పెళ్లికి ముందే..!

అప్పటిదాకా సోలోగా ఎలా గడిపినా.. పెళ్లయ్యాక మాత్రం ఎన్నో బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం కుటుంబపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు.. అయితే ఇలాంటి వాటి గురించి పెళ్లికి ముందే ఓ అవగాహన ఉండడం అవసరం అంటున్నారు నిపుణులు.

Updated : 25 Jan 2024 13:22 IST

అప్పటిదాకా సోలోగా ఎలా గడిపినా.. పెళ్లయ్యాక మాత్రం ఎన్నో బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం కుటుంబపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు.. అయితే ఇలాంటి వాటి గురించి పెళ్లికి ముందే ఓ అవగాహన ఉండడం అవసరం అంటున్నారు నిపుణులు. తద్వారా ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడంతో పాటు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ‘ఇప్పుడేం చేయాలి?’ అన్న ప్రశ్న తలెత్తదు. మరి, ఇంతకీ పెళ్లికి ముందే అవగాహన పెంచుకోవాల్సిన ఆ అంశాలేంటో తెలుసుకుందాం రండి..

ఇకపై వాటి బాధ్యత మీదే!

ఏదైనా ప్రత్యేక సందర్భంలో నచ్చిన దుస్తులు వేసుకోవడం, నగలు పెట్టుకోవడం, పని పూర్తయ్యాక వాటిని ఎక్కడివక్కడ వదిలేయడం.. చాలామంది అమ్మాయిలకు అలవాటే! ఎందుకంటే.. అవన్నీ అమ్మ పొందిగ్గా సర్దుతుందన్న భరోసా! కానీ పెళ్లై అత్తారింటికి వెళ్లాక ఇలాంటి పనులన్నీ మీకు మీరుగా చేసుకోవాల్సిందే! అందుకే వీటిని ముందు నుంచే అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈక్రమంలో పెళ్లి కోసం కొన్న పట్టు చీరలు, ఇతర దుస్తుల్ని అల్మరాలో భద్రంగా దాచుకోవడం ఎలాగో తెలిసుండాలి. ఒకవేళ తెలియకపోయినా ఈ విషయాల్లో అమ్మ సలహా తీసుకోవచ్చు. అలాగని వాటిని ఏళ్ల తరబడి అల్మరాకే పరిమితం చేస్తే అవి డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది.. కాబట్టి పట్టుబట్టలైతే నెలకోసారి బయటికి తీసి మడతలు మార్చడం, వాటిని కాటన్‌/మస్లిన్/టర్కీ టవల్‌.. వంటి వాటిలో మడిచిపెట్టడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే పెళ్లి పట్టు చీరల్ని కూడా పలు మార్పులు చేర్పులు చేసుకొని వివిధ సందర్భాల్లో తిరిగి సరికొత్తగా ధరించచ్చు.

లాకర్‌ తీసుకున్నారా?

పెళ్లిలో నగలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇటు పుట్టింటి వారు, అటు అత్తింటి వారు పెట్టే ఆభరణాలతో పాటు బంధువుల దగ్గర్నుంచి కూడా వధువుకు కట్న కానుకలు అందుతాయి. అయితే వాటన్నింటినీ భద్రంగా దాచుకోవడం అన్నింటికంటే ముఖ్యమైన అంశం. అందుకోసం లాకర్‌ సదుపాయమే మేలంటున్నారు నిపుణులు. ఈక్రమంలో పెళ్లికి ముందే వ్యక్తిగతంగా మీరే ఓ లాకర్ తీసుకోవడం మంచిది.

ప్లాన్ చేసుకోవాల్సిందే!

‘నీది-నాది’ అన్న స్వార్థపూరిత ధోరణి ఈ కాలపు దంపతుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పెళ్లైన కొత్తలో అయితే మరీనూ! ఇందుకు కారణం.. ఆర్థిక స్థిరత్వం! నిజానికి ఒకరిపై ఒకరు ఆధారకపోవడం వరకు ఇది బాగానే ఉన్నా.. తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం ఇద్దరి మధ్య ఎన్నో గొడవలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే పెళ్లి తర్వాత ఇరువురి సంపాదనతో ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి? భవిష్యత్‌ లక్ష్యాలేంటి?.. వంటివన్నీ ముందే మాట్లాడుకొని ఓ నిర్ణయానికొస్తే.. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య స్వార్థమన్న మాటే తలెత్తదు. ఫలితంగా గొడవలూ జరగవు. వివాహ బంధం శాశ్వతమవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి..?

పరీక్షలు చేయించుకున్నారా?

పీసీఓఎస్‌, థైరాయిడ్‌.. వంటి దీర్ఘకాలిక సమస్యల వల్ల పెళ్లికి ముందు పెద్దగా ఇబ్బందులేవీ ఎదురుకాకపోవచ్చు.. అందుకే వాటిని చాలామంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ పెళ్లి తర్వాత ఇవి సంతానలేమికే ఆటంకంగా మారచ్చు. అందుకే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలను ముందు నుంచే అదుపులో పెట్టుకోవడం, నిర్ణీత వ్యవధుల్లో సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. వీటితో పాటు సుఖ వ్యాధులేమైనా ఉన్నాయా?, ప్రత్యుత్పత్తి-జన్యుపరమైన లోపాలున్నాయా?.. అని అనుమానించి పరీక్ష చేయించుకోవడంలోనూ తప్పు లేదంటున్నారు. తద్వారా పెళ్లయ్యాక ఇబ్బందులు పడకుండా ఉండచ్చు.. సంతానం విషయంలో ఆటంకం కలగకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్