Deepika Padukone: అప్పుడు అందం గురించి పట్టించుకోలేదు..!

ఇరవైల్లో సౌందర్యపరంగా పలు సమస్యల్ని ఎదుర్కొన్న దీపికా పదుకొణె.. ఆపై అందం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించానంటోంది. ప్రతి ఒక్కరికీ స్వీయ సంరక్షణ అవసరమని, ఇదే మనకు సానుకూలంగా ముందుకు సాగే శక్తినిస్తుందంటోన్న దీప్స్‌ పంచుకున్న ఆ సెల్ఫ్‌ కేర్‌ టిప్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

Published : 25 Jul 2023 12:41 IST

(Photos: Instagram)

చదువు.. కెరీర్.. ఈ బిజీలో పడిపోయి ఒక్కోసారి మనకు సంబంధించిన చాలా విషయాల్లో శ్రద్ధ పెట్టం. ఈ నిర్లక్ష్యమే పలు సమస్యలకు దారితీస్తుంది. అయితే కొంతమంది వీటిని గుర్తించి బయటపడే క్రమంలో.. ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటారు. ఇరవైల్లో తానూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకొణె. ఆ సమయంలో సౌందర్యపరంగా పలు సమస్యల్ని ఎదుర్కొన్న ఆమె.. ఆపై అందం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించానంటోంది. ‘అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం’ సందర్భంగా ఆ అనుభవాల్ని ఓసారి నెమరువేసుకుంది దీపిక. ప్రతి ఒక్కరికీ స్వీయ సంరక్షణ అవసరమని, ఇదే మనకు సానుకూలంగా ముందుకు సాగే శక్తినిస్తుందంటోన్న దీప్స్‌ పంచుకున్న ఆ సెల్ఫ్‌ కేర్‌ టిప్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

నటిగా, నిర్మాతగానే కాదు.. వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది దీపిక. ‘82°E’ అనే బ్యూటీ బ్రాండ్‌ సహ వ్యవస్థాపకురాలైన ఆమె.. ఈ వేదికగా ఆయా చర్మతత్వాలకు అనుగుణంగా సహజసిద్ధమైన సౌందర్యోత్పత్తుల్ని అమ్మాయిలకు చేరువ చేస్తోంది. స్వీయ సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ అందానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం ముఖ్యమంటోన్న దీప్స్.. తన సెల్ఫ్‌ కేర్‌ అనుభవాలను ఇలా గుదిగుచ్చింది.

అప్పుడు అందాన్ని నిర్లక్ష్యం చేశా!

‘సెల్ఫ్‌ కేర్‌ అంటే నా దృష్టిలో.. నాకు శక్తినిచ్చి.. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపే పనులు చేయడం. అది ఈత కావచ్చు, ప్రశాంతంగా ఇంటి పనులు చేసుకోవడం లేదంటే స్నేహితులతో గడపడం.. ఇలా నచ్చిన పనుల్లో ప్రశాంతతను వెతుక్కుంటూ.. నాకోసం నేను తగిన సమయం కేటాయించుకుంటా. అయితే గడిచిన ఇన్నేళ్లలో ఒక విషయంలో మాత్రం చాలా పాఠాలు నేర్చుకున్నా. చాలామందికి తెలిసో, తెలియదో.. నా 16 ఏళ్ల వయసులో నేను ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ని. సాధారణంగా ఇది ఇండోర్‌ గేమ్‌. కానీ శిక్షణలో భాగంగా.. చాలాసార్లు ఆరుబయట ఎండలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సాధన చేసేదాన్ని. దీనివల్ల నా చర్మంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయం గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. గేమ్‌ పూర్తయ్యాక అలా పైపైన ముఖం శుభ్రం చేసుకునేదాన్ని. ఫేస్‌వాష్‌, సన్‌స్క్రీన్ వాడేదాన్ని కాదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నీళ్లు తాగేదాన్ని. ఏళ్లు గడిచే కొద్దీ ఈ నిర్లక్ష్యం నా చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఇరవైల్లోనే చర్మంపై ముడతలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌.. వంటివి కనిపించడం మొదలైంది. అదే సమయంలో నేను సినిమాల్లొకొచ్చా. చర్మ ఆరోగ్యం విషయంలో నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానో అప్పుడు నాకు అర్థమైంది. చర్మ సంరక్షణ అంటే నీటితో అలా పైపైన ముఖం కడుక్కోవడం కాదని తెలుసుకున్నా. ఇక అప్పట్నుంచి అందంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించా. నిపుణుల సలహా మేరకు చక్కటి చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడడం మొదలుపెట్టా..’ అంటూ తన గత అనుభవాలు పంచుకుంది దీప్స్.

అమ్మ చిట్కాలతో..!

తన అందానికి సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులే కాదు.. తన తల్లి ఉజ్జలా పదుకొణె సలహా మేరకు కొన్ని ఇంటి చిట్కాల్నీ తన బ్యూటీ రొటీన్‌లో చేర్చుకున్నానంటోందీ ముద్దుగుమ్మ.

‘అమ్మాయిలు పెరిగి పెద్దయ్యే క్రమంలో చాలా విషయాల్లో తమ తల్లుల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఈ విషయానికొస్తే నేను మా అమ్మ సౌందర్య చిట్కాల్ని ఒంట బట్టించుకున్నా. తన స్కిన్‌ కేర్‌ రొటీన్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది. తక్కువ ఉత్పత్తులు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తనకు అలవాటు. చిన్నప్పట్నుంచి నేనూ ఇదే చేస్తున్నా. చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, చర్మానికి తేమనందించడం, సన్‌స్క్రీన్‌తో చర్మాన్ని రక్షించుకోవడం.. నా బ్యూటీ రొటీన్‌ ప్రధానంగా ఈ మూడింటి పైనే ఆధారపడి ఉంటుంది. నేను ప్రారంభించిన ‘82°E’ బ్యూటీ బ్రాండ్‌ ముఖ్యోద్దేశం కూడా ఇదే! తక్కువ వాడుతూ ఎక్కువ ఫలితాన్ని పొందడం.. ఇక షూటింగ్స్‌ లేనప్పుడు మేకప్‌కు పూర్తి దూరంగా ఉంటా.. అలాగే ఇంటికొచ్చేసరికి ఎంత ఆలస్యమైనా రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మేకప్‌ తొలగించుకుంటా. అంతేకాదు.. నాకు ఆయిల్‌ మసాజ్‌ అంటే చాలా ఇష్టం. ఇదీ అమ్మ నుంచే నేర్చుకున్నా. తరచూ జుట్టును నూనెతో మర్దన చేసుకుంటే.. ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఇప్పటికీ అప్పుడప్పుడూ అమ్మతోనే ఆయిల్‌ మసాజ్‌ చేయించుకుంటా..’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని