ప్రేమించే పెద్దమ్మను తిరిగి ప్రేమిద్దాం..!
‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్లు- ‘ప్రకృతికి కోపం రాకూడదు... వస్తే మాత్రం మనం ఎప్పుడంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చట అది తీర్చుకుంటుంది’..! ఈరోజుల్లో మనం చేసే పనులు ఎక్కువగా ప్రకృతి కోపానికి....
‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్లు- ‘ప్రకృతికి కోపం రాకూడదు... వస్తే మాత్రం మనం ఎప్పుడంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చట అది తీర్చుకుంటుంది’..! ఈరోజుల్లో మనం చేసే పనులు ఎక్కువగా ప్రకృతి కోపానికి గురయ్యే విధంగానే ఉంటున్నాయి. వీటిలో ప్లాస్టిక్ వినియోగం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, చెట్లు నరకడం... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఇలా చేజేతులా పర్యావరణ కాలుష్యం సృష్టించడమే కాదు.. నివారించడమూ మన చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. అందుకు కొన్ని అలవాట్లు పాటించడం ఇంటి నుంచే ప్రారంభించమంటున్నారు. ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా పర్యావరణహితం కోసం ఇంటి నుంచే మొదలుపెట్టాల్సిన ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం రండి...
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం.. ఇష్టంగా గుండెకు హత్తుకుందాం.. కన్నెర్రయితే నీరై ఓ కొంచెం.. తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం.. అన్నాడో సినీ కవి. ప్రకృతిని, భూమిని కాపాడుకుంటేనే ఎలాంటి అవాంతరాలు లేకుండా మన మనుగడ సాగుతుంది.. మన నిర్లక్ష్యంతో వాటిని నాశనం చేయాలని చూస్తే ఆ ప్రకోపానికి మనం బలవక తప్పదు.. అని ఈ పాటలోని అంతరార్థం.
మొక్కలతో ఇంట్లోనే ఆనందం!
పెరుగుతోన్న కాలుష్యాన్ని చూస్తుంటే స్వచ్ఛమైన గాలిని కూడా కొనుక్కునే పరిస్థితులొస్తాయేమో అనిపించకమానదు. కరోనా సమయంలో ఇది నిరూపితమైంది కూడా! ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి నేర్చుకొన్న పాఠాలను ఇప్పటికే చాలామంది ఒంటబట్టించుకున్నారు. ఇందులో భాగంగానే ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకునే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్ తీసుకోవడంతో పాటు మహిళలు కూడా ఇంటి బాల్కనీల్లో, కిచెన్ బాల్కనీల్లో ఇంటి అవసరాలకు ఉపయోగపడే మొక్కల్ని పెంచడం, ఇంటి లోపల పెంచుకునే మొక్కలకు ప్రాధాన్యమివ్వడం వంటివి చేస్తున్నారు. తద్వారా స్వచ్ఛమైన గాలి కోసం, పచ్చదనం కోసం ఎక్కడో ఉన్న పార్కుకు వెళ్లే ప్రయాస తప్పుతుంది. ఇప్పటికే చాలా ఇళ్లలో మొదలైన ఈ గ్రీన్ ఉద్యమం మిగతా ఇళ్లలోనూ ప్రారంభమైతే భవిష్యత్తు తరాల వారికి ఆరోగ్యాన్ని అందించినవారమవుతాం.. రాబోయే ప్రకృతి విపత్తుల్నీ తప్పించిన వారమవుతాం..!
నడిస్తే పోలా?!
ఈరోజుల్లో చాలామంది బండి లేనిదే బయటకు కదలడం లేదు. నడిచే దూరానికి కూడా స్కూటీ వేసుకెళ్తున్నారు. దాంతో వాటి నుంచి వచ్చే పొగ గాల్లో కలుస్తోంది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఇదీ ఒకటని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటును తగ్గించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. దగ్గర్లోని కిరాణా షాపుకి/కాయగూరల మార్కెట్‌కు వెళ్లాలంటే ఆడుతూ పాడుతూ వెళ్లి రావచ్చు. ఇంకాస్త దూరమైతే సైకిల్ వేసుకెళ్లచ్చు. దీనివల్ల వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. అలాగే చాలామంది మహిళలు తమకు వ్యాయామం చేయడానికి సమయమే కుదరట్లేదు అంటుంటారు. ఇలా నడక, సైక్లింగ్ వల్ల శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుంది. అలాంటప్పుడు ప్రత్యేకించి దీని కోసం సమయం కేటాయించడం ఎందుకు?!
ప్లాస్టిక్ వద్దు.. జ్యూట్ ముద్దు!
బజారుకు వెళ్లి సరుకులు/కూరగాయలు తేవాలంటే 100లో 99 శాతం మంది వాడేవి ప్లాస్టిక్ కవర్లు/సంచులే! అలాగే ప్లాస్టిక్ డబ్బాలు లేని కిచెన్ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఇలా ప్లాస్టిక్‌కి మనం బానిసలుగా మారిపోయాం. అలాగని వీటిని ఒక్కసారిగా దూరం పెట్టడమంటే కుదరకపోవచ్చు.. కానీ క్రమంగా వీటి వాడకం తగ్గించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఈ క్రమంలో సరుకుల కోసం ప్లాస్టిక్ కవర్‌కి బదులు పర్యావరణహిత జ్యూట్ బ్యాగ్/పేపర్ బ్యాగ్.. వంటి వాటికి ప్రాధాన్యమివ్వచ్చు. ఇక కిచెన్‌లో కూడా గాజు సీసాలు, స్టీల్ డబ్బాల ఉపయోగాన్ని పెంచచ్చు. ఇలా క్రమంగా ప్లాస్టిక్‌ని దూరం పెట్టుకుంటూ వెళ్తే కొన్నాళ్లకు పర్యావరణహిత వనరులతోనే సర్దుకోవడమెలాగో అలవాటైపోతుంది. ఈ అలవాటు అటు ప్రకృతికి, ఇటు మనకూ మంచి చేస్తుంది.
ప్యాడ్స్ కంటే కప్స్ మేలు!
నెలసరి సమయంలో మనం ఉపయోగించే శ్యానిటరీ న్యాప్‌కిన్లు కూడా పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అందుకే వీటికి బదులు వాతావరణానికి మేలు చేసే బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్, తిరిగి ఉపయోగించుకునే మెన్‌స్ట్రువల్ కప్స్.. వంటివి ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీటిని ఉపయోగించడం వల్ల లీకేజీ సమస్య ఉంటుందేమోనన్న అపోహతో ఇప్పటికీ చాలామంది వీటిని దూరం పెడుతున్నారు. కానీ నిజానికి బయట దొరికే ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారుచేసే శ్యానిటరీ న్యాప్‌కిన్స్ వల్లే వివిధ రకాల ప్రత్యుత్పత్తి సమస్యలు, ఇన్ఫెక్షన్లు తలెత్తుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే ప్యాడ్స్ కంటే పర్యావరణహితమైన కప్స్ ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచివంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది.
ఇవి కూడా!
⚛ తడి చెత్త కోసమైనా, పొడి చెత్త కోసమైనా ప్లాస్టిక్ బ్యాగ్స్/కవర్స్ కంటే బయోడిగ్రేడబుల్ ట్రాష్ బ్యాగ్స్‌ని ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. ఇవైతే వంద శాతం మట్టిలో కలిసిపోతాయంటున్నారు.
⚛ బయటికి వెళ్లినప్పుడు నీళ్ల సీసాలు కొని.. తాగాక చెత్తకుండీలో పడేయడం చాలామందికి అలవాటు! అదే ఇంటి నుంచే నీళ్ల బాటిల్ తీసుకెళ్లి దాన్ని తిరిగి ఉపయోగించుకుంటే ప్లాస్టిక్ వృథాకు చాలావరకు చెక్ పెట్టచ్చు.
⚛ ఇంట్లో వస్తువుల్ని శుభ్రం చేయడానికి, ఇతర అవసరాల కోసం వాడి పడేసే పేపర్ టవల్స్ కంటే తిరిగి ఉపయోగించే పాత టవల్స్, ఇతర దుస్తుల్ని ఉపయోగించడం శ్రేయస్కరం!
⚛ రసాయనాలు, పారాబెన్స్, థాలేట్స్.. వంటివి ఉపయోగించి తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులతో అటు చర్మానికి, ఇటు పర్యావరణానికి.. రెండింటికీ నష్టమే! కాబట్టి వాటికి బదులుగా వంద శాతం సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఉత్పత్తులు, ఇంట్లో తయారుచేసిన సౌందర్య సాధనాలు.. వంటివి వాడడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.