అందుకే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి!

మనకు తెలియకుండా చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో కణవ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ వస్తే ఇక అంతేనని.. దీనికి మందు లేదని.. చాలామంది భయపడుతుంటారు.

Published : 05 Feb 2024 12:43 IST

మనకు తెలియకుండా చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో కణవ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ వస్తే ఇక అంతేనని.. దీనికి మందు లేదని.. చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్‌ని ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానంతో దానిని నయం చేయవచ్చంటున్నారు వైద్యులు. ఇందుకోసం ముందు నుంచీ కొన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం' సందర్భంగా మహిళల్లో వచ్చే పలు క్యాన్సర్లు, వాటి నిర్ధరణ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే. అయినా మనదాకా వచ్చినప్పుడు చూడచ్చులే.. అని చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రారంభ దశల్లోనే గుర్తిస్తే తప్ప క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించడం సాధ్యం కాదు. వంశపారంపర్యంగానే కాకుండా, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే విష వాయువులు పీల్చడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అందుకే సంవత్సరానికోసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

ఎలా ఏర్పడుతుందంటే..

సాధారణంగా శరీరం అనేక కణాల సముదాయాలతో నిర్మితమవుతుంది. ఈ కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ కణ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. కానీ కొన్నిసార్లు ఈ క్రమబద్ధీకరణ అదుపు తప్పుతుంది. తద్వారా శరీరానికి అవసరం లేకపోయినా కొత్త కణాలు ఏర్పడతాయి. అలా అధికంగా ఏర్పడిన కణాల సముదాయం ఒక గడ్డలాగా ఏర్పడుతుంది. దీన్నే క్యాన్సర్ గడ్డ అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇలా ఏర్పడిన గడ్డలన్నీ అపాయకరమైనవి కావు. కాబట్టి ఇవి ప్రమాదకరమైనవా? కాదా? అని గుర్తించడానికి కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.


క్యాన్సర్లు.. చేయించుకోవాల్సిన పరీక్షలు..

రొమ్ము క్యాన్సర్..

స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో అతి ముఖ్యమైంది రొమ్ము క్యాన్సర్. రొమ్ములో గడ్డల్లాంటివి తగలడం, రొమ్ముల పరిమాణంలో తేడా, ఎర్రగా, కందినట్లుగా ఉండే చనుమొనలు, చనుమొనల నుంచి స్రావాలు వెలువడడం, రొమ్ములు సొట్టలు పడినట్లు ఉండడం, చంకలో వాపు.. వంటి పలు లక్షణాల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. కాబట్టి మహిళలంతా ఈ వ్యాధిని గుర్తించడానికి అవసరమయ్యే పరీక్షలను నిర్ణీత కాల వ్యవధిలోనే చేయించుకోవాల్సి ఉంటుంది.

⚛ నలభై సంవత్సరాలు దాటిన మహిళలు సంవత్సరానికోసారైనా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.

⚛ ఇరవై ఏళ్లు దాటిన మహిళలు ప్రతి మూడు సంవత్సరాలకోసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్ (సీబీఈ) చేయించుకోవడం తప్పనిసరి.

⚛ అలాగే ఇరవై ఏళ్లు దాటిన అమ్మాయిలు ఎప్పటికప్పుడు వారే స్వయంగా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ (బీఎస్ఈ) చేసుకోవడం ముఖ్యం.

సర్వైకల్ క్యాన్సర్..

స్త్రీలలో మాత్రమే వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. గర్భాశయ ముఖద్వారానికి వచ్చే ఈ క్యాన్సర్ 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి పాప్‌స్మియర్ టెస్ట్ చేస్తారు. ఇందులో భాగంగా.. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలు సేకరించి పరీక్షిస్తారు. అలాగే పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను నిర్ధ్ధరించవచ్చు. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లయితే అది ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి ఎక్స్‌రే తీయించడంతో పాటు అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటివి చేయాల్సి ఉంటుంది.

గర్భాశయ క్యాన్సర్..

హార్మోన్ల స్థాయుల్లో కలిగే మార్పుల వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. నెలసరి క్రమం తప్పడం, గర్భం ధరించకపోవడం, ఎక్కువ కొవ్వులుండే ఆహారం తినడం వల్ల స్థూలకాయం బారిన పడడం, ఈస్ట్రోజెన్ థెరపీ చేయించుకోవడం.. వంటి పలు అంశాలు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలవుతాయి. దీన్ని గుర్తించడానికి ముఖ్యంగా పాప్ టెస్ట్ చేస్తారు. ఇందులో భాగంగా.. మహిళల సర్విక్స్, వెజైనా నుంచి కొన్ని కణాల్ని తీసుకుని పరీక్షిస్తారు. అలాగే ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను నిర్ధరించవచ్చు.

కొలొరెక్టల్ క్యాన్సర్..

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో కొలొరెక్టల్ క్యాన్సర్ కూడా ఒకటి. 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వూబకాయం, టైప్-2 డయాబెటిస్, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద తయారు చేసిన మాంసాహారం తినడం.. వంటి పలు అంశాలు ఈ క్యాన్సర్ వచ్చేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి కొన్ని రకాల టెస్టులు తరచూ చేయించుకోవడం మంచిది. ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ లేదా ఫీకల్ ఇమ్యునోకెమికల్ టెస్ట్ లేదా స్టూల్ డీఎన్ఏ టెస్ట్.. వంటివి యాభై ఏళ్లు దాటిన వారు సంవత్సరానికోసారి చేయించుకోవడం తప్పనిసరి. ఒకవేళ ఈ టెస్టు పాజిటివ్ వస్తే కొలొనోస్కోపీ చేయించుకోవాలి. తద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.

అండాశయ క్యాన్సర్..

మెనోపాజ్ దశలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ; ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) వంటి పునరుత్పత్తి చికిత్సలు.. మొదలైన వాటి వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్లడం, పెల్విక్ పెయిన్.. వంటి లక్షణాలను బట్టి ఈ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. వీటితో పాటు సీఏ-125 టెస్టు, ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్, సీరమ్ సీఏ-125 ఇన్ కాంబినేషన్ విత్ ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్.. వంటి టెస్టుల ద్వారా ఒవేరియన్ క్యాన్సర్‌ను నిర్ధరించవచ్చు.

చర్మ క్యాన్సర్..

చర్మంపై ఉండే పుట్టు మచ్చల ద్వారా చర్మ క్యాన్సర్‌ను నిర్ధరిస్తారు. ఇందులో భాగంగా.. పుట్టు మచ్చలన్నీ ఒకే పరిమాణంలో, ఆకృతిలో లేకపోవడం, పుట్టు మచ్చ రంగు.. వంటి పలు అంశాల ఆధారంగా చర్మ క్యాన్సర్‌ను నిర్ధ్ధరిస్తారు. కాబట్టి చర్మంపై పుట్టు మచ్చలు ఒకవేళ అసాధారణ రీతిలో పెరుగుతూ ఉన్నట్లయితే తరచూ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్