Updated : 30/07/2021 17:49 IST

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

బడిలో చేరే వయసులోనే పిల్లలు దేశాలు-రాజధానుల పేర్లు గుక్కతిప్పుకోకుండా చెప్పడం చూసి ఆశ్చర్యపోతుంటాం..

పదేళ్లైనా నిండని చిన్నారులు కరెన్సీ నోటు ఫొటో చూపిస్తే అది ఏ దేశానిదో చెప్పడం చూసి వారి జ్ఞాపకశక్తికి ఫిదా అయిపోతుంటాం..

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

జనరల్‌ నాలెడ్జ్‌.. చదివిన కొద్దీ చదవాల్సింది ఇంకా ఉందన్నంత అతిపెద్ద సబ్జెక్ట్‌ ఇది! సాధారణంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో జీకే చదవాలంటే మనకే విసుగొస్తుంటుంది. అలాంటిది చిన్నారులు దీన్ని ఒంటబట్టించుకోగలరా? అని సందేహిస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు. అయితే ఈకాలం పిల్లల్లో ఐక్యూ స్థాయులు మెరుగ్గా ఉన్నాయని, కాస్త ప్రోత్సహిస్తే.. చిన్న వయసులోనే వారు ఈ సబ్జెక్ట్‌లో ఆరితేరే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా చిన్నతనం నుంచే జీకేలో నిష్ణాతులైతే పెద్దయ్యాక వారు ఎలాంటి పరీక్షలోనైనా రాణించగలరని చెబుతున్నారు.

చర్చ జరగాలి!

చదివి బట్టీ కొట్టే బదులు.. చర్చించుకొని ఒంటబట్టించుకోవడం మంచిది కదా అంటుంటారు. నిజమే మరి.. మనం ఒంటరిగా కూర్చొని చదవడం కంటే చుట్టూ ఉన్న వాళ్లతో ఆ సబ్జెక్ట్‌ గురించి చర్చిస్తే ఆ విషయాలన్నీ మన మనసులో నాటుకుపోతాయి. పిల్లలతో జనరల్‌ నాలెడ్జ్‌ చదివించే క్రమంలోనూ తల్లిదండ్రులు ఇదే పద్ధతిని ఫాలో కావచ్చంటున్నారు నిపుణులు. రోజుకో టాపిక్‌ చొప్పున తీసుకొని.. ముందుగా దాన్ని పిల్లలతో ఓసారి చదివించాలి. ఆ తర్వాత అందులోని ముఖ్యమైన అంశాలు, వాటి నేపథ్యం గురించి అందరూ కలిసి చర్చించాలి.. ఇలా చేస్తే పిల్లలు వాటిని మర్చిపోమన్నా మర్చిపోరు. పైగా ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తి వారిలో మొదలవుతుంది. దీంతో మరిన్ని విషయాలు వాళ్లకు వాళ్లే ఇంటర్నెట్‌ సహాయంతో తెలుసుకోగలుగుతారు. ఇక ఈ క్రమంలో వాళ్ల చిన్ని బుర్రల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసే బాధ్యత కూడా మీదే!

ఆ సినిమాలు చూపించండి!

పిల్లలకు టీవీ చూడడమంటే మహా సరదా! అందులోనూ కార్టూన్‌ ఛానల్స్‌ అంటే మరీ ఆసక్తి చూపిస్తారు. తమకు నచ్చిన కార్టూన్‌ క్యారక్టర్స్‌ చెప్పే డైలాగ్స్‌ని ఇట్టే గ్రహిస్తారు. కాబట్టి పిల్లలకు జీకే చెప్పే క్రమంలో కార్టూన్‌ ఛానల్స్‌నే ఆయుధంగా మలచుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చరిత్ర, ఇతిహాసాలకు సంబంధించి రూపొందించిన ‘అర్జున్‌ : ది వారియర్‌ ప్రిన్స్‌’, ‘సింద్‌బాద్‌ : ది సెయిలర్‌’, ‘ఘటోత్కచ్‌’, ‘దశావతార్‌’.. వంటి యానిమేషన్‌ సినిమాలు, నీతి కథలతో రూపొందించిన షోస్‌.. వంటివి పిల్లలకు చూపించచ్చు. అలాగే కార్టూన్‌ క్యారక్టర్లతో రూపొందించిన ‘స్టూడెంట్స్‌ ఎన్‌సైక్లోపీడియా జనరల్‌ నాలెడ్జ్‌’.. వంటి పుస్తకాల్ని పిల్లలకు అందించి రోజుకో కథ చొప్పున వారితో చదివించచ్చు. ఇక ఆటలకు సంబంధిన పరిజ్ఞానం వారిలో పెరగాలంటే ఆయా పోటీలు టీవీలో వచ్చినప్పుడు చూసేందుకు వారికి అనుమతివ్వాలి. అలాగే ఆయా ఆటల్లో ఉన్న నియమ నిబంధనలు, ఆడే విధానం.. వంటివన్నీ వారితో అర్థం చేయించాలి. ఇలా చేయడం వల్ల వారు విషయాన్ని మరింత ఆసక్తిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.. అలాగే ఇలా నేర్చుకున్న సబ్జెక్ట్‌ వారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కూడా!

ఆడుతూ పాడుతూ నేర్పించచ్చు!

ఈ రోజుల్లో చాలా పాఠశాలల్లో జనరల్‌ నాలెడ్జ్‌ని ప్రత్యేక సబ్జెక్ట్‌గా పెట్టి మరీ పిల్లలకు బోధిస్తున్నారు. నిజానికి ఇది మంచి పరిణామమే అని చెప్పాలి. చిన్నతనంలో నిర్లక్ష్యం చేసి పెద్దయ్యాక అంత పెద్ద సబ్జెక్ట్‌తో కుస్తీపట్టే బదులు.. ఇప్పట్నుంచే ఒక్కో అంశం/టాపిక్‌ నేర్చుకుంటే పరీక్షల సమయంలో ఇబ్బంది ఉండదు. ఇక ఎలాగూ స్కూల్లో జీకే చెబుతున్నారు కదా అని ఇంటికొచ్చాక పిల్లల్ని అలాగే వదిలేయకుండా.. ఇంట్లోనూ జీకేకు సంబంధించిన బిట్స్‌ని సరదాగా వారితో ప్రాక్టీస్‌ చేయించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులు కాస్త సమయం వెచ్చించి.. ఆ రోజు నేర్చుకున్న అంశంలో నుంచి ప్రశ్నలు అడగడం, క్విజ్‌ పెట్టడం, పాఠ్యాంశంలోని పాత్రల్ని తాము అనుకరిస్తూ - పిల్లలచే అనుకరింపజేస్తూ.. ఇలా సరదాగా ఆడుతూ పాడుతూనే ఆ టాపిక్‌ పిల్లలకు నేర్పించచ్చు. తద్వారా వాళ్లకు నేర్చుకోవాలన్న ఆసక్తీ పెరుగుతుంది.. విషయ పరిజ్ఞానం కూడా అలవడుతుంది.

ఇవి దగ్గర ఉండాల్సిందే!

కళ్లతో చూసి, ఆ రూపాన్ని తమ స్వహస్తాలతో గీస్తూ పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటారు. అందుకే స్కూల్లో ప్రాజెక్ట్‌ వర్కులంటూ వాళ్లకు బోలెడంత హోంవర్క్‌ ఇస్తుంటారు టీచర్లు. అయితే పిల్లలకు జనరల్‌ నాలెడ్జ్‌ నేర్పించే క్రమంలోనూ ఆయా టాపిక్స్‌కి సంబంధించిన విజువల్‌ ప్రజెంటేషన్స్‌ వాళ్ల దగ్గర ఉండడం లేదంటే వాళ్ల చేతులతోనే వాటిని తయారుచేయించడం.. వంటివి చేయమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గ్లోబ్‌, అట్లాస్‌, దేశాలు-కరెన్సీలు, దేశాలు-రాజధానులు.. వంటి వాటికి సంబంధించిన బొమ్మలు పిల్లల వద్ద ఉండేలా చూడాలి. అలాగే ఇప్పుడు గూగుల్‌లో, యూట్యూబ్‌లో అన్ని టాపిక్స్‌కి సంబంధించిన సమాచారం ఆడియో, వీడియో రూపంలో అందుబాటులో ఉంటోంది. వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్‌ని ఫాలో అయ్యేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇలా చేస్తే జీకేపై వారికి ఆసక్తి మరింతగా పెరుగుతుంది.. మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

ఇక వీటితో పాటు వీలు చిక్కినప్పుడల్లా పిల్లల్ని మ్యూజియంలకు తీసుకెళ్లడం, వాళ్లతో కలిసి స్థానికంగా ఉండే చారిత్రక స్థలాలకు వెళ్లడం.. అక్కడి ప్రత్యేకతల్ని వివరించడం.. వంటివి చేయడం వల్ల వాళ్లలో జీకే స్కిల్స్‌ని మరింతగా పెంచచ్చు.
మరి, మీ పిల్లల్లో జనరల్‌ నాలెడ్జ్‌ నైపుణ్యాల్ని మెరుగుపరచడానికి మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి. మీరిచ్చే సలహాలు, సూచనలు ఎంతోమంది పిల్లలకు మార్గనిర్దేశనం చేయచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని