‘గర్భస్రావ’ సెలవులు!

నెలసరి సెలవుల గురించి విన్నాం.. మాతృత్వ సెలవుల గురించి తెలుసుకున్నాం.. ఇప్పుడు కొత్తగా ఈ ‘గర్భస్రావ’ సెలవులేంటి..

Published : 11 Dec 2021 19:05 IST

నెలసరి సెలవుల గురించి విన్నాం..

మాతృత్వ సెలవుల గురించి తెలుసుకున్నాం..

ఇప్పుడు కొత్తగా ఈ ‘గర్భస్రావ’ సెలవులేంటి.. అని ఆలోచిస్తున్నారా? బెంగళూరులోని గోల్డ్‌మ్యాన్‌ సాక్స్‌ అనే కంపెనీ తాజాగా ఈ సెలవుల్ని ప్రవేశపెట్టింది. తమ ఉద్యోగులకు ఇలాంటి సమస్యలు/ఇతర అనారోగ్యాలు తలెత్తినప్పుడు వాళ్ల మానసిక ఆరోగ్యం, తద్వారా వారి ఉత్పాదకత మెరుగుపరచడానికే వేతనంతో కూడిన ఈ సెలవుల్ని అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సెలవులకు ఎవరెవరు అర్హులు? ఎన్ని రోజుల పాటు తీసుకోవచ్చు? దీనివల్ల ఇటు ఉద్యోగికి, అటు సంస్థకు కలిగే అదనపు ప్రయోజనాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ఏ చిన్న అనారోగ్యమైనా, మానసిక ఒత్తిళ్లైనా.. కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అలాంటిది గర్భస్రావమైతే ఇటు శారీరకంగా, అటు మానసికంగా నష్టపోతాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిపై పూర్తి దృష్టి పెట్టలేం.. ఒకవేళ బలవంతంగా చేసినా ఉత్పాదకతలో లోపాలు రావడం ఖాయం. అందుకే ముందు ఈ ప్రతికూలతల నుంచి బయటపడేసే ఉద్దేశంతో తమ ఉద్యోగులకు 20 రోజుల వేతనంతో కూడిన ‘గర్భస్రావ సెలవులు’ ప్రకటించింది గోల్డ్‌మ్యాన్‌ సాక్స్‌.

వీళ్లే అర్హులు!

న్యూయార్క్‌ ప్రధాన కేంద్రమైన ఈ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుకు చెందిన శాఖ బెంగళూరులో ఉంది. దీన్ని ఆ బ్యాంక్‌ రెండో అతిపెద్ద కార్యాలయంగా పేర్కొంటారు. ఈ సంస్థ తాజాగా ప్రవేశపెట్టిన ‘గర్భస్రావ సెలవు’ల్లో భాగంగా కొన్ని నియమ నిబంధనలు విధించింది.

* మహిళా ఉద్యోగులు గర్భం కోల్పోయినా లేదంటే పురుష ఉద్యోగుల భార్యలకు గర్భస్రావమైనా, సరొగేట్‌ మదర్‌కి అబార్షన్‌ అయినా.. 20 రోజుల వేతనంతో కూడిన సెలవుల్ని మంజూరు చేస్తారు.

* కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోయినా (భార్య/భర్త, రిలేషన్‌షిప్‌లో ఉన్న వారు, పిల్లలు) ఈ సెలవు తీసుకోవచ్చు.

* ఒకవేళ బంధువులు/దూరపు బంధువులు చనిపోతే ఐదు రోజుల వేతనంతో కూడిన సెలవు ఇస్తారు.

ఇక ‘Global Sabbatical Program’ పేరుతో గతంలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందీ సంస్థ. సుదీర్ఘకాలం పాటు సంస్థలో సేవలందించే ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇందులో భాగంగా.. 15 ఏళ్ల సర్వీస్‌ ఉన్న వారు ఆరు వారాల వేతనం లేని సెలవును తీసుకోవచ్చు. ఆపై ప్రతి ఐదేళ్లకోసారి అదనంగా రెండు వారాల వేతనం లేని సెలవును అందిస్తోందీ బ్యాంకింగ్‌ సంస్థ.

అంతరార్థమిదే!

ప్రస్తుతం మన దేశంలో ఈ కంపెనీకి బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయిల్లో శాఖలున్నాయి. తమ ఉద్యోగులకు ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని పంచే ఈ సంస్థ.. వారి సౌకర్యాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇలా వారు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉన్నప్పుడే ఉత్తమ పనితీరు కనబర్చగలుగుతారు. కంపెనీ అభివృద్ధి చెందాలంటే అదే కీలకం అంటోంది సంస్థ యాజమాన్యం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొనే తాజాగా గర్భస్రావ సెలవులు/ఫ్యామిలీ కేర్‌ లీవ్స్‌ ఇవ్వడానికి సన్నద్ధమైందీ బ్యాంకింగ్‌ ఫర్మ్‌. అంతేకాదు.. పనిచేసే సమయంలోనూ తమ ఉద్యోగుల్లో ఉత్సాహం నింపడానికి పలు కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోందీ సంస్థ.

ఉంది.. కానీ అమలవుతోందా?!

నిజానికి గర్భస్రావ సెలవులనేవి కొత్తగా చేసిన ప్రతిపాదనేమీ కాదు.. ‘ప్రసూతి ప్రయోజనాల చట్టం - 1961’ ప్రకారం.. గర్భస్రావం జరిగినప్పుడు.. మరుసటి రోజు నుంచి ఆరు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు తీసుకునేలా ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది. అయితే ఇందుకు సంబంధిత అధికారిక రుజువులు సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ సెలవు పూర్తైనా ఇంకా ఏవైనా సంబంధిత సమస్యలుంటే.. అధికారిక రుజువులు సమర్పించి మరో నెల పాటు సెలవు పొడిగించుకునే అదనపు అవకాశం కూడా ఇచ్చారు.

ఇది కేవలం అనుకోకుండా జరిగిన గర్భస్రావానికి మాత్రమే వర్తిస్తుందని పాలసీలో పేర్కొంది. అంటే కావాలని గర్భస్రావం చేయించుకున్న వారికి ఈ సెలవు వర్తించదన్నమాట! మరి, ఇంత చేసీ ఈ పాలసీ రూపొందించినా.. అమలవుతోందా అంటే పేపర్‌కే పరిమితమైందంటున్నారు నిపుణులు. అయితే గర్భస్రావంపై సమాజంలో నెలకొన్న అపోహలు, ఈ విషయం గురించి మహిళలు ధైర్యంగా బయటికి చెప్పలేకపోవడం, సదరు కంపెనీలు మహిళలకు ఈ లీవ్‌ గురించిన సమాచారం తెలియజేయకపోవడం.. వంటివన్నీ ఈ సెలవుల విధానానికి అడ్డుగోడగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.

ఏయే దేశాలిస్తున్నాయ్‌?

గర్భస్రావ సెలవుల గురించి మనకు అంతగా పరిచయం లేనప్పటికీ.. బయటి దేశాలు ఎప్పట్నుంచో ఈ తరహా సెలవుల్ని తమ ఉద్యోగులకు అందిస్తున్నాయి. అవేంటంటే..

* ఫిలిప్పీన్స్‌లో 60 రోజుల వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు మంజూరు చేస్తున్నారు. ఏ దశలో అబార్షన్‌ అయినా అందుకు కారణమేదైనా ఈ లీవ్‌ వర్తిస్తుంది.

* తైవాన్‌లో కనీసం 5 రోజుల నుంచి 4 వారాల మధ్య షరతులు, వేతనంతో కూడిన గర్భస్రావ సెలవు అమల్లో ఉంది. అయితే ఇది ఎన్ని రోజులు ఇస్తారన్నది వారి ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.

* ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ గర్భస్రావ సెలవుల బిల్లుపై ఆమోదం తెలిపింది. దీని ప్రకారం భార్యాభర్తలిద్దరూ మూడు రోజుల వేతనంతో కూడిన సెలవులు తీసుకోవచ్చు.

* ఇక ఇండోనేషియాలో ఆరు వారాలు, మారిషస్‌లో మూడు వారాల పాటు పూర్తి వేతనంతో కూడిన అబార్షన్‌ సెలవులు అందిస్తున్నారు.

వీటితో పాటు యూకేలోని పలు కంపెనీలు సైతం వాటి లీవ్‌ పాలసీలకు తగినట్లుగా వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులిస్తున్నాయి.

నిజానికి ఇలాంటి సెలవులు ఉద్యోగులు అన్ని విధాలా కోలుకొని.. తిరిగి సరికొత్త ఉత్సాహంతో విధుల్లోకి వచ్చేందుకు సహకరిస్తాయని చెప్పచ్చు. మరి, ఈ గర్భస్రావ సెలవులపై మీ స్పందనేంటి? మీ ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్