500 సంస్థలకు కొవ్వులు అందిస్తున్నారు!

నోరూరించే చాక్లెట్లు... ఇష్టంగా రాసుకొనే బాడీలోషన్లు.. ఇవి తయారు కావాలంటే కచ్చితంగా కొన్ని ‘స్పెషాలిటీ ఫ్యాట్స్‌’ ఉండాల్సిందే! వీటి తయారీలో ఎనభైలక్షలమంది మహిళలు పని చేస్తున్నారని తెలుసా? వీళ్లందరినీ ముందుకు నడిపిస్తోంది మనోరమ ఇండస్ట్రీస్‌ ఛైౖర్‌పర్సన్‌ వినీత సరాఫ్‌...

Updated : 23 Mar 2022 06:32 IST

వినీత సరాఫ్‌

నోరూరించే చాక్లెట్లు... ఇష్టంగా రాసుకొనే బాడీలోషన్లు.. ఇవి తయారు కావాలంటే కచ్చితంగా కొన్ని ‘స్పెషాలిటీ ఫ్యాట్స్‌’ ఉండాల్సిందే! వీటి తయారీలో ఎనభైలక్షలమంది మహిళలు పని చేస్తున్నారని తెలుసా? వీళ్లందరినీ ముందుకు నడిపిస్తోంది మనోరమ ఇండస్ట్రీస్‌ ఛైౖర్‌పర్సన్‌ వినీత సరాఫ్‌...

1940నాటి మాట. జానకీలాల్‌ చిరుద్యోగం చేస్తూ వచ్చేటప్పుడు తన భార్యకోసమని కాసిని పచ్చి పల్లీలు తెచ్చేవాడు. వాటిని ఎండబెట్టి.. వారంలో ఒక రోజు అవన్నీ గానుగ పట్టించేదామె. స్వచ్ఛమైన ఆ నూనెని సంతలో అమ్మేవాడు జానకీలాల్‌. కొన్నాళ్లకు ఈ నూనెలు, కొవ్వులు గురించి పూర్తిగా తెలుసుకోవడానికని లండన్‌వెళ్లి పీహెచ్‌డీ చేశాడు. తిరిగొచ్చి స్థానికంగా దొరికే గుగ్గిలం గింజలు, మామిడి టెంకలతో ప్రత్యేకమైన కొవ్వులు తయారుచేసి వాటిని విదేశాల్లో ప్రదర్శించాడు. అప్పుడే వాళ్లకి ప్రఖ్యాత ఫెరీరో చాక్లెట్స్‌ అధినేత మైఖేల్‌ఫెరీరో పరిచయం అయ్యాడు. తన చాక్లెట్ల నాణ్యత పెంచేందుకు వీళ్ల దగ్గర కొవ్వులు కొనడం మొదలుపెట్టాడు. కానీ ఆశించినంతగా వ్యాపార అవకాశాల్లేక కొన్నాళ్లకి ఆ వ్యాపారం మూతబడింది. కట్‌ చేస్తే...

2005.. ఆసిఫ్‌ షరాఫ్‌, వినీత సరాఫ్‌ దంపతులు ‘మనోరమ ఇండస్ట్రీస్‌’ పేరుతో స్పెషాలిటీ కొవ్వుల వ్యాపారాన్ని ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభించారు. అతి తక్కువ కాలంలో ఈ సంస్థ తమ ఉత్పత్తులని 85 దేశాలకు చెందిన 500 సంస్థలకు అమ్మే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం రూ.180 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఇంతకీ  ఈ ఆసిఫ్‌ సరాఫ్‌ మరెవరో కాదు జానకీలాల్‌ మనవడే. ఇంటి నుంచే వ్యాపారాన్ని మొదలుపెట్టిన ఆయన బామ్మ మనోరమ జ్ఞాపకార్థమే ఈ సంస్థకి ఆమె పేరు పెట్టింది వినీత. ఇంతకీ ఈ సంస్థ ఏం చేస్తుందంటే... చాక్లెట్లు, సౌందర్య లేపనాల తయారీలో సీబీఈ, ఎస్‌బీఈ అనే కొవ్వులు తప్పనిసరి. వీటి తయారీకోసం మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు చెందిన లక్షల మంది మహిళల సాయంతో అడవుల్లోని గుగ్గిలం గింజలు, మామిడి విత్తనాలు, కోకమ్‌ గింజలు వంటివి సేకరిస్తారు. ఈ సంస్థ ఆఫ్రికాలో కూడా విస్తరించింది. అక్కడ ఘనా, బుర్కినాఫాసో, ఐవరీకోస్ట్‌, టోగో, మాలీ, నైజీరియాకు చెందిన పొదుపు సంఘాల మహిళలు కొకోవా, షియా విత్తనాలని సేకరించి రాయ్‌పూర్‌లో ఉన్న ఈ పరిశ్రమకు తరలిస్తారు. ఇక్కడ  తయారైన కొకోవాబేస్డ్‌ ఈక్వెలెంట్లు, షియాబేస్డ్‌ఈక్వెలెంట్లని ఫెరీరోతోపాటు లోరియల్‌, బాడీషాప్‌ వంటి ఎనభైఐదు దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచంలోని పది ప్రముఖ స్పెషాలిటీ బటర్‌ తయారీ సంస్థల్లో ఇదీ ఒకటి. ఏడాదికి పదిహేనువేల మెట్రిక్‌టన్నుల కొవ్వులని తయారుచేసే ఈ సంస్థకి వినీతాసరాఫ్‌ ఛైర్‌పర్సన్‌గా ఆది నుంచీ కీలకపాత్ర పోషిస్తున్నారు. బెంగళూరులోని మౌంట్‌కారామెల్‌ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ చేశారీమె. ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగంలో పద్దెనిమిదేళ్ల అనుభవం ఉంది. ‘లండన్‌లో అతిపెద్ద సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘బాడీలోషన్‌’కి కావాల్సిన కొవ్వులన్నీ ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. అదేకాదు లోరియల్‌, హర్షీస్‌, నెస్లే, రోచెర్‌ ఫెరీరో వంటి సంస్థలకు కావాల్సిన కొవ్వులనీ మేమే ఎగుమతి చేస్తున్నాం. మామిడి పండ్ల నుంచి తీసే... మేంగో బటర్‌ తయారీలో ప్రపంచవ్యాప్తంగా మేమే ముందున్నాం. పలు రాష్ట్రాల్లోని గిరిజన మహిళలు అడవుల్లోని వ్యర్థాలని సేకరించి మాకిస్తారు. వారి సహకారంతో ముందుకెళ్తున్నాం’ అనే వినీత వ్యాపారాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్వహిస్తున్నారు. అడవుల్లోని వ్యర్థాలతోనే లక్షలమంది మహిళలకు ఉపాధినివ్వడంతోపాటు... నూనెలు, కొవ్వులు తీసేసిన తర్వాత వచ్చే వ్యర్థాలు... అంటే తెలకపిండిలాంటి పదార్థాలను పశువులకు చక్కని పశుగ్రాసంగా అందిస్తోందీ సంస్థ. అందుకే అత్యుత్తమ పర్యావరణ హిత వ్యాపారవేత్తగా ఎన్నో అవార్డులని అందుకున్నారు వినీత.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్