క్యాన్సర్ ముప్పును తగ్గించే ఆహారం!

మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్‌స్త్టెల్‌లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి.

Published : 06 Feb 2024 12:47 IST

మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్‌స్త్టెల్‌లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో- కేవలం చక్కటి జీవనశైలిని పాటించడమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బ్రకలీ

ప్రొస్టేట్, పెద్దపేగు, మూత్రాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో ఇది సాయపడుతుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫాన్ శరీరంలోని రక్షణాత్మక ఎంజైమ్‌లను ప్రేరేపించి విషతుల్య మలినాలను తొలగిస్తుంది.

నారింజ

నారింజలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. అంతేగాక చెడు కొలెస్ట్రాల్, బరువును తగ్గిస్తుంది. చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.

గ్రీన్ టీ

ఇది యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. అన్నవాహిక, వూపిరితిత్తులు, నోటి, పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. ఇందులోని పాలీఫినాల్స్ కొత్త కణాలను భర్తీ చేస్తాయి.

అల్లం

ఇది క్యాన్సర్ కణాలను తమంత తాముగా నశించేటట్లు చేస్తుంది. అండాశయ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేగాక ఈ కణాలు విస్తరించే శక్తిని కూడా అడ్డుకుంటుంది.

వెల్లుల్లి

ఇందులో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తుంది. రొమ్ము, పెద్ద పేగు, పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌లను నిరోధిస్తుంది.

యాపిల్

రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదని అంటుంటారు. క్యాన్సర్ విషయంలో కూడా ఇది నిజమే. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల నివారణలో యాపిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

సాల్మన్ చేపలు

సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేగాక వివిధ విటమిన్‌లు, ప్రొటీన్లు, సెలీనియం దీని నుండి లభ్యమవుతాయి. ఇవన్నీ కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయి. గుండెపోటును కూడా అడ్డుకుంటాయి.

కాయధాన్యాలు

బీన్స్, చిక్కుడు మొదలైన కాయధాన్యాలు రొమ్ము క్యాన్సర్‌ను బాగా అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ను నిరోధించే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. రక్తంలోని షుగర్ స్థాయులను ఇవి క్రమబద్ధీకరిస్తాయి.

దానిమ్మ

ఇది రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పాలీఫినాల్‌ను కలిగి ఉంటుంది. ఈ పాలీఫినాల్ క్యాన్సర్ పెరగకుండా చూస్తుంది.

పసుపు

క్యాన్సర్‌ను ఇది సమర్థంగా నిరోధిస్తుంది. రొమ్ము, పేగు, చర్మ సంబంధిత క్యాన్సర్ కణాలను ఇది నిర్వీర్యం చేస్తుంది. క్యాన్సర్ కారక కణాలతో ఇది సమర్థంగా పోరాడుతుంది.

మిరియాలు

క్యాన్సర్‌పై పోరాడటానికి మిరియాలు మంచి సాధనం. వీటిలోని క్యాప్‌సైసిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్‌ను కలిగించే కణాలను నిర్మూలిస్తాయి. వీటిని కూరగాయలతో కలిపి తీసుకుంటే మేలు.

క్యారట్

క్యాన్సర్‌ను నిరోధించే బయోఫ్లేవనాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్‌లు ఇందులో ఉంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఇవి తగ్గిస్తాయి. ముఖ్యంగా వూపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించడానికి క్యారట్లు ఎంతగానో తోడ్పడతాయి.

ద్రాక్ష

ఇందులోని ఎలాజిక్ యాసిడ్ వూపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. పర్యావరణంలోని విష పదార్థాలు శ్వాస వ్యవస్థకు హాని చేయకుండా ఎలాజిక్ యాసిడ్ రక్షణ కల్పిస్తుంది.


వీటికి నో చెప్పండి!

⚛ తక్కువ మోతాదు అయినా సరే ఆల్కహాల్ తీసుకోకూడదు.

⚛ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు.

⚛ కేక్స్, చిప్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

⚛ రొమ్ము క్యాన్సర్‌ను ప్రేరేపించే హెటరో సైక్లిక్ అమైన్‌లను ఉత్పత్తి చేసే రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి.

⚛ ఫ్రైడ్ ఫుడ్ లాంటి శ్యాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్‌లను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్