ఉద్యోగంలో అసంతృప్తా? ఇలా చేయండి!

ఉద్యోగం ఆర్థిక భరోసాను అందించడమే కాదు.. సమాజంలో మనకు ఒక హోదానూ తెచ్చిపెడుతుంది. ఇలాంటి వృత్తి జీవితాన్ని ఎంతగా ఆస్వాదిస్తే.. కెరీర్‌లో అంతగా ఎదగగలుగుతాం.

Published : 06 Nov 2023 17:08 IST

ఉద్యోగం ఆర్థిక భరోసాను అందించడమే కాదు.. సమాజంలో మనకు ఒక హోదానూ తెచ్చిపెడుతుంది. ఇలాంటి వృత్తి జీవితాన్ని ఎంతగా ఆస్వాదిస్తే.. కెరీర్‌లో అంతగా ఎదగగలుగుతాం. అయితే కొంతమంది మాత్రం తాము చేసే ఉద్యోగం విషయంలో అసంతృప్తికి లోనవుతుంటారు. భారంగా కెరీర్‌ను లాక్కొస్తుంటారు. కరోనా తర్వాత ఉద్యోగుల్లో ఈ ధోరణి మరింత పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రతి పది మందిలో ఆరుగురు నామమాత్రంగా తమ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారట! నిజానికి దీనివల్ల కెరీర్‌లో ఉన్నతి సాధించకపోగా.. అప్పటి వరకు గడించిన ఉద్యోగానుభవంపైనా రిమార్క్‌ పడే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ అసంతృప్తికి కారణమేంటో తెలుసుకొని.. వాటిని దూరం చేసుకోమంటున్నారు.

అసలెందుకిలా?!

ఇంట్లో ఎంత సమయం గడుపుతామో.. ఆఫీస్‌లోనూ దాదాపు అంతే సమయం గడుపుతుంటాం. అలాంటప్పుడు ఇంట్లో మాదిరిగానే ఆఫీస్‌లోనూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి.. చేస్తున్న పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. కానీ కరోనా తర్వాత చాలామంది ఉద్యోగుల్లో ఈ శ్రద్ధ, అలర్ట్‌నెస్‌ తగ్గాయంటున్నాయి పలు అధ్యయనాలు. ఫలితంగా ప్రతి పది మందిలో ఆరుగురు అసంతృప్తితోనే ఉద్యోగ జీవితాన్ని నెట్టుకొస్తున్నారని చెబుతున్నాయి. అయితే ఇందుకు పలు కారణాలున్నాయంటున్నారు నిపుణులు.

కరోనా సమయంలో చాలామంది ఉద్యోగులకు ఉద్యోగ భద్రతే సవాలుగా మారింది. అయితే క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్నా.. కొంతమందిలో ఆ భయం దూరం కాలేదు. అలాంటి వాళ్లు భవిష్యత్తులో తమ ఉద్యోగానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని భయపడుతున్నారు. ఉద్యోగంలో అసంతృప్తికి ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు.

కొంతమంది ఎంత పనిచేస్తున్నా.. దానికి తగ్గ ప్రతిఫలం దక్కదు. ఫలితంగా ‘ఎంత చేసినా వృథానే’ అన్న భావన వారి మనసులో మొదలవుతుంది. ఇదీ ఉద్యోగంపై ఆసక్తి తగ్గడానికి, కెరీర్‌ అసంతృప్తితో ముందుకు సాగడానికి కారణమవుతుంది.

కొవిడ్‌, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభ ఒత్తిళ్లతో కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. ఫలితంగా ఉన్న ఉద్యోగులపైనే అదనపు పనిభారం పడింది. అయితే రోజులు గడుస్తున్నా కొన్ని సంస్థల్లో అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలా పని ఒత్తిడితోనూ ఉద్యోగులు అసంతృప్తికి గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌.. వంటి సాంకేతికలు ఆయా సంస్థలకు వరంగా మారినప్పటికీ.. వీటివల్ల ఉద్యోగ భద్రత కొరవడుతుందనే మాట వాస్తవం. ఈ క్రమంలో తమ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనన్న భయం కూడా కొంతమందిలో నెలకొంది. ఇదీ ఉద్యోగ అసంతృప్తికి, ఒత్తిడికి కారణమవుతుందంటున్నారు నిపుణులు.

కొంతమంది ఉద్యోగుల విషయంలో తమ పైఅధికారుల నుంచి పూర్తి మద్దతు, ఆశించిన ప్రోత్సాహం లభించదు. ఇది కూడా ఉద్యోగంలో అసంతృప్తికి కారణమవుతుంటుంది.

ఉద్యోగం చేసే మహిళలకు వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ ముఖ్యం. ఈ రెండింటినీ సమతులం చేసుకున్నప్పుడే అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు కెరీర్‌నూ ఆస్వాదించగలం. కానీ కొంతమంది మహిళలు పలు కారణాల రీత్యా దీన్ని బ్యాలన్స్‌ చేసుకోలేకపోతున్నారని, ఇది వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో సంతృప్తి లేకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆఫీస్‌ వాతావరణమే కాదు.. సహోద్యోగులతో సత్సంబంధాలు లేకపోవడం వల్ల కూడా కొంతమంది తమ ఉద్యోగంలో సంతృప్తిని పొందలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీళ్లు ఎవరితో కలవకపోవడం, వీళ్ల పనేదో వీళ్లు చేసుకుపోయినా.. ఇతర ఉద్యోగులు ఓర్వలేక లేనిపోనివి ప్రచారం చేయడం.. వంటివి ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు.

ఇలా చేసి చూడండి!

కారణమేదైనా ఉద్యోగంలో అసంతృప్తి దరిచేరితే అది కెరీర్‌కే ప్రమాదం అంటున్నారు నిపుణులు. అందుకే ఈ అసంతృప్తిని వీలైనంత త్వరగా దూరం చేసుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో కొన్ని చిట్కాలు పాటించడం మేలంటున్నారు.

ఉద్యోగంలో అసంతృప్తిని దూరం చేసుకోవాలంటే పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ మనసుకు ప్రశాంతతనిచ్చే మొక్కల్ని, వస్తువుల్ని ఏర్పాటుచేసుకోవడం.. పనికి తగినట్లుగా అనువైన ప్రణాళిక వేసుకోవడం, మిమ్మల్ని ప్రోత్సహించే సహోద్యోగులతో చెలిమి చేయడం.. ఇవన్నీ దోహదం చేస్తాయి.

పనిలో ఎలాంటి లక్ష్యాలు లేకుండా ముందుకు సాగడం వల్ల కూడా ఒక దశలో అసంతృప్తికి లోనవుతుంటాం. అందుకే ఉత్సాహంగా పనిచేసుకోవాలంటే ముందు లక్ష్యాలను ఏర్పరచుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. కాబట్టి మీకు నిర్దేశించిన పనుల్ని బట్టి స్వల్ప కాల, దీర్ఘకాలిక లక్ష్యాల్ని పెట్టుకోవడం వల్ల.. సకాలంలో వాటిని చేరుకోవాలన్న ఏకాగ్రతను పెంచుతుంది. ఇది కెరీర్‌లో అసంతృప్తిని దూరం చేస్తుంది.

విరామం లేకుండా పనిచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.. చేసే పనిపై ఆసక్తీ తగ్గుతుంది. కాబట్టి మధ్యమధ్యలో విరామం తీసుకోవడం.. చిన్న చిన్న డెస్క్‌ వర్కవుట్లు చేయడం వల్ల తిరిగి పునరుత్తేజితం కావచ్చు. అలాగే అప్పుడప్పుడూ ఓ వారం పాటు పని నుంచి విరామం తీసుకొని కుటుంబంతో కలిసి వెకేషన్లూ ప్లాన్‌ చేసుకోవచ్చు. తిరిగొచ్చాక పనిపై పూర్తి దృష్టి పెట్టచ్చు.

‘ఈ పని సంస్థది.. నేను కేవలం ఉద్యోగిని మాత్రమే!’ అన్న పరోక్ష భావన ఉంటే పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. కాబట్టి చేసే పనిని మన సొంతం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే ఆసక్తితో పనిచేస్తూ.. చక్కటి ఉత్పాదకతనూ సంస్థకు అందించచ్చంటున్నారు.

ఉద్యోగ భద్రతకు సంబంధించిన భయాల్ని, అసంతృప్తుల్ని దూరం చేసుకోవాలంటే.. మారుతోన్న సాంకేతికతల్ని బట్టి కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవడం అత్యుత్తమమైన మార్గం అంటున్నారు నిపుణులు. ఇది కొత్త అవకాశాల్నీ అందించడంతో పాటు కెరీర్‌ అభివృద్ధికీ దోహదం చేస్తుందంటున్నారు.

పనిలో ఒత్తిడి ఉన్నా, సహోద్యోగుల నుంచి సమస్యలున్నా.. పైఅధికారులకు తెలియజేసి వారి సహకారం తీసుకోవడం వల్ల.. ఉద్యోగ భద్రతను, సంతృప్తిని.. రెండింటినీ సొంతం చేసుకోవచ్చు.

ఇంటిని పనిని సమన్వయం చేసుకోవడం కష్టమే! కానీ ఇటు ఇంట్లో కొన్ని పనుల్లో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం, అటు ఆఫీస్‌లో కొలీగ్స్‌ మద్దతు కోరడం వల్ల ఇది సులువవుతుందంటున్నారు నిపుణులు.

‘ఎంత పనిచేసినా ఫలితం శూన్యం’ అనుకునే బదులు.. మీ పనితీరు, సంస్థ అభివృద్ధిలో మీరు పోషించిన పాత్ర గురించి పైఅధికారులకు తెలియజేయండి.. వాటికి సంబంధించి మీరు పొందుపరిచిన నివేదికల్ని వారికి చూపించండి.. మీ కష్టాన్ని వారు తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు.. తద్వారా మీ కెరీర్‌ అసంతృప్తి దూరమవుతుంది.

అయితే ఇన్ని చేసినా ఫలితం లేకపోతే.. మీలో అసంతృప్తి అలాగే ఉంటే ఓసారి నిపుణుల్ని సంప్రదించడం మంచిది.. తద్వారా మీకున్న సమస్యల్ని బట్టి మీరు ఉద్యోగం మారాలా? లేదంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలేవైనా అనుసరించాలా అనేది వాళ్లు మీకు సలహా ఇస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్