రెండుసార్లు అబార్షన్ అయినా.. ఎవరితోనూ చెప్పలేకపోయా!

అమ్మతనం, కెరీర్‌.. చాలామంది మహిళలకు ఇవి రెండూ రెండు కళ్లు. అందుకే ఒక దాని కోసం మరొకటి త్యాగం చేయడానికి ఇష్టపడరు. అలాగని ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకోవడమంటే కత్తి మీద సామే అని చెప్పాలి.

Updated : 09 Feb 2024 21:34 IST

(Photos: Instagram)

అమ్మతనం, కెరీర్‌.. చాలామంది మహిళలకు ఇవి రెండూ రెండు కళ్లు. అందుకే ఒక దాని కోసం మరొకటి త్యాగం చేయడానికి ఇష్టపడరు. అలాగని ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకోవడమంటే కత్తి మీద సామే అని చెప్పాలి. అయితే ఈ క్రమంలో ఎన్ని సమస్యలెదురైనా మౌనంగా భరిస్తారే తప్ప పని ప్రదేశంలో వాటి గురించి పంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపరు. కానీ అది సరికాదంటున్నారు ఎడెల్‌వీస్ సీఈవో రాధికా గుప్తా. ఓ వర్కింగ్‌ మదర్‌గా ఇటు పని ప్రదేశంలో, అటు సమాజం నుంచి ఎన్ని రకాల విమర్శలు ఎదురైనా.. వాటిని పట్టించుకోకుండా అటు పనిని, ఇటు ఇంటి బాధ్యతల్ని సమన్వయం చేసుకోగలిగితేనే సక్సెస్‌ సాధించగలమంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వర్కింగ్‌ మదర్‌గా తానెదుర్కొంటోన్న అనుభవాల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకున్నారామె.

మెడ వంకర కారణంగా చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు రాధిక. వాటిని తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిన ఆమె.. ఆపై రియలైజ్‌ అయ్యి తనను తాను అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ స్వీయ ప్రేమే ఆమెను అందలమెక్కించింది. ‘ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ’ సీఈవోగా బాధ్యతలప్పగించింది. ప్రస్తుతం దేశంలోనే అసెస్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఏకైక మహిళా సీఈవోగా కొనసాగుతోన్న రాధిక.. ఇటీవలే ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ సీజన్‌-3లో షార్క్‌ (న్యాయనిర్ణేత)గానూ అడుగుపెట్టారు.

ఒంటరిగానే భరించా!

అమ్మయ్యే క్రమంలో ఎన్నో మిశ్రమ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొంతమంది విషయంలో అబార్షన్‌ కావచ్చు.. మరికొంతమంది గర్భిణిగా ఉన్నప్పుడు పలు సమస్యల్ని ఎదుర్కోవచ్చు.. అయితే చాలామంది ఎవరేమనుకుంటారో, ఎటు నుంచి విమర్శలొస్తాయోనన్న భయంతో పని ప్రదేశంలో వీటి గురించి పంచుకోరు.. గతంలో తానూ ఇదే పొరపాటు చేశానంటున్నారు రాధిక.

‘గతంలో నాకు రెండుసార్లు అబార్షన్‌ అయింది. దీని గురించి నలుగురూ ఏమనుకుంటారోనన్న భయంతో, సామాజిక కారణాల వల్ల ఈ విషయం ఆఫీస్‌లో ఎవరితోనూ పంచుకోలేకపోయా. ఆఖరికి మా బాస్‌తోనూ చెప్పలేకపోయా. ఒంటరిగానే నొప్పిని, బాధను భరిస్తూ మరుసటి రోజు ఆఫీస్‌కొచ్చా. కానీ ఇది సరికాదని ఆ తర్వాత రియలైజ్ అయ్యా. మన సమస్యల్ని, బాధల్ని పనిప్రదేశంలో పంచుకున్నప్పుడే సంస్థ నుంచి మనకు కావాల్సిన మద్దతు అందుతుంది.. తద్వారా ఆయా సమస్యల నుంచి త్వరగా బయటపడచ్చు..’ అంటారామె.

ఆమే నాకు స్ఫూర్తి!

రెండుసార్లు అబార్షన్‌ తర్వాత తన 39 ఏళ్ల వయసులో రెమీ అనే కొడుక్కి జన్మనిచ్చిన రాధిక.. ఆరు వారాల్లోనే తిరిగి ఆఫీస్‌లో అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో ఇటు పని చేయాలన్న ఉత్సాహం ఉన్నా.. తల్లిగా నా బాధ్యతల్ని సమన్వయం చేసుకోగలనా అన్న సందేహం కలిగిందంటున్నారామె.

‘ఎడెల్‌వీస్‌ సీఈవోగా ఉన్న సమయంలోనే నేను గర్భం ధరించా. ఈ క్రమంలోనే మన దేశంలో గర్భిణిగా ఉన్న సీఈవోలు ఎంతమంది ఉన్నారో ఆన్‌లైన్‌లో వెతికితే ఒక్కరూ కనిపించలేదు. చాలామంది అంతకంటే ముందే పిల్లల్ని కనేశారు. కానీ యాహూ మాజీ సీఈవో మారిస్సా మేయర్‌ తనీ పదవిలో ఉన్నప్పుడే ఇద్దరు కవల అమ్మాయిలకు జన్మనిచ్చినట్లు ఆమె కథ చదివా. ఎంతో స్ఫూర్తిగా అనిపించింది. ‘అటు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఇటు అమ్మగా పిల్లల ఆలనా పాలన చూసుకోవడం ఆమెకు సాధ్యమైందంటే అది నాకూ సాధ్యమే!’ అనిపించింది. ఇలా ఆమె స్ఫూర్తితోనే నా కొడుకు రెమీ పుట్టిన ఆరు వారాలకే తిరిగి ఆఫీస్‌లో అడుగుపెట్టా. అయితే మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా, పనిచేయాలన్న ఉత్సాహం ఉన్నా.. ప్రసవానంతర ఒత్తిడి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయా. దీనికి తోడు కొత్తగా తల్లైన మహిళలు మెటర్నిటీ బ్రేక్‌ తర్వాత కొన్నాళ్లకే పనిలో చేరినా, లేదంటే సెలవుల్ని పొడిగించుకున్నా.. సమాజం నుంచి ఒత్తిడిని ఎదుర్కోక తప్పదు. నేనూ వృత్తిరీత్యా కొన్ని ఈవెంట్స్‌కి హాజరైనప్పుడు బాబును ఎవరు చూసుకుంటున్నారు? ఇప్పుడు వాడికి తల్లి అవసరం ఉంటుంది కదా! అనే వారు. అవతలి వాళ్ల అభిప్రాయం ఎలా ఉన్నా.. నా బాబు ఆలనా పాలన విషయంలో ఓ తల్లిగా సరైన న్యాయం చేయగలుగుతున్నానన్న సంతృప్తి ముందు ఈ మాటలన్నీ పటాపంచలయ్యేవి..’ అంటూ చెప్పుకొచ్చారామె. ఎవరేమనుకున్నా ఇలా తమ మనసు మాటే వినమంటూ వర్కింగ్‌ మదర్స్‌ని ప్రోత్సహిస్తున్నారు రాధిక.

ఆ అపరాధ భావన వద్దు!

చాలామంది కెరీర్‌ బిజీలో పడిపోయి పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నామనే అపరాధ భావనతో ఉంటారు. తాము ఉత్తమ తల్లి కాదనుకుంటారు. కానీ ఈ లోకంలో మంచి తల్లి, చెడ్డ తల్లి అంటూ ఎవరూ ఉండరని తన తల్లి చెప్పిన మాటలే స్ఫూర్తిగా తీసుకొని కెరీర్‌లో ముందుకు సాగుతున్నానంటున్నారు రాధిక.

‘వర్కింగ్‌ మదర్స్‌కి ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలన్స్‌ చేసుకోవడం కష్టమే! కానీ ఉన్న సమయాన్నే చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఇదీ సాధ్యమే! నేను తల్లయ్యాక మా అమ్మ నాతో ఓ మాట చెప్పింది.. ‘పేద, ధనిక, ఉన్నతంగా చదువుకున్నా, అసలు చదువుకోకపోయినా, ఉద్యోగం ఉన్నా, లేకపోయినా.. తల్లి తల్లే! అంతేకానీ.. ఈ లోకంలో మంచి తల్లి, చెడ్డ తల్లి అన్న భేదాలేవీ ఉండవు. ఏ తల్లీ తన పిల్లలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకోదు. కాబట్టి నిన్ను నువ్వు చెడ్డ తల్లిగా భావించుకోకు..’ అని! ఇలా మాటలతోనే కాదు.. చేతలతోనూ ఈ విషయం నిరూపించిందామె. నేను, తమ్ముడు పుట్టాకే తను మాస్టర్స్‌ చేసింది. అది కూడా పగలంతా మమ్మల్ని చూసుకుంటూనే.. రాత్రి పూట తరగతులకు హాజరయ్యేది. ఇలా అమ్మ మాటలు, చేతల్ని స్ఫూర్తిగా తీసుకొనే నేనూ అటు నా కొడుకు బాధ్యతలు చూసుకుంటూనే.. ఇటు ఆఫీస్‌ పనుల్నీ సమన్వయం చేసుకోగలుగుతున్నా..’ అంటున్నారు రాధిక. అంతేకాదు.. కెరీర్‌ ధ్యాసలో పడిపోయి అమ్మతనాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. ముందుగానే ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిలో అండాల్ని నిల్వ చేసుకోమని, తద్వారా కావాల్సినప్పుడు ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వచ్చంటూ నేటి మహిళలకు సలహా ఇస్తున్నారీ బిజినెస్‌ లేడీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్