Published : 22/01/2022 17:22 IST

ఇలా అయితే ఫ్రీలాన్సర్‌గానూ రాణించవచ్చు..!

ఉద్యోగం అంటే ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే పని చేసి మళ్లీ రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఇంటి దగ్గర్నుంచి కూడా జాబ్ చేసే వెసులుబాటు ఉంటోంది. అందులోనూ ప్రత్యేకించి ఒక సంస్థ కోసం కాకుండా నచ్చిన సంస్థలకు నచ్చిన రీతిలో పని చేసే సౌలభ్యం కూడా అందుబాటులోనే ఉంటోంది. అదేనండీ.. ఫ్రీలాన్సింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు ప్రస్తుతం ఈ రంగంలో కూడా అవకాశాలు విరివిగానే లభ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రీలాన్సింగ్ చేసేవారు కెరీర్‌లో విజయవంతంగా ముందుకెళ్లాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రండి..

రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న ఈ రోజుల్లో వివిధ సంస్థలు వివిధ రకాల సేవలతో ముందుకొస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఇది మరింత ఎక్కువైంది. మరి, వాటికి మానవ వనరులు కూడా కావాలి కదా! అందుకే ఆయా సంస్థలు పేరోల్స్‌లో రెగ్యులర్‌గా పని చేసే సిబ్బందితో పాటు ఫ్రీలాన్సర్స్ గురించి కూడా అన్వేషిస్తున్నాయి. అయితే దీనిని కెరీర్‌గా మలుచుకొని అందులో రాణించాలనుకుంటే ముందు నుంచీ కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.

క్రమశిక్షణ ముఖ్యం..

'ఫ్రీలాన్సింగ్ అంటే ఇంట్లో చేసుకునేదే కదా! మనకి కుదిరినప్పుడు, నచ్చినంతసేపు ఇష్టం వచ్చినట్లు పని చేసుకోవచ్చులే!'- ఫ్రీలాన్సింగ్ అనగానే చాలామంది మదిలో మెదిలే ఆలోచనలు ఇలానే సాగుతాయి. అయితే అది పూర్తిగా పొరపాటు. చేసే పనిలో నాణ్యత కొరవడకుండా ఉండాలంటే అందుకు తగిన క్రమశిక్షణ కలిగి ఉండడం కూడా చాలా అవసరం. ఆఫీసుకి వెళ్తే ఎంత నియమ, నిబద్ధతలతో పని చేస్తామో ఇంటి పట్టున ఉండి చేసే పనిలో కూడా అలానే ఉండాలి. ముఖ్యంగా బద్ధకాన్ని మన దరి చేరనీయకూడదు. లేదంటే అది వాయిదాల పర్వానికి తెర తీసి రాణించాలనుకున్న కెరీర్‌ని కాస్తా అటకెక్కిస్తుంది.

ప్రాథమికాంశాలపై అవగాహన..

ఫ్రీలాన్సింగ్ చేయాలని అనుకుంటున్నారు.. బాగానే ఉంది.. మరి, దానికి సంబంధించిన ప్రాథమికాంశాలపై కూడా అవగాహన ఉండాలి కదా! అందుకే మీరు పని చేయాలనుకుంటున్న రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి నిపుణులను అడిగి తెలుసుకోవడం లేదా అదే రంగంలో పని చేస్తున్న పరిచయస్తుల ద్వారా వాకబు చేసి వివరాలు సేకరించడం.. వంటివి చేయాలి. తద్వారా ప్రస్తుతం సంస్థలు మనలో కోరుకుంటున్న నైపుణ్యాలు, పని గంటలు, ప్రాజెక్టు వివరాలు, డబ్బు చెల్లించే విధానం.. మొదలైన అంశాలపై ఒక అవగాహన ఏర్పడుతుంది. దీని ద్వారా మనం ఎంత సేపు పని చేయాలి? మన కష్టానికి ప్రతిఫలంగా సంస్థ నుంచి ఎంత ఆశించవచ్చు.. అనే అంశాల్లో మనమూ ఒక అంచనాకి వచ్చే వీలు ఉంటుంది.

నెట్‌వర్క్ కూడా ముఖ్యమే..

ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్నా అందుకు తగినవిధంగా నెట్‌వర్క్ కలిగి ఉండడం కూడా ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా మారిపోయింది. ఈ క్రమంలో మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకునే రంగంలో మీకు తెలిసిన వారితో మీరూ ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. దాని ద్వారా ఆయా రంగాల్లో వస్తున్న మార్పులు- చేర్పుల గురించే కాకుండా కొత్త ఒరవడుల గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆయా రంగాల్లో ఉన్న అవకాశాల విస్తృతి గురించి మనకు తెలుస్తుంది.

పక్కాగా మాట్లాడుకోవాలి..

ఏదైనా ఒక సంస్థ కోసం పని చేయడం ప్రారంభించే ముందే పనికి సంబంధించిన సమస్త వివరాల గురించి పక్కాగా మాట్లాడుకోవాలి. పనికి వారు ఇచ్చే వేతనం దగ్గర్నుంచి రోజుకి ఎంత మేరకు మన సేవలు అందించాలి? అందులో పాటించాల్సిన నియమాలు, ఎన్ని రోజుల వరకు ఆ ప్రాజెక్టు కోసం పని చేయాలి.. మొదలైన అన్ని అంశాల పైనా పక్కాగా అవగాహన ఏర్పడిన తర్వాతే పని చేయడం ప్రారంభించాలి. ఈ విషయంలో అటు సంస్థకు లేదా ఇటు మీకు ఎలాంటి సందేహాలున్నా నిరభ్యంతరంగా, నిస్సందేహంగా మాట్లాడి నివృత్తి చేసుకోవడం చాలా ముఖ్యం.

ఇవీ తెలుసుకోండి..

* ఇబ్బంది పడుతూ పని చేయడం అస్సలు సరైన పద్ధతి కాదు. అది ఎక్కడైనా సరే.. కాబట్టి అలాంటి పనులు చేయడానికి నిస్సందేహంగా 'నో' చెప్పడం నేర్చుకోవాలి.

* మనం ఏ విధమైన పని చేయాలనుకుంటున్నామో సంస్థకు శాంపిల్స్ చూపించడం ద్వారా అదే పని చేసే అవకాశం ఉంటుంది. లేదంటే సంస్థకు తగినట్లుగా మీరు అవసరమైన మార్పులు చేసుకోవడం కాస్త ఇబ్బంది అనిపించవచ్చు.

* పని ఇంటి నుంచి చేసినా లేక ఆఫీసులో చేసినా పూర్తి ఏకాగ్రత ఉండడం తప్పనిసరి.

* పని ఏదైనా అందులో మన ప్రతిభని ప్రదర్శించినప్పుడే దానికి మరింత సానబెట్టి చక్కని అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.

* ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు పనికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ సంస్థతో పారదర్శకంగా మెలగడం చాలా అవసరం.

* ఆయా రంగాల వారీగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు ఆఫర్ చేసే పలు వెబ్‌సైట్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో విశ్వసనీయమైన వాటిని ఎంచుకుని అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి