27 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. ఇక చాలనుకున్నారు!

వారిద్దరివీ వెన్న కంటే సున్నితమైన మనసులు.. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ.. ప్రజా సేవలోనే సంతోషం, సంతృప్తి వెతుక్కున్నారు. అలాంటి అందమైన మనసులు మూడు దశాబ్దాల క్రితం ఒక్కటయ్యాయి. పెళ్లితో శాశ్వతంగా పెనవేసుకున్నాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పీటముడిని తాజాగా తెంచుకొని వీగిపోతున్నాయి. వారు మరెవరో కాదు.. బిల్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌, ఆయన సతీమణి మెలిందా.

Published : 24 Jun 2021 13:26 IST

వారిద్దరివీ వెన్న కంటే సున్నితమైన మనసులు.. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ.. ప్రజా సేవలోనే సంతోషం, సంతృప్తి వెతుక్కున్నారు. అలాంటి అందమైన మనసులు మూడు దశాబ్దాల క్రితం ఒక్కటయ్యాయి. పెళ్లితో శాశ్వతంగా పెనవేసుకున్నాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పీటముడిని తాజాగా తెంచుకొని వీగిపోతున్నాయి. వారు మరెవరో కాదు.. బిల్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌, ఆయన సతీమణి మెలిందా. 27 ఏళ్ల క్రితం పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. ఇకపై జీవిత భాగస్వాములుగా కొనసాగలేమని ప్రకటించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. తమ విడాకుల విషయాన్ని తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఉమ్మడిగా ప్రకటించి ప్రపంచాన్ని ఒక్కసారిగా విస్మయంలో పడేసింది. ఈ నేపథ్యంలో ఈ జంట గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

మొన్నటికి మొన్న అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌-మెకంజీ స్కాట్‌ విడాకుల విషయాన్ని అందరూ మర్చిపోకముందే.. మరో సంపన్న జంట విడాకులకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థగా పేరుగాంచిన ‘బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు బిల్‌, మెలిందాలు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లుగా తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడిగా ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రకటన చేశారు.

దంపతులుగా విడిపోయినా..!

తమ సేవా సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, ప్రజారోగ్యం, వాతావరణ పరిరక్షణకు నడుం బిగించిన గేట్స్ జంట.. తాము విడిపోయినా తమ సేవా కార్యక్రమాల్లో ఇరువురి భాగస్వామ్యం ఎప్పటిలాగే కొనసాగుతుందని ఈ ఉమ్మడి ప్రకటనలో భాగంగా చెప్పుకొచ్చారు.

‘ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాం. గత 27 ఏళ్లలో మేమిద్దరం మా ముగ్గురు పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాం. మా ఫౌండేషన్‌ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యం, వారి సంక్షేమం కోసం కృషి చేశాం. అయితే జీవిత భాగస్వాములుగా మేము విడిపోయినా.. దీని ప్రభావం సంస్థలో మా ఇద్దరి భాగస్వామ్యం, ఇతర సేవా కార్యక్రమాలపై ఏమాత్రం ఉండదు. ఇప్పటిదాకా ఎలాగైతే కలిసి పనిచేశామో.. ఇక పైనా అలాగే కొనసాగుతాం. అయితే మీ నుంచి మేం కోరేది ఒక్కటే.. మేము ఎంచుకున్న ఈ కొత్త జీవితంలో మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా ఈ నిర్ణయాన్ని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తున్నాం..’ అంటూ తమ అంతిమ నిర్ణయాన్ని ట్వీట్‌ రూపంలో పంచుకున్నారీ మాజీ కపుల్.

ప్రేమ-డేటింగ్‌-పెళ్లి!

ప్రేమ బంధం శాశ్వతమవ్వాలంటే కేవలం చూపులే కాదు.. అభిరుచులు-ఇష్టాయిష్టాలు కూడా కలవాలంటారు. బిల్‌-మెలిందాల ప్రేమ విషయంలో కూడా ఇదే జరిగింది. 1987లో బిల్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా వ్యవహరిస్తోన్న సమయంలో ఆ కంపెనీలో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరారు మెలిందా. అప్పట్లో ఆ కంపెనీలో చేరిన తొలి మహిళా ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ మెలిందానే! ఇద్దరి అభిరుచులు, ఆలోచనా విధానం ఒకేలా ఉండడంతో మనసులు కలిశాయి. దీంతో ఆమెను ఓ రోజు డిన్నర్‌ డేట్‌కు కూడా తీసుకెళ్లాడట బిల్‌. ఇలా కొన్నేళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట.. 1994లో కొత్త ఏడాది రోజున హవాయి దీవుల్లో పెళ్లి బంధంతో ఒక్కటైంది. వీరి 27 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలున్నారు. సేవా గుణం అణువణువునా నిండి ఉన్న వీరిద్దరూ 2000 సంవత్సరంలో ‘బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యం, విద్య, వాతావరణ పరిరక్షణ.. తదితర అంశాలపై ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తోందీ సంస్థ. ఈ క్రమంలో తమ ఆస్తిలో సుమారు మూడో వంతు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నారంటే ఈ జంట దాతృత్వం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా వృత్తి జీవితంలోనే కాదు.. కుటుంబం, పిల్లల బాధ్యతనూ కలిసి కట్టుగానే నిర్వహిస్తామని, ఎందులోనైనా ఐక్యతను చూపుతామంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు మెలిందా. ఫౌండేషన్ కార్యక్రమాలతో పాటు మహిళా సాధికారత కోసం కూడా కృషి చేస్తున్నారు మెలిందా. ఇందులో భాగంగా ఒక ఇన్వెస్ట్ మెంట్ కంపెనీని కూడా నెలకొల్పారు.

నా కన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది!

ఇటు భార్యాభర్తలుగా ఇంటి బాధ్యతల్ని సమానంగా నిర్వర్తిస్తూనే.. అటు ఫౌండేషన్‌ బాధ్యతల్నీ సమానంగానే పంచుకోవడం ఈ జంటకు అలవాటు. అయితే ఈ విషయంలో మెలిందా తన కంటే నాలుగాకులు ఎక్కువే చదివిందంటారు బిల్.
‘నిజమైన భాగస్వామి అంటే మెలిందానే! ఇతరులకు మంచి చేయడంలో తనెప్పుడూ ముందే ఉంటుంది. ఎవరికి ఏం కావాలన్న విషయాన్ని నా కంటే బాగా పసిగడుతుంది. సైన్స్‌ అంటే తనకు మహా ఇష్టం..’ అంటూ తన భార్య గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారాయన. ఇక బిల్‌ గురించి మెలిందాను అడిగితే.. ‘నేనెప్పుడూ ఆయన దృష్టి కోణంలోనే చూడాలనుకుంటా. ఆయనా నా విషయంలో ఇలాగే అనుకుంటాడని నాకు తెలుసు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి అభిప్రాయభేదాలూ తలెత్తుతాయి. నిజానికి అవి మా మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేస్తాయి..’ అంటూ తమ దాంపత్య జీవితంలోని రహస్యాన్ని ఓసారి ఫేస్‌బుక్‌ లైవ్‌లో బయటపెట్టారామె. ఇలా ఇన్నేళ్ల తమ వైవాహిక బంధంతో ఎన్నో జంటల్లో స్ఫూర్తి కలిగిస్తూ వస్తోన్న ఈ జంట విడిపోతున్నామని తాజాగా ప్రకటించిన మరుక్షణం నుంచి సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా అందరూ విస్మయానికి గురవుతున్నారంటే అది అతిశయోక్తి కాదు.

ఇదెంతో సవాలుతో కూడుకున్న సమయం!

అయితే ఈ జంట విడాకులపై వారి కూతురు జెన్నిఫర్ తాజాగా స్పందించింది. ఈ నేపథ్యంలో తన మనసులోని మాటల్ని ఇన్‌స్టా స్టోరీ రూపంలో పంచుకుంది.
‘ఇది మా కుటుంబానికి ఎంతో సవాలుతో కూడుకున్న సమయం. ఇలాంటి సందర్భంలో నా భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ మా కుటుంబానికి అండగా ఉండడమెలాగో అవగాహన చేసుకుంటున్నా. అయితే మా తల్లిదండ్రులు తీసుకున్న ఈ నిర్ణయం గురించి నేనేమీ మాట్లాడాలనుకోవట్లేదు. మీరు వాళ్ల నిర్ణయాన్ని గౌరవించి.. మద్దతుగా ఉంటారని ఆశిస్తున్నా..’ అంటూ రాసుకొచ్చిందామె. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి హ్యూమన్‌ బయాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది జెన్నిఫర్‌. ఆమెకు రోరీ అనే తమ్ముడు, ఫోబే అనే చెల్లెలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్