Updated : 26/02/2022 05:50 IST

రోజంతా ఫోనైతే... నేనెందుకు?

అమలకు ఇంట్లో భర్త ఉన్నా, ఆఫీస్‌కెళ్లినా తేడా తెలీదు. పన్లోనో, ఫోన్‌లో ఉంటూ తన ఉనికినే మర్చిపోతున్నాడనే వేదన రోజురోజుకీ పెరుగుతోంది. ఇటువంటి చిన్న చిన్న అంశాలే క్రమేపీ బంధాన్ని బలహీనపరుస్తాయి అంటున్నారు నిపుణులు. ఇరువురి మనసులూ ముడిపడి దగ్గరవ్వాలంటే కొన్ని అలవాట్లను దూరం పెట్టాల్సిందే అని హెచ్చరిస్తున్నారు...

మునిగిపోవద్దు... ఇంటి నుంచి పని చేయడంతో రోజంతా కంప్యూటర్‌ ముందే గడిచిపోయినా తెలీదు. ఇది పనిచేస్తున్న వారికి గుర్తు లేకపోయినా ఇంట్లో ఉన్న భాగస్వామికి మాత్రం ఒంటరితనాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే నిర్ణీత గంటల్లో పని పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైనా ఒకసారి అదనపు సమయం పడితే ఎదుటి వారికి అభ్యంతరం ఉండకపోవచ్చు. అలాకాక రోజంతా కంప్యూటర్‌లోనే గడిపితే అది ఎదుటివారిపై చెడు ప్రభావం చూపిస్తుంది. మరికొందరు ఆఫీసు పని పూర్తవ్వగానే ఫోన్‌ చేతిలోకి తీసుకుని నిద్రపోయే వరకు అందులోనే మునిగిపోతారు. ఇది అవతలివారిని విస్మరించినట్లుగా అవుతుంది. జీవిత భాగస్వామిపై నిర్లక్ష్య భావాన్ని కనబరుస్తున్నట్లుగా ఉండటంతో ఆ బంధం బీటలు వారుతుంది. అందుకే ఫోన్‌ వినియోగానికి నిర్ణీత సమయాన్ని కేటాయించండి. కుటుంబ సభ్యులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని గుర్తిస్తే ఆ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది.

ఆరోగ్యం... కొన్ని జంటల్లో ఎవరో ఒకరికి తరచూ అనారోగ్యం కలుగుతుంటుంది. దీనికి కారణాలను గుర్తించి చికిత్స పొందాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఉత్సాహంగా ఉండటానికి కృషి చేయాలి. రోజూ భాగస్వామికి అనారోగ్యం దరిచేరుతుంటే అవతలి వారిలో నిరాసక్తత చోటు చేసుకుంటుంది. మరికొందరు ఏదో కోల్పోయినట్లు, ప్రతికూల ధోరణితో దూరంగా ఉంటుంటారు. ఇవన్నీ ఎదుటి వారికి వారితో కలిసి జీవించడంపై ఆసక్తిని తగ్గిస్తాయి. కలిసి వ్యాయామం చేయడం, తోటపని పంచుకోవడం, భాగస్వామి లక్ష్యాలను, అభిప్రాయాలను తెలుసుకొని ప్రోత్సహించడం, కొత్త వంటకాలను కలిసి చేయడం వంటివన్నీ ఇద్దరిలో ఉత్సాహాన్ని నింపుతాయి. నూరేళ్లపాటు కలిసి జీవించడానికి సరిపడే స్నేహబంధాన్ని పెంచుతాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని