బాబుకి నెబ్యులైజర్ వాడడం మంచిదేనా?

మా బాబు వయసు 13 నెలలు. రెండు నెలలుగా జలుబుతో ఇబ్బంది పడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్ప పూర్తిగా తగ్గట్లేదు. అయితే నెబ్యులైజర్‌ వాడమని తెలిసిన వాళ్లు సలహా ఇస్తున్నారు. మరి, నెబ్యులైజర్‌ వాడడం మంచిదేనా? సలహా ఇవ్వగలరు

Published : 05 Jan 2024 12:23 IST

మా బాబు వయసు 13 నెలలు. రెండు నెలలుగా జలుబుతో ఇబ్బంది పడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్ప పూర్తిగా తగ్గట్లేదు. అయితే నెబ్యులైజర్‌ వాడమని తెలిసిన వాళ్లు సలహా ఇస్తున్నారు. మరి, నెబ్యులైజర్‌ వాడడం మంచిదేనా? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ బాబు వయసు 13 నెలలని చెబుతున్నారు. సాధారణంగా ఈ వయసులో పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాల ఆట వస్తువులను తాకుతుంటారు. వీటి నుంచి సోకే క్రిముల కారణంగా జలుబు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాతావరణంలో వచ్చే మార్పులు, కొత్తగా ఏదైనా ఆహార పదార్థాన్ని అలవాటు చేసినప్పుడు కూడా జలుబు చేయడం సహజం.

‘రెండు నెలలుగా జలుబు ఉంది. కానీ, సాధారణంగా ఆడుకుంటున్నాడు. ఎదుగుదలలో ఎలాంటి సమస్యా లేదు’ అంటే అది అలర్జీ వల్ల వచ్చిన జలుబుగా భావించాలి. ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల జలుబు వచ్చినప్పుడు జ్వరం రావడం, సరిగ్గా నిద్రపోకపోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మొదటి రకం జలుబుకి అలర్జీకి సంబంధించిన మందులు వాడితే సరిపోతుంది.

ఏదైనా ఇన్ఫెక్షన్‌ వల్ల జలుబు వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో తెమడ చేరుతుంది. ఇలాంటప్పుడు శ్వాస తీసుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల వాంతులు చేసుకోవడం, నిద్రపట్టకపోవడం, ఆయాసపడడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఎక్కువసేపు ఏడుస్తుంటారు కూడా. ఇలాంటప్పుడు మాత్రం నెబ్యులైజర్‌ వాడాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ముక్కు దిబ్బడ తగ్గుతుందని, జలుబు నుంచి వేగంగా ఉపశమనం పొందచ్చని సొంతంగానే నెబ్యులైజర్‌ వాడుతుంటారు. కానీ అది సరికాదు. డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే నెబ్యులైజర్‌ని ఉపయోగించాలి. ఒకవేళ బాబుకి తరచుగా అలర్జీ సమస్య ఉంటే అత్యవసర సమయంలో నెబ్యులైజర్‌ వాడచ్చు. అయితే ప్రతిసారీ జలుబుకి నెబ్యులైజర్‌ ప్రత్యామ్నాయ చికిత్స కాదన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్