93 ఏళ్ల నాటి ఇల్లు.. ఇద్దరూ కలిసి ‘కలల సౌధం’గా మార్చుకున్నారు..!

ఈ రోజుల్లో ఇళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం గూడు కోసమే ఇంటిని నిర్మించుకునే వారు. కానీ, ప్రస్తుత రోజుల్లో ఇంటికి ఎన్నో హంగులు అద్దుతూ ఇంద్రభవనంలా తీర్చిదిద్దుతున్నారు. యూకేలోని బ్రైటన్‌ ప్రాంతానికి చెందిన చార్లొట్ దంపతులు విభిన్నంగా ఆలోచించారు.

Published : 25 Jan 2024 12:58 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో ఇళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం గూడు కోసమే ఇంటిని నిర్మించుకునే వారు. కానీ, ప్రస్తుత రోజుల్లో ఇంటికి ఎన్నో హంగులు అద్దుతూ ఇంద్రభవనంలా తీర్చిదిద్దుతున్నారు. యూకేలోని బ్రైటన్‌ ప్రాంతానికి చెందిన చార్లొట్ దంపతులు విభిన్నంగా ఆలోచించారు. 1930ల కాలం నాటి ఇంటిని కొనుగోలు చేసి భార్యాభర్తా కలిసి సొంతంగా హంగులు అద్దుతున్నారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దాంతో ఈ దంపతులు నెట్టింట వైరల్‌గా మారారు. అంతేకాదు.. తమ ఇంటి విలువను కొన్నదాని కంటే దాదాపు 2 కోట్లకు పెంచుకోగలిగారు కూడా. ఈ క్రమంలో వారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...!

వారాంతాల్లో..

బ్రైటన్‌ ప్రాంతానికి చెందిన చార్లొట్, బాబీ దంపతులు 2021లో ట్రిపుల్‌ బెడ్‌రూంని 4.6 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఆ ఇల్లు 1930ల కాలం నాటిది కావడంతో ఆధునికీకరించాలనుకున్నారు. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుందని తెలియడంతో ఆ పనిని తామే చేయడం ప్రారంభించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వారాంతాలు, సాయంత్రం వేళల్లో ఇంటి పని చేస్తున్నారు. అలా గత రెండేళ్లుగా చాలా పనులను పూర్తి చేశారు. ఈ క్రమంలో తమ ఇంటికి కొన్ని ప్రత్యేకతలు ఉండేలా చూసుకున్నారు. అలా తమ ఇంటి విలువను కొన్నదాని కంటే దాదాపు రెండు కోట్లకు పెంచుకోగలిగామంటున్నారు ఈ దంపతులు. అలాగే వారు చేసే ప్రతి పనిని వీడియోలు తీసి ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తున్నారు. దాంతో ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో వీరి గురించి ప్రపంచానికి తెలిసింది.

ఈ సందర్భంగా చార్లొట్ మాట్లాడుతూ ‘మేము ఎక్కువగా ఖర్చు అయ్యే పనులను సొంతంగా చేసుకుంటున్నాం. కార్నర్‌ అవుట్‌డోర్‌ సోఫా, డైనింగ్‌ టేబుల్‌, బెంచ్‌, వార్డ్‌రోబ్‌ అన్నింటినీ మేమే తయారు చేశాం. కిచెన్‌, బెడ్‌రూంలను తొలగించి కొత్తగా తీర్చిదిద్దాం. గార్డెన్‌ను కూడా మరింతగా విస్తరించాం. ఇందుకోసం నాలుగు లారీల సుద్ద, మట్టిని తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత గార్డెన్‌ను నాలుగు భాగాలుగా విభిజించాం. ఇందులో లాన్, కూరగాయల తోట, కిడ్స్‌ గార్డెన్.. వంటివి ఏర్పాటు చేసుకున్నాం..’  అని చెప్పుకొచ్చింది.

గర్భవతిగా ఉన్నప్పుడే..!

ఈ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడ్డామని చెప్పుకొచ్చింది చార్లొట్. ‘ఇంటి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు అన్ని వారాంతాల్లోనూ పని చేశాం. చాలా సాయంత్రాలు ఇంటి కోసం వెచ్చించాం. నేను కడుపుతో ఉన్నప్పటికీ నా వంతు సహాయం చేశాను. అలా ఇంటి పనుల్లో ఉండగానే బాబుకి జన్మనిచ్చాను. ఒకవైపు పిల్లల బాగోగులు చూసుకుంటూనే ఇంటి పనులు పూర్తి చేస్తున్నాం. మా పిల్లలు భవిష్యత్తులో సంతోషంగా గడపడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మా ప్రయత్నాన్ని చాలామంది అభినందించారు. ఇక్కడ కొన్ని పార్టీలు కూడా చేసుకున్నాం’ అంటోంది చార్లొట్.

బంధం బలపడింది...!

చార్లొట్ దంపతులు తమ ఇంట్లో కొన్ని ప్రత్యేకతలు ఉండేలా చూసుకున్నారు. ఇందులో భాగంగా పిల్లల కోసం ప్రత్యేకంగా ‘క్లైంబింగ్‌ వాల్‌’ ఏర్పాటు చేశారు. అలాగే కాంపౌండ్‌ వాల్‌ను విభిన్నంగా తీర్చిదిద్దారు. ఇక చిల్డ్రన్ గార్డెన్‌, గార్డెన్ ఫర్నిచర్‌ ఇలా అన్నీ విభిన్నంగా ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఇంటి పనుల్లో భాగంగా తమ బంధం కూడా బలపడిందంటోంది చార్లొట్. ఈ దంపతులు తమ పేరుతో ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి అందులో తమ ఇంటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఖాతాను 65 వేల మంది అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా ‘మా పనిని పూర్తిగా ఆస్వాదిస్తున్నాం. అంతేకాదు.. మా పని వల్ల గర్వంగా కూడా ఉంది. ఈ పనుల్లో భాగంగా మా ఇద్దరి మధ్య బంధం కూడా బలపడింది. కుదిరితే ఇంకో ప్రాంతంలో స్థలం కొని ఇంటిని నిర్మిస్తాం’ అని చెప్పుకొచ్చింది చార్లొట్. మరి వీళ్ల ప్రయత్నాన్ని అభినందించాల్సిందే కదూ..!





Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్