అందాన్ని పెంచే ‘షీట్‌ మాస్క్‌’!

అందంగా కనిపించడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఇంట్లోనే సహజసిద్ధంగా సౌందర్య పోషణ చేసుకునే వారే ఎక్కువని చెప్పాలి. ఇలాంటి వాళ్ల కోసం ప్రస్తుతం ‘షీట్‌ మాస్కు’లు అందుబాటులో ఉన్నాయి. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల......

Updated : 10 Aug 2022 16:30 IST

అందంగా కనిపించడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఇంట్లోనే సహజసిద్ధంగా సౌందర్య పోషణ చేసుకునే వారే ఎక్కువని చెప్పాలి. ఇలాంటి వాళ్ల కోసం ప్రస్తుతం ‘షీట్‌ మాస్కు’లు అందుబాటులో ఉన్నాయి. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా వీటిని ఉపయోగిస్తూ బోలెడన్ని సౌందర్య ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటున్నారు. మరి, ఏంటీ షీట్‌ మాస్క్‌? దీనివల్ల అందం ఎలా ఇనుమడిస్తుందో? తెలుసుకుందాం రండి..

ఎలా తయారవుతుందంటే..!

దక్షిణ కొరియాలోనే పుట్టినా.. ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించాయి ఈ షీట్‌ మాస్కులు. మగువల బ్యూటీ కిట్‌లో భాగమైపోయాయి. సాధారణంగా మనం ఉపయోగించే చాలా సౌందర్య ఉత్పత్తుల్లో సీరం అనే పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇదే సీరంతో షీట్‌ మాస్క్‌ తయారవుతుంది. గాఢత కలిగిన సీరంలో షీట్‌ ఫ్యాబ్రిక్స్‌ని నానబెట్టి వీటిని తయారుచేస్తారు. ఇదొక్కటనే కాదు.. బ్లూ బెర్రీ, బొప్పాయి.. వంటి పండ్ల గుజ్జు, పోషకాలతో నిండిన మొక్కల సారం, సముద్రపు నాచు, వెదురు, కలబంద, గ్రీన్‌ టీ, చార్‌కోల్‌.. వంటి పదార్థాలను కూడా షీట్‌ మాస్క్స్‌ తయారీకి ఉపయోగిస్తారు. దీనికోసం ముఖ్యంగా పేపర్‌, ఫైబర్స్‌, పత్తి, జెల్‌ తరహా మెటీరియల్స్‌ని వాడతారు. హైఅల్యూరోనిక్‌ యాసిడ్‌, విటమిన్లు, ఇతర పోషకాలు నిండి ఉన్న ఈ పదార్థాలు మాస్క్‌లోకి చేరతాయి. ఇలాంటి మాస్క్‌ని ముఖానికి ధరించడం వల్ల ఆ పోషకాలన్నీ ముఖ చర్మంలోకి ఇంకి చర్మాన్ని పునరుత్తేజితం చేస్తాయి.

వేసుకోవడం-తొలగించడం చాలా సులువు!

ఫేస్‌ప్యాక్‌ వేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది.. పైగా ఇది వేసుకున్న తర్వాత అన్ని పనులు చేసుకోవడానికి వీలుండచ్చు.. ఉండకపోవచ్చు..! కానీ షీట్‌ మాస్క్‌ అలా కాదు.. దీన్ని ధరించి ఏ పనైనా ఈజీగా చేసేసుకోవచ్చు. పైగా వేసుకోవడం కూడా చాలా సులువు. అన్ని ముఖాకృతులకూ ఒకే షీట్‌ మాస్క్‌ సూటవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగంటే.. కళ్లు, ముక్కు రంధ్రాలు, నోటి భాగంలో ఈ మాస్క్‌కి రంధ్రాలుంటాయి. ముందుగా నుదురు దగ్గర షీట్‌ మాస్క్‌ పెట్టుకొని.. కళ్లు, ముక్కు, బుగ్గలు, గడ్డం దాకా నెమ్మదిగా విస్తరించుకుంటూ వస్తే సులభంగా మాస్క్‌ వేసుకోవచ్చు.. ఈ చిట్కా పాటిస్తే ఏ ముఖాకృతికైనా ఈ మాస్క్‌ని సెట్‌ చేసుకోవచ్చు.. అలాగే ఈ మాస్క్‌ చర్మానికి అంటుకునే దాకా నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలి. అంతేకాదు.. మాస్క్‌ వేసుకోవడానికి ముందు ముఖ చర్మాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్న విషయం మర్చిపోవద్దు. ఇలా వేసుకున్న షీట్‌ మాస్క్‌ని అరగంట పాటు ఉంచుకొని తొలగిస్తే సరిపోతుంది. సాధారణంగా ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే నీటితో తొలగించుకుంటాం.. కానీ ఈ షీట్‌ మాస్క్‌ తొలగించిన తర్వాత నీటితో శుభ్రపరచుకోవాల్సిన పనిలేదు.

ఎన్నిసార్లు వేసుకోవచ్చు?

షీట్‌ మాస్క్‌ని రోజుకోసారి లేదా వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు. అది కూడా అరగంట సేపు మాత్రమే వేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగే షీట్‌ మాస్క్‌లో ఉండే తడిదనం అంత త్వరగా ఇగిరిపోదట! ఎక్కువ సమయం పాటు తేమ నిలిచి ఉండి.. మాస్క్‌లోని పోషకాలు చర్మానికి ఇంకేలా ఇది సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఈ మాస్క్‌ల నాణ్యత, బ్రాండ్‌, వాటిలో ఉపయోగించిన ఇతర పదార్థాలను లేబుల్‌పై పరిశీలించాకే తీసుకోమంటున్నారు.

చర్మతత్వాన్ని బట్టే ఎంచుకోవాలి!

షీట్‌ మాస్కుల తయారీలో వాడే సహజసిద్ధమైన పదార్థాల్లోని సుగుణాలు చర్మానికి పూర్తిగా అందాలంటే ఆయా చర్మతత్వాలను బట్టి మాస్కుల్ని ఎంచుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. జిడ్డు, పొడి, సాధారణ.. ఇలా ఆయా చర్మతత్వాలను బట్టి విభిన్న షీట్‌ మాస్కులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. మీ చర్మానికి ఏది సరిపోతుందో ఆయా షీట్‌ మాస్క్‌ ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌ని పరిశీలిస్తే తెలిసిపోతుంది. కాబట్టి కొనే ముందు లేబుల్‌ చూసి తీసుకోవడం మంచిది. లేదంటే సౌందర్య నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు.

ప్రయోజనాలెన్నో!

చర్మం తేమగా ఉంటేనే తాజాగా కనిపిస్తుంది. ఇలా చర్మానికి తేమనందించడంలో షీట్‌ మాస్క్‌ చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

షీట్ మాస్కుల తయారీకి వాడే పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు; ‘సి’, ‘ఎ’ విటమిన్లు, కొలాజెన్‌, ఇతర పోషకాలు.. చర్మానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి. చర్మంపై వాపు, మొటిమలు, దద్దుర్లు.. వంటి వాటిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి.

ఒక్కోసారి ఎండ వల్ల, ముఖంపై ఉండే మచ్చల కారణంగా ముఖమంతా నల్లగా తయారైపోతుంది. అలాంటప్పుడు షీట్‌ మాస్క్‌ని ఉపయోగిస్తే చర్మం తిరిగి సాధారణ రంగులోకి మారుతుంది. ఇలా చర్మ ఛాయ పెంచడంలోనూ దీని పాత్ర కీలకమే!

షీట్‌ మాస్కుల్లో ఉండే విటమిన్‌ ‘సి’ చర్మానికి మెరుపునిస్తుంది.. అలాగే పిగ్మెంటేషన్‌ సమస్యను దూరం చేస్తుంది.

సముద్రపు నాచుతో తయారైన షీట్‌ మాస్కులు చర్మానికి తేమనందించడంలో ముందుంటాయి. అలాగే ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి.

హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై మొటిమలు, హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యలొస్తుంటాయి. వాటికి చెక్‌ పెట్టాలంటే ఈ షీట్‌ మాస్కుల్లో ఉండే విటమిన్‌ ‘ఎ’ అందుకు దోహదం చేస్తుంది.

వెదురులో ఉండే సిలికా అనే సమ్మేళనం కొలాజెన్‌ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. తద్వారా కొత్త చర్మ కణాలు ఏర్పడి చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది. అలాగే చర్మంపై ఏర్పడిన గీతలు-ముడతలను కూడా ఈ తరహా షీట్‌ మాస్కులు తొలగిస్తాయి.

ఇక పండ్ల గుజ్జుతో తయారుచేసిన షీట్‌ మాస్కుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాగే డ్యామేజ్‌ అయిన చర్మ కణాలను తిరిగి రిపేర్‌ చేస్తాయి.

ఇవి గుర్తుంచుకోండి!

షీట్‌ మాస్కులు చర్మానికి తేమనందిస్తాయి.. కాబట్టి వాటిలోని తేమ ఇగిరిపోయేదాకా అలాగే ఉంచుకుందాం అనుకుంటే సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఎందుకంటే షీట్‌ మాస్క్‌ ముఖంపైనే పొడిబారిపోతే పగుళ్లు ఏర్పడతాయి. చర్మానికి అంటుకుపోయిన దీన్ని తొలగించాలంటే ఇబ్బందవుతుంది.. సరికదా చర్మానికి డ్యామేజ్‌ కూడా అవుతుంది. అందుకే షీట్‌ మాస్క్‌ని అరగంట కంటే ఎక్కువ సేపు ఉంచుకోకూడదు.

షీట్‌ మాస్క్‌ తొలగించుకున్నాక కొద్దిగా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. తద్వారా షీట్‌ మాస్క్‌లోని సుగుణాలన్నీ చర్మంలోకి మరింత బాగా ఇంకుతాయి. అలాగే కళ్ల కింద ఐ-క్రీమ్‌ రాసుకోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు.

షీట్‌ మాస్కులు సహజసిద్ధమైన పదార్థాలతో, ఒక్కో చర్మతత్వానికి విడివిడిగా తయారైనప్పటికీ వీటిని ఉపయోగించడం వల్ల చర్మంపై దురద, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తే మాత్రం వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం మంచిది.. లేదంటే ఎంచుకునే ముందే నిపుణుల్ని అడిగితే మీ చర్మతత్వాన్ని బట్టి వారే చక్కటి మాస్క్‌ సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్