తక్కువ సమయంలోనే భాగస్వామిని ఎంచుకోవచ్చట..!

పెళ్లంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూడమన్నారు పెద్దలు. కానీ చేసుకోబోయే వారి గుణగణాలు నచ్చితే చాలంటోంది నేటి యువత. ఈ క్రమంలోనే తమకు నచ్చిన వారైనా.. పెద్దలు మెచ్చిన వారైనా.. కొన్నాళ్లు డేటింగ్‌ చేయడం, నచ్చితే ముందుకెళ్లడం, లేదంటే ఎవరి దారి....

Published : 19 Oct 2022 20:33 IST

పెళ్లంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూడమన్నారు పెద్దలు. కానీ చేసుకోబోయే వారి గుణగణాలు నచ్చితే చాలంటోంది నేటి యువత. ఈ క్రమంలోనే తమకు నచ్చిన వారైనా.. పెద్దలు మెచ్చిన వారైనా.. కొన్నాళ్లు డేటింగ్‌ చేయడం, నచ్చితే ముందుకెళ్లడం, లేదంటే ఎవరి దారి వాళ్లు చూసుకోవడం.. వంటివి ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైపోయాయి. అయితే ఈ బిజీ లైఫ్‌స్టైల్లో ఈమాత్రం తీరిక, ఓపిక లేని వారూ ఎంతోమంది! అలాంటి వారికోసం పుట్టుకొచ్చిందే ‘స్పీడ్‌ డేటింగ్‌’. సింగిల్‌గా ఉన్న అమ్మాయి, అబ్బాయి ప్రత్యక్షంగా కలుసుకొని.. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకొని.. తక్కువ సమయంలోనే భాగస్వామిని ఎంచుకోవడమే దీని ముఖ్యోద్దేశం అంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు..

డేటింగ్‌.. నచ్చిన వ్యక్తితో స్నేహం చేయడం, అభిప్రాయాలు కలిస్తే ఆ బంధాన్ని ప్రేమ, పెళ్లి వరకూ తీసుకెళ్లడం.. లేదంటే విడిపోవడం. పాశ్చాత్య దేశాల్లో పుట్టిన ఈ సంస్కృతిని ఇప్పుడు ఇక్కడా ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న యాప్స్‌, వెబ్‌సైట్స్‌కు లెక్కే లేదు. అయితే ఇలా రోజుల తరబడి, గంటల కొద్దీ సమయం వెచ్చిస్తూ మాట్లాడే తీరిక, ఓపిక ఈ కాలపు యువతకు ఉండట్లేదనే చెప్పాలి. ఏ పనైనా నిమిషాల్లో పూర్తి కావాలని కోరుకుంటున్నారు. ఆఖరికి భాగస్వామిని ఎంచుకోవడంతో సహా! ఇదిగో ఇలాంటి వాళ్ల కోసమే ‘స్పీడ్‌ డేటింగ్‌’ పద్ధతి పుట్టుకొచ్చింది.

పెళ్లి చూపుల్లాంటిదే.. కానీ!

సాధారణంగా డేటింగ్‌ అంటే.. ఒకమ్మాయి, అబ్బాయి ప్రత్యక్షంగా లేదంటే ఆన్‌లైన్‌లో కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం! దీనికి పరిమిత సమయాలేవీ ఉండవు. కానీ స్పీడ్‌ డేటింగ్‌ అలా కాదు. ఒకమ్మాయి, అబ్బాయి నేరుగా కలుసుకొని.. ఒకరి అభిప్రాయాలు-ఆలోచనలు మరొకరితో పంచుకొని.. తక్కువ సమయంలోనే భాగస్వామిని ఎంచుకోవడమన్నమాట! అంటే.. అవతలి వ్యక్తి నచ్చితే ముందుకెళ్లడం, లేదంటే ఎవరి దారి వారు చూసుకోవడం. ఓ రకంగా ఇవీ పెళ్లిచూపుల్లాంటివే! కాకపోతే.. ఇక్కడ కుటుంబాల కంటే.. చేసుకోబోయే వాళ్ల ఇష్టాయిష్టాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇందుకోసం ప్రత్యేక ఈవెంట్లు/ పరిచయ వేదికలు ఏర్పాటుచేసే కొన్ని సంస్థలు, వెబ్‌సైట్లు పని చేస్తున్నాయి.

కొద్ది సమయంలోనే..

ఆన్‌లైన్‌ డేటింగ్‌తో పోల్చితే స్పీడ్‌ డేటింగ్‌తో కొన్ని అదనపు ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

సాధారణంగా ఆన్‌లైన్‌ డేటింగ్‌లో ఎంత సమయం వెచ్చించినా.. నేరుగా కలుసుకున్న ఫీలింగ్‌ రాదు. అలాగే కొంతమంది తప్పుడు వివరాలు, ఫొటోలు పంచుకుని మోసం చేసే అవకాశం ఉంటుంది. అదే స్పీడ్‌ డేటింగ్‌లో అవతలి వ్యక్తుల్ని నేరుగా కలుసుకోవడంతో పాటు.. వారి రూపం, ఆహార్యం, గుణగణాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

ఈ రోజుల్లో వ్యక్తిగతంగా కంటే వృత్తి ఉద్యోగాల్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. దీంతో ఒక్కో నిమిషం ఎంతో విలువైనదిగా భావిస్తోంది నేటి తరం. ఈ క్రమంలో కొద్ది సమయంలోనే భాగస్వామిని ఎంచుకోవడానికి ఈ పద్ధతి కొంతవరకు ఉపయోగపడుతుందన్నది కొందరి అభిప్రాయం.

ఆన్‌లైన్‌ డేటింగ్‌లో ఒక్కోసారి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు.. వంటివి పంచుకోవడం ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది చిక్కుల్లో పడేసే ప్రమాదమూ లేకపోలేదు. ఉదాహరణకు.. ఫొటోలు, వీడియోలు అవతలి వారు మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయచ్చు. అదే స్పీడ్‌ డేటింగ్‌లో ఆయా వెబ్‌సైట్లు/యాప్స్‌లో ప్రాథమిక వివరాలు (పేరు, ఊరు, వయసు, సోషల్ మీడియా ఖాతాలు మొదలైనవి) నమోదు చేసుకున్నా.. అవి కేవలం నిర్వాహకులకు మాత్రమే తెలుస్తాయి. నిర్ణీత సమయంలో నేరుగా కలిసేవరకు ఎవరిని కలవబోతున్నామన్నది పరస్పరం తెలిసే అవకాశం ఉండదు. ఇతర విషయాలన్నీ నేరుగా కలుసుకుని, ఒకరికొకరు నచ్చితేనే పంచుకుంటారు కాబట్టి ఆన్‌లైన్‌ మోసాల విషయంలో ఇది కొంతవరకు సురక్షితం అంటున్నారు నిపుణులు.

స్పీడ్‌ డేటింగ్‌లో పెళ్లి చూపుల మాదిరి నేరుగా కలిసి, ముఖాముఖీ మాట్లాడుకోవడం వల్ల అవతలి వ్యక్తి గురించి ఎలాంటి సందిగ్ధతా లేకుండా ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎదుటి వ్యక్తి నచ్చితే ముందుకెళ్లచ్చు.. లేదంటే అక్కడే కట్ చేసేయచ్చు.

అయితే ఇందుకోసం వివరాలు నమోదు చేయడానికి విశ్వసనీయమైన వెబ్‌సైట్‌/యాప్‌ను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించడం మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే స్పీడ్ డేటింగ్ ముసుగులో కొందరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

అలాగే-ఒంటరిగా ఉండి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలనుకునే వారు దీనిని కేవలం ఒక పరిచయ వేదికగా మాత్రమే భావించాలి. తొలి సమావేశంలో ఒకవేళ ఎదుటి వ్యక్తి నచ్చినట్లయితే- వారితో కలిసి ఏడడుగులు వేయాలా వద్దా అన్నది అన్ని విషయాల గురించి కూలంకషంగా విచారించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించుకోవాలని కూడా  సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్