నేలపై పాకుతూ ఫిట్‌గా మారిపోతారా..?

కండరాల దృఢత్వానికి, కొవ్వు కరిగి.. ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. అయితే వీటి ద్వారా శరీరం మొత్తానికి ఎక్సర్‌సైజ్ అందుతోందా.. లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా శరీరం మొత్తానికి వ్యాయామం అందించేదే క్రాలింగ్.

Published : 10 Aug 2023 12:34 IST

కండరాల దృఢత్వానికి, కొవ్వు కరిగి.. ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. అయితే వీటి ద్వారా శరీరం మొత్తానికి ఎక్సర్‌సైజ్ అందుతోందా.. లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా శరీరం మొత్తానికి వ్యాయామం అందించేదే క్రాలింగ్! అదేనండీ.. పసిపిల్లలు నేలపై పాకుతారు కదా.. అలా పాకడం ద్వారా శరీరానికి చక్కని వ్యాయామం అందించవచ్చట! అంతేకాదు.. దీనివల్ల కలిగే ఫలితాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

కండరాలు దృఢంగా..

పాకడం ద్వారా కాళ్లు, చేతులు, నడుము.. ఇలా శరీరంలోని ప్రధాన భాగాలన్నీ కదులుతాయి. తద్వారా ఆయా భాగాలకు తగినంత వ్యాయామం అందుతుంది. ఫలితంగా కండరాలు మరింత దృఢంగా మారతాయి. అలాగే వెన్నునొప్పి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాదు.. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలన్నింటినీ మన శరీరానికి అందేలా చేయడంలోనూ ఈ వ్యాయామం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఆ సమస్యలకు దూరం..

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గుముఖం పడుతుండడంతో తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోజువారీ వ్యాయామంలో భాగంగా పాకడం కారణంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. ఈ వ్యాయామం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలను కూడా చాలావరకు నివారించవచ్చు.

చక్కటి నృత్యరీతులకు..

డ్యాన్స్ చేసే క్రమంలో కొంతమంది ఎంత ప్రయత్నించినా పూర్తి స్థాయిలో అన్ని రకాల మూవ్‌మెంట్స్ చేయలేకపోతుంటారు. అయితే మీ ఫిట్‌నెస్ రొటీన్‌లో పాకడాన్ని భాగం చేసుకోండి. దీని ద్వారా ఫిట్‌గా ఉండడమే కాదు.. డ్యాన్స్‌లో వివిధ రకాల మూవ్‌మెంట్స్‌ని పర్ఫెక్ట్‌గా చూపించేందుకు కూడా ఇది బాగా తోడ్పడుతుంది.

తీరైన ఆకృతి కూడా..

పాకేటప్పుడు కాళ్లు, చేతులు, నడుము, తొడలు.. ఇలా ప్రతి భాగానికీ వ్యాయామం అందుతుంది. కాబట్టి ఆయా భాగాల వద్ద కండరాల సామర్థ్యం మెరుగుపడడం మాత్రమే కాదు.. తీరైన ఆకృతి కూడా సొంతమవుతుంది.. అంటే ఈ వ్యాయామం చేయడం ద్వారా ఓవైపు ఫిట్‌గా ఉంటూనే మరోవైపు అందంగా కూడా మెరిసిపోవచ్చన్న మాట!

ఎన్నెన్నో ప్రయోజనాలు..

క్రాలింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఆటల్లో కూడా బాగా రాణించవచ్చు.

తరచూ ఈ వ్యాయామం చేయడం వల్ల చేతులకే కాదు.. భుజాలకు కూడా బరువు మోసే సామర్థ్యం పెరుగుతుంది.

క్రాలింగ్ ద్వారా శరీరంలో ఉండే అదనపు క్యాలరీలను కూడా సులభంగా ఖర్చు చేయచ్చు.

రోజువారీ పనుల కారణంగా మనం ఎదుర్కొనే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇది చక్కని మార్గం. అలాగే మన శరీరంలోని నాడీ వ్యవస్థను కూడా ఇది బాగా ప్రభావితం చేసి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

రకరకాలుగా..

సాధారణంగా పాకడం అనగానే చిన్నపిల్లలు పాకడమే మనకు గుర్తొస్తుంది. అయితే వ్యాయామంలో భాగంగా చిన్నపిల్లల్లానే మనమూ పాకాలని నియమం ఏమీ లేదు. రకరకాలుగా క్రాలింగ్ చేస్తూ దాన్ని మన ఫిట్‌నెస్ రొటీన్‌లో భాగం చేసుకోవచ్చు. అయితే మీ కండరాల సామర్థ్యం ఆధారంగా ఎంతసేపు, ఏ రకంగా పాకాలి అనేది మాత్రం వ్యక్తిగత ఫిట్‌నెస్ నిపుణులను సంప్రదించి తెలుసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్