట్టపట్టాలేసుకొనే దర్శనమిస్తూ వస్తున్నారీ లవ్లీ పెయిర్.
పెళ్లిలో ‘ప్రేమ’ పాఠాలు!
తమ ఐదేళ్ల ప్రేమను పెళ్లితో శాశ్వతం చేసుకున్న ఈ జంట తమ వివాహంలోనూ ఎంతో సందడి చేశారు. ముద్దూ ముచ్చట్లలో మునిగితేలారు. డ్యాన్స్‌తో అదరగొట్టారు. అంతేనా.. ఆయా వేడుకల్లో ఒకరిపై ఒకరికున్న ప్రేమను బయటపెట్టుకున్నారు కూడా!
ప్రేమ ఘట్టాల్లో కొన్ని!
* సాధారణంగా వరమాల (దండలు మార్చుకోవడం) వేడుకలో వరుడు వధువును ఆటపట్టించడం సహజం. అయితే తన నెచ్చెలిని ఇలా ఇబ్బంది పెట్టాలనుకోలేదు రణ్‌బీర్. అందుకే ఆలియా ముందు మోకాళ్లపై కూర్చొని మరీ ఆమెతో మెడలో దండ వేయించుకున్నాడు. ఈ ఘట్టం అక్కడున్న వారినే కాదు.. అభిమానుల్నీ ఎంతో ఆకట్టుకుంది.
* ఇక సందర్భం వచ్చినప్పుడల్లా రణ్‌బీర్‌పై ప్రేమను చూపే ఆలియా.. పెళ్లిలోనూ అదే రిపీట్ చేసింది. తాను ధరించిన జ్యుయలరీతో తన భర్తంటే తనకు ఎంతిష్టమో చెప్పకనే చెప్పిందీ చిన్నది. ఆలియా ధరించిన మంగళసూత్రంలో ‘ఇన్ఫినిటీ’ గుర్తు ఉంది. అంటే.. అతడిపై తనకు అనంతమైన ప్రేమ ఉందని పరోక్షంగా చెబుతోందీ క్యూటీ. అలాగే దీన్ని తిరగేస్తే ‘8’ వస్తుంది. సో.. ఇద్దరి లక్కీ నంబర్ కూడా ఇదే! ఇక సోషల్ మీడియాలోనూ తన పెళ్లి ఫొటోను డీపీగా పెట్టి కట్టుకున్న వాడిపై తన మనసులో దాగున్న అమితమైన ప్రేమను చాటుకుందీ ముద్దుగుమ్మ.
* ఇక పెళ్లి తంతు ముగిశాక అందరి ముందుకు వచ్చి అభివాదం చేసిన ఈ జంట.. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం రణ్‌బీర్ ఆలియాను ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ తరహాలో ఎత్తుకొని తీసుకెళ్లడం ఎంతోమందిని ఆకట్టుకుంది.
* సందర్భానుసారం తన నెచ్చెలికి ఇష్టమైన కానుకలిచ్చి మెప్పించే ఈ హ్యాండ్‌సమ్ హీరో.. పెళ్లిలోనూ ఆలియాకు ఖరీదైన కానుకిచ్చాడట! వీళ్లిద్దరి లక్కీ నంబర్ 8 కలిసేలా.. ఎనిమిది వజ్రాలతో ప్రత్యేకంగా తయారుచేయించిన వెడ్డింగ్ బ్యాండ్‌ను తన భార్యకు బహుమతిగా ఇచ్చాడట ఈ క్యూట్ హబ్బీ.
మొత్తానికి తమ ఐదేళ్ల ప్రేమబంధాన్ని పెళ్లితో శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్న ఈ ముద్దుల జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు.. రణ్‌లియాలు తమకిష్టమైన దక్షిణాఫ్రికాకు హనీమూన్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రణ్‌లియా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.