కరోనాలో పంద్రాగస్టు.. ఇంట్లోనే ఇలా!

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి కూడా మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది.

Updated : 23 Dec 2022 17:06 IST

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి కూడా మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది. మరి, ఎప్పుడూ బయట అందరితో కలిసి కోలాహలంగా జరుపుకొనే ఈ వేడుకల్ని ఈసారి ఇంట్లో వాళ్లతో కూడా అంతే జోష్‌ఫుల్‌గా జరుపుకోవాలంటే ఏం చేయాలి? పిల్లలు ఎంతో ఇష్టపడే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఇంట్లో అయినా వాళ్లు ఎంజాయ్‌ చేసేలా ఎలా జరుపుకోవచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవండి..!

ఇంటికి మువ్వన్నెల మెరుపులు!

వేడుకేదైనా అన్నింటికంటే ముందుగా ఇంటిని శోభాయమానంగా ముస్తాబు చేయడం మనకు అలవాటే! అయితే స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా పిల్లలు స్కూల్‌లో తమ తరగతి గదిని, పెద్దవాళ్లు తాము పనిచేసే కార్యాలయాలను జెండా రంగులతో అందంగా అలంకరిస్తుంటారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమవడంతో వేడుకల్ని చాలా మిస్సవుతున్నామంటూ బాధపడిపోతున్నారు చాలామంది. కానీ ఆ మూడ్‌ నుంచి బయటికొచ్చి ఈసారి మీ ఇంటినే జెండా రంగులతో అందంగా ముస్తాబు చేసేయండి.

మూడు రంగుల్లో ఉన్న బెలూన్స్‌, డెకరేటివ్‌ పేపర్స్‌, ఫ్లోరసెంట్‌ బల్బులతో ఇంటిని మీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దండి. ఇక ఇంటి ముంగిట్లో మువ్వన్నెల జెండాను లేదంటే భారత దేశం ఆకృతిలో ముచ్చటైన ముగ్గును వేయండి.. ఆ మధ్యలో ‘స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!’ అని రాయండి.. తద్వారా మీరు ఇంట్లో ఉండి కూడా ఆ వీధి గుండా వెళ్లే వారందరికీ పరోక్షంగా విషెస్‌ చెప్పినట్లవుతుంది. ఇక మీకు ఆసక్తి ఉంటే మీరు, మీ ఇంట్లో ఉండే పిల్లలంతా ఒక్కొక్కరు ఒక్కో స్వాతంత్ర్య సమరయోధుల గెటప్‌లో రడీ కావచ్చు.. లేదంటే ట్రై-కలర్‌ దుస్తుల్లో ముస్తాబు కావచ్చు.. ఇలా మీకు నచ్చినట్లుగా మీ ఇంటిని తీర్చిదిద్దిన ప్రతి ఘట్టాన్ని, మీ అటైర్స్‌ని ఎవరూ చూడలేదే అని బాధపడకండి.. వాటన్నింటినీ ఫొటోలు, వీడియోల్లో బంధించి సోషల్‌ మీడియా వేదికల ద్వారా అందరితో పంచుకుంటే సరి!

పిల్లలు ఏదీ మిస్‌ కాకుండా!

జెండా పండగంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం. మూడు నాలుగు రోజుల ముందు నుంచే వారి ముఖాల్లో ఈ సందడంతా కనిపిస్తుంది. కొత్త యూనిఫాం కుట్టించుకోవడం, లేదంటే ఉన్న యూనిఫాంనే నీట్‌గా ఉతుక్కొని ఐరన్‌ చేయించుకోవడం, కొత్త షూస్‌, అమ్మాయిలైతే మ్యాచింగ్‌ యాక్సెసరీస్‌, పువ్వులు.. ఇలా ఇవన్నీ మనమూ చిన్నప్పుడు చేసే ఉంటాం కదా!

అయితే కరోనా కారణంగా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో వారికి ఇంట్లో ఉండీ ఉండీ బోర్‌ కొడుతుంటుంది. మరి, వారిలోని ఈ నిరాశను తొలగించాలంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంట్లోనే వారితో ఫన్‌ గేమ్స్‌ ఆడించండి.. ఎలాగూ ఈ ప్రత్యేకమైన రోజు కోసం స్కూల్లో ముందు నుంచే పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తుంటారు కాబట్టి.. ఈసారి ఆ ఆటలేదో మీరే మీ చిన్నారులతో ఆడించండి.. గెలిచిన వారికి సర్‌ప్రైజ్‌ ఇవ్వడం, పోటీలో నెగ్గని వారికి ఓడిపోయామన్న ఆలోచన రాకుండా వారికీ చక్కటి బహుమతులు అందించడం వల్ల పిల్లలు బాగా ఖుషీ అవుతారు. ఇలా చేస్తే ఈసారి కూడా స్కూల్లో లాగే స్వాత్రంత్య దినోత్సవ వేడుకల్ని ఎంజాయ్‌ చేస్తారు. కావాలంటే ట్రై చేసి చూడండి!

‘తిరంగా’ స్నాక్స్‌తో విందు చేసేయండి!

వేడుకలంటే చక్కగా ముస్తాబవడం, ఎంజాయ్‌ చేయడం, ఫొటోలు దిగడం.. ఇవే కాదు.. నచ్చిన వంటకాలతో విందు చేయడం కూడా! అందుకే ఈసారి వెరైటీగా ట్రై-కలర్‌ స్నాక్స్‌ ప్రయత్నించచ్చు. అలాగని మీరు చేసే వంటకాల్లో ఫుడ్‌ కలర్‌ మాత్రం కలపకండి. సహజసిద్ధమైన పదార్థాలతోనే స్నాక్స్‌ తయారుచేయండి..

ఉదాహరణకు.. ఆరెంజ్‌ కలర్‌ కావాలంటే ఆ రంగులో ఉండే క్యారట్స్‌తో వేఫుల్‌ క్యారట్స్‌, క్యారట్‌ చిప్స్‌.. వంటివి చేయచ్చు..! అదే తెలుపు రంగైతే - పాప్‌కార్న్‌, ఇక ఆకుపచ్చ రంగు కోసం పాలక్‌ పకోడా, పాలక్‌ బిస్కట్స్‌.. వంటివి వేడివేడిగా తయారు చేసుకొని, ఆకర్షణీయంగా సర్వ్‌ చేసుకొని మరీ లాగించేయచ్చు. పిల్లలైతే ఇవన్నీ మరింత ఇష్టంగా తింటారు. ఇక స్వీట్స్‌ కావాలనుకున్న వాళ్లు క్యారట్‌ తురుము, రవ్వ, పెసలు.. వంటి వాటితో హల్వా చేసుకొని తిరంగా హల్వాను వేడివేడిగా తినేయచ్చు.. ఇవన్నీ ఇంట్లో చేసుకున్నవి కావడం, అలాగే వీటిలో రంగు కోసం ఆర్టిఫిషియల్‌ ఫుడ్‌ కలర్‌ ఉపయోగించకపోవడంతో అటు ఎంతో టేస్టీగా ఉంటూనే, ఇటు ఆరోగ్యాన్నీ అందిస్తాయీ యమ్మీ రెసిపీస్‌. మరి, మీరూ ట్రై చేస్తారు కదూ!!

‘గ్రీన్‌’ ఛాలెంజ్‌తో క్లీన్‌ చేసేయండి!

అందరూ కలిసి ఎంజాయ్‌ చేస్తేనే వేడుక చేసుకున్నట్లా? కాదు.. తమ మనసుకు నచ్చిన పని ఏది చేసినా అదీ వేడుకతో సమానం అనే వారూ లేకపోలేదు. అందుకే తమకు సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో తమకు ఇష్టమైన, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తుంటారు. మనచుట్టూ ఉన్న పర్యావరణాన్ని సంరక్షించడం కూడా అలాంటి పనుల్లో ఒకటి. నిజానికి మనకు తెలిసో, తెలియకో, నిర్లక్ష్యం వల్లనో ప్రస్తుతం కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. అందుకే ఇకనైనా బాధ్యతతో పర్యావరణాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది మొక్కలు నాటుతున్నారు. పచ్చదనంపై తమకున్న ప్రేమను చాటుతున్నారు.

మరి, ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీరు ఇంట్లో చేసుకునే వేడుకల్లోనూ ఈ కార్యక్రమాన్ని భాగం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఉదయాన్నే కుటుంబ సభ్యులందరూ మీ ఇంటి గార్డెన్‌ లేదంటే కుండీల్లో ఒక్కో మొక్క నాటండి. ఇలా అందరూ చేస్తే అటు పర్యావరణానికి, ఇటు మనకూ చాలా మేలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్