చర్మానికి తగినట్టుగా...

రసాయనాలున్న ప్యాక్‌లతో కాకుండా వంటింటి పదార్థాలతోనే ముఖాన్ని మెరిపించవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు కొన్ని మెలకువలు చెబుతున్నారు.

Published : 07 Oct 2022 00:15 IST

రసాయనాలున్న ప్యాక్‌లతో కాకుండా వంటింటి పదార్థాలతోనే ముఖాన్ని మెరిపించవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు కొన్ని మెలకువలు చెబుతున్నారు.

ఉదయాన్నే పాల ప్యాకెట్‌ కట్‌ చేసి గిన్నెలో నింపిన తర్వాత ప్యాకెట్‌ అంచుల్లో పేరుకొన్న క్రీంను చిన్న గిన్నెలో తీసి విడిగా ఉంచాలి. ఈ క్రీంను అరచేతిలో వేసి ముఖం, మెడ, చేతులకు మృదువుగా రాయాలి. సాధారణ, పొడారే చర్మం ఉన్నవారికి ఇది మంచి మసాజ్‌ అవుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా జరిగి, చర్మం మృదువుగా మారుతుంది. ఓ పావుగంట ఆరనిచ్చిన తర్వాత, ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి లేదా పచ్చిపెసరపిండికి పావు చెంచా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి కడిగితే చాలు. వారం రోజులు ఇలా చేస్తే చర్మం మెరుపులీనుతుంది. జిడ్డు చర్మం, మొటిమల సమస్య ఉన్నవారు ఈ పచ్చిపాల మీగడను వాడకపోవడం మంచిది.

జిడ్డు చర్మం వారికి ..
కూరగాయలు కోసేటప్పుడు టమాటాల్లో ఓ అరచెక్కను విడిగా తీసి ఉంచాలి. ఈ టమాటా ముక్క మీద రెండు చుక్కల తేనె వేసి ముఖానికి, మెడకు రుద్ది పదినిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. జిడ్డు చర్మం వారికి టమాటా రసం మెరుపునిస్తుంది. సహజసిద్ధ బ్లీచ్‌గా పనిచేసి, చర్మంపై ఉన్న నల్లని మచ్చలను దూరం చేస్తుంది.

ఒక బంగాళా దుంపను తురిమి దాన్నుంచి రసం విడిగా తీసి రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి, మెడకు రాసి ఆరనివ్వాలి. పావుగంట తర్వాత చన్నీళ్లతో కడిగితే ఇది చర్మంపై బ్లీచ్‌గా పనిచేసి, ముఖచర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పొడి చర్మం ఉన్నవారు టమాటా, బంగాళాదుంపకు దూరంగా ఉండాలి. లేదంటే మరింత పొడిబారే ప్రమాదం ఉంది.


పండ్లతో..

బొప్పాయి లేదా అరటిపండును సలాడ్‌ కోసం కోసినప్పుడు రెండేసి చెంచాల చొప్పున ముక్కలను విడిగా తీసి మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమంలో పావుచెంచా తేనె కలపాలి. ముందుగా ముఖాన్ని మురికి లేకుండా శుభ్రపరిచి, ఆ తర్వాత ఈ పండ్ల మిశ్రమాన్ని రాసి, మృదువుగా మర్దనాచేసి పావుగంట ఆరనిచ్చి కడిగితే చాలు. సహజ పోషకాలు చర్మానికి అంది ముఖం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. తర్వాత సబ్బు లేదా సున్నిపిండి వంటివి రాయాల్సిన అవసరం లేకుండానే చర్మం శుభ్రపడుతుంది. ఇలా ఓ వారం చేస్తే చాలు. ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది. అనుకోకుండా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక క్యారెట్‌ను తురిమి రసం తీసి సమానపాళ్లలో తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. చన్నీళ్లతో శుభ్రం చేస్తే చాలు. ముఖం అప్పటికప్పుడు కాంతివంతంగా కనిపిస్తుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్