Published : 12/08/2021 21:12 IST

పేరెంటింగ్ ఓకే... షేరెంటింగ్ వద్దు !

ముద్దుగా ఉన్నాయని మీ బాబు మాట్లాడే ప్రతి మాటను ఫేస్‌బుక్‌లో పెడుతున్నారా ? బాగా చదువుతోందనో, డ్యాన్స్ చేస్తోందనో మీ పాప ప్రతి కదలికను పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నారా ? అయితే జాగ్రత్త ! వాటివల్ల తెలీకుండానే మీ పిల్లలు వివిధ ఇబ్బందులకు లోనవ్వచ్చు. పిల్లలే లోకంగా బతికే ప్రతి తల్లీదండ్రీ తమ పిల్లల గురించి జనం తెలుసుకోవాలని ఉవ్విళ్లూరడం సహజం. అయితే ఇది శృతి మించి 'షేరెంటింగ్'గా మారి పిల్లల భవితవ్యానికి భారంగా మారుతుందని మీకు తెలుసా ? అసలు ముందు ఈ షేరెంటింగ్ అంటే ఏంటంటారా ? అయితే వివరాలలోకి వెళ్లాల్సిందే !

షేరెంటింగ్ అంటే...!

పిల్లలతో గడిపే సంతోష క్షణాలని ఫోటోలు, వీడియోలలో బంధించి, వాటిని అప్పుడప్పుడూ సామాజిక మాధ్యమాలలో పంచుకోవడం సహజం. అలా కాకుండా వారి పుట్టుపూర్వోత్తరాల నుండి వారికి సంబంధించిన అన్ని విషయాలనీ క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో పంచుకోవడమే 'షేరెంటింగ్'. మీ అత్యుత్సాహం కారణంగా మీకు తెలియకుండానే ఇది జరిగిపోతుంటుంది. దీనివల్ల మీ పిల్లల మానసిక స్థితిపై దుష్ప్రభావం పడుతుంది, వారిని ప్రమాదాలకు గురిచేస్తుంది. ఇటీవల కాలంలో పిడియాట్రీషియన్స్ (పిల్లలవైద్యులు) పిల్లల మానసిక స్థితిపై షేరెంటింగ్ ప్రభావం గురించి అధ్యయనం మొదలుపెట్టారంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దుష్ప్రభావాలు.. అనూహ్య ప్రమాదాలు !

యుక్తవయసులోకి వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల వద్ద అన్ని విషయాలు పంచుకోరనేది అందరూ అంగీకరించేదే. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలను ట్యాగ్ చేసి మరీ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతుండడం పిల్లల ప్రైవసీకి అడ్డువస్తోందట. తద్వారా తోటి స్నేహితుల నుండి బుల్లీయింగ్‌కి గురై మానసిక వ్యధకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే చాలామంది పిల్లలు తమకు తెలియకుండా తమ పోస్టులను పెట్టవద్దని తల్లిదండ్రులకు చెబుతున్నారట.

అమెరికాలోని ఒక టీనేజర్ ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఆమె కళాశాల వయసుకి వచ్చినా తల్లి ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆమె చిన్నప్పటి ఫోటోలు సైతం ఉండడం స్నేహితులు గమనించారట. తర్వాత స్నేహితుల ముందు అవమానానికి లోనైన ఆ అమ్మాయి తన అనుమతి లేనిది తన ఫోటోలను పోస్ట్ చేయవద్దని తల్లికి ఆంక్షలు పెట్టిందట. అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ జరిపిన సర్వే ప్రకారం దాదాపు 75% తల్లిదండ్రులు ఇలా షేరెంటింగ్‌కి పాల్పడుతున్నట్లు తేలింది.

అంతేకాదు, ఇలా పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల చైల్డ్ గ్రూమింగ్ (సామాజిక మాధ్యమాలలోని విషయాల ఆధారంగా పిల్లలను లోబరచుకొని లైంగికంగా లొంగదీసుకోవడం), చైల్డ్ ట్రాఫికింగ్ (పిల్లల అక్రమ రవాణా), డిజిటల్ కిడ్నాపింగ్/ఫ్రాడ్ (వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి ఆర్థిక లావాదేవీలు జరపడం) వంటి సంఘటనలు గతంలో అనేకం జరిగాయి, జరుగుతున్నాయి కూడా. ఇలా కొందరు నేరస్తులు తల్లిదండ్రుల పోస్టింగుల ద్వారానే పిల్లలను అపహరించినట్లు తెలిపిన ఉదంతాలు దినపత్రికల్లో మనం అనేకం చూశాం.

కొన్ని జాగ్రత్తలతో పరిష్కారం !

తల్లిదండ్రులలో షేరెంటింగ్‌కు ఎక్కుగా పాల్పడేది తల్లేనట. వీరిలోనూ సామాజిక మాధ్యమాల సెట్టింగ్స్ గురించి తెలియనివారు కొందరుంటే, ఎక్కువ లైకులు, షేర్ల కోసం ముక్కూ మొహం తెలియని వారిని వేల కొద్దీ ఫ్రెండ్స్‌గా చేసుకున్నవారు కొందరట. ఈక్రమంలో తమ పోస్టింగులకు కొన్ని పరిమితులను విధించుకుని, సామాజిక మాధ్యమాలలోని ప్రైవేట్, కస్టమ్ గ్రూప్‌ల సెట్టింగ్స్‌ని వినియోగిస్తే.. చాలా వరకు సమస్యలను పరిష్కరించవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. చూశారు కదా !

మీరు కూడా ఇలా షేరెంటింగ్ చేస్తున్నట్త్లెతే వెంటనే జాగ్రత్త పడండి ! ఇక్కడ చెప్పిన సూచనలని పాటించి మీకు కావలసిన వారితోనే మీ పిల్లల విషయాలను పంచుకోండి !


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని