చిన్నారులు ఉన్నత వ్యక్తులుగా...

చిన్నారులను మంచి వ్యక్తితత్వం గల వారిగా తీర్చిదిద్దాలంటే బాల్యం నుంచి మంచి అలవాట్లతోపాటు కొన్ని నియమాలను నేర్పించాలి అంటున్నారు మానసిక నిపుణులు. వాటిని పాటించేలా చేస్తే, భవిష్యత్తులో వారు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు.

Updated : 05 Oct 2021 04:49 IST

చిన్నారులను మంచి వ్యక్తితత్వం గల వారిగా తీర్చిదిద్దాలంటే బాల్యం నుంచి మంచి అలవాట్లతోపాటు కొన్ని నియమాలను నేర్పించాలి అంటున్నారు మానసిక నిపుణులు. వాటిని పాటించేలా చేస్తే, భవిష్యత్తులో వారు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు.

* ఆర్థిక ప్రణాళిక... పదేళ్లు కూడా నిండ లేదు, వాడికప్పుడే ఇంటి ఖర్చుల గురించి ఎందుకు అనకూడదు. వెచ్చాలు, కరెంటు, నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి వాళ్ల పుస్తకాలు, స్కూల్‌ ఫీజు వరకు వారికి తెలిసేలా చెప్పాలి. ఓ పుస్తకాన్నిచ్చి, అందులో రోజూ ఎంత ఖర్చవుతుందో వారితోనే రాయించాలి. ఆదాయాన్ని ఖర్చులకు సరిపోయేలా ఎలా ప్రణాళిక వేస్తున్నామో చెప్పాలి. అప్పుడే వారికి రూపాయి విలువ తెలుస్తుంది. వారిని ప్రణాళికాబద్ధంగా ఆలోచించేలా చేస్తుంది. అనవసర ఖర్చులేంటో కూడా తెలుసుకుంటారు.

* కుటుంబ విలువలు... కథలద్వారా కుటుంబ విలువలను నేర్పాలి. సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టత వంటి వాటిపై అవగాహన కలిగించాలి. ఇవన్నీ చిన్నారుల్లో కుటుంబంలోని ఆయా వ్యక్తుల ప్రాధాన్యం, విలువను అర్థం చేసుకునేలా మారుస్తుంది. పిల్లల ముందు తల్లిదండ్రుల ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉంటేనే వారిలో పెద్దవాళ్లపై గౌరవభావాన్ని పెంచుతుంది. క్రమశిక్షణ పేరుతో ఒత్తిడికి గురిచేయకుండా సమయపాలన ప్రయోజనాలను, ప్రతీ క్షణం విలువైందే అనే అంశాన్నీ తెలిసేలా చేస్తే చాలు. సమయాన్ని ఎలా వినియోగించుకోవచ్చు అనేది కూడా అమ్మా నాన్నల నుంచే వాళ్లు నేర్చుకుంటారు. ఆ మార్గంలో అడుగులేస్తారు.

* బాధ్యతలు... ప్రతి పనిలోనూ పిల్లలకు బాధ్యత నేర్పాలి. వారి వస్తువులను వారే జాగ్రత్తగా చూసుకోవడం నుంచి ఏదైనా తప్పు చేసినా దానికి వారే బాధ్యత వహించేలా నేర్పాలి. అది బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. వారి అభిప్రాయాల్ని వ్యక్తీకరించే అవకాశాలను కల్పించాలి. అది వారికి మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. లేదంటే ఆత్మనూన్యతకు గురవుతారు. ఎదుటి వారు చెప్పేది వినడం, కోపాన్ని అదుపు చేసుకోవడం వంటివి బాల్యం నుంచి అభ్యాసం చేయించాలి. వారికిష్టమైన కళల్లో ప్రవేశించేలా చేస్తే, ఆత్మవిశ్వాసంతో పాటు ఒత్తిడిని జయించే సామర్థ్యాన్ని పొందుతారు. వీటితోపాటు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం, అందరినీ సమానంగా చూడటం వంటివి వారిని ఉన్నతవ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్