Updated : 23/11/2021 06:22 IST

ఈ అలవాట్లతో అనుబంధాలు దూరం

దంపతుల అనుబంధం దూరం కావడానికి కొన్ని అలవాట్లే కారణం అవుతాయంటున్నారు మానసిక నిపుణులు. ఎదుటివారికి అసౌకర్యాన్ని, అభద్రతను ఇచ్చే ఆ అలవాట్లను గుర్తించి, వదిలించుకునే ప్రయత్నం చేయకపోతే వైవాహిక బంధం బీటలు వారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

నిశ్శబ్దం.. దాంపత్యానికి కమ్యూనికేషనే ఆక్సిజన్‌. కోపం వస్తే చాలా మంది రోజుల తరబడి మాట్లాడరు. ఎదుటి వారిని నిశ్శబ్దంగా సాధించడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాచేస్తే అది తీవ్రప్రభావం చూపడమే కాదు, వారి మనసులోని ప్రేమను తగ్గించే ప్రమాదం కూడా ఉండొచ్చు. సమస్య ఉన్నప్పుడు పదినిమిషాలు మాట్లాడుకుంటే కోపతాపాలు దూరమవుతాయి. కోపానికి కారణమేంటో స్పష్టంగా వివరించి చెప్పగలిగినప్పుడే దానికి పరిష్కారాన్ని కనిపెట్టొచ్చు.

విమర్శ... ప్రతి క్షణం భాగస్వామిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు కొందరు. ఈ అలవాటు ఎవరికున్నా చాలు.. ఆ దాంపత్యం చేదుగా మారిపోతుంది. చిన్నపని చేసినా దాన్ని తప్పుగా ఎత్తిచూపడం వంటివి చేస్తూ, ప్రతి విషయానికీ వారిని వెంటాడుతూ ఉంటే అది ఎదుటి వారికి వేదన కలిగించడమే కాదు, నూన్యతకు గురిచేసే ప్రమాదం ఉంది. అలా కాకుండా అవతలి వారు చేసే పనిలో స్వేచ్ఛనిస్తే చాలు. అది ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ప్రేమను పెంచేలా చేస్తుంది.

అగౌరవం... జీవిత భాగస్వామిని ప్రతి అంశంలోనూ గౌరవించాలి. వారి అభిరుచులు, అభిప్రాయాలు, సంప్రదాయాలకు మర్యాద ఇవ్వాలి. అగౌరవంగా మాట్లాడితే అది అభిమానాన్ని దెబ్బ తీస్తుంది. మరికొందరు బయటి వారెదుట భాగస్వామిని తక్కువగా చేసి విమర్శిస్తుంటారు. మాట జారితే తీసుకోలేమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. భాగస్వామిని అవమానిస్తే తమ అనుబంధాన్ని తక్కువ చేసుకున్నట్లే అనే అవగాహన ఉండాలి. ఆ మాటలు వారిని తీవ్ర వేదనకు గురి చేస్తాయి. ఈ అలవాటు మానుకోవాలి. లేదంటే నిజమైన ప్రేమ దూరమవుతుంది.

సమర్థింపు... కొన్ని సందర్భాల్లో పొరపాటు తమ వల్లే జరిగినా కొందరు ఒప్పుకోరు. ఇంకొందరు ఆ పొరపాటును భాగస్వామిపై వేయడానికి ప్రయత్నిస్తూ వాదిస్తారు. ఇద్దరి మధ్యా చర్చలుండాలి తప్ప, వాదనలు కాదు. పొరపాటు చేసిన వారే క్షమాపణ చెప్పి, ఇకపై జరగదనే భరోసాను భాగస్వామికి ఇస్తే చాలు. సమస్యను, కారణాల్ని మృదువుగా చెప్పాలి. ఇలా చర్చించుకుంటే ఎదుటి వారి మనసు దూది పింజలా తేలిక పడుతుంది. ఈ తరహా అవగాహన, మంచి ప్రవర్తన, అలవాట్లు ఉంటే... ఆ సంసారంలో సంతోషం నిండుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని