పిల్లలూ... ఆరోపణలూ...
ఇల్లాలికి వంటావార్పూను మించిన బాధ్యత పిల్లల పెంపకం. చెప్పింది విని, పెట్టింది తింటే అదేమీ కష్టమైన వ్యవహారం కాదు. వినరు కనుకనే అది జటిలమయ్యేది. ఆ సంగతలా ఉంచితే కొందరు పిల్లలు
ఇల్లాలికి వంటావార్పూను మించిన బాధ్యత పిల్లల పెంపకం. చెప్పింది విని, పెట్టింది తింటే అదేమీ కష్టమైన వ్యవహారం కాదు. వినరు కనుకనే అది జటిలమయ్యేది. ఆ సంగతలా ఉంచితే కొందరు పిల్లలు మనసు నిండా వ్యతిరేకత నింపుకొని ఉంటారు. ‘రజని యూనిఫాం వెలిసిపోయినా వేసుకొస్తోంది, బాగాలేదన్నా వినదు.. దోశలో మిర్చి ముక్క ఒకటే వచ్చిందేంటి, నాకేం నచ్చలేదు.. రాహుల్‌ని నా పుస్తకాల సంచి పట్టుకోమంటే వినలేదు, పొగరు.. అమ్మమ్మా వాళ్లింట్లో ఏసీ లేదు.. నేను రాను’ ఇలా ఏదో విషయమై ఎప్పుడూ ఆరోపణలు చేస్తుంటారు. ఆ అలవాటును ఆదిలోనే తుంచేయకపోతే ఆనక కష్టమంటున్నారు మానసిక వైద్యులు...
* ఎప్పుడైనా ఏదైనా అసంతృప్తి కలగడం సహజమే. కానీ తరచూ ఫిర్యాదులు చేయడం, ఎవరో ఒకరిని నిందించడం మాత్రం ఆరోగ్యకరమైన లక్షణం కాదు. దీన్ని అరికట్టకపోతే మానసిక సమస్యలు తలెత్తుతాయి. మీ చిన్నారి తోటి పిల్లల్ని లేదా టీచర్లను ఏదో నెపం మీద నిందిస్తుంటే నిజమేననుకుని మీరూ కోపతాపాలు ప్రదర్శించకండి. అసలు అలాంటి భావాలను ఎప్పటికప్పుడు తుంచేయండి. తానలా చెప్పడం అమ్మానాన్నలకు ఇష్టంలేదని అర్థమవుతుంది.
* నిందించే ముందు అవతలి వ్యక్తి సమస్య ఏమిటో అర్థం చేసుకోవాలని, వాళ్ల కోణంలోంచి ఆలోచించాలని చెప్పండి. అప్పుడు కోపతాపాలు రావడానికి బదులు సానుభూతి కలుగుతుందని, తప్పుపట్టడం కంటే సాయం చేయగలిగితే గొప్ప సంతృప్తిగా ఉంటుందని చెప్పండి.
* టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇచ్చింది, చేతులు నొప్పెడుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తోంటే.. ‘దీనివల్ల వాళ్లకేమీ సంపదలు రావు కదా.. ఇప్పుడు కష్టపడితే రేపు నీకే మంచి ఉద్యోగం వస్తుంది లాంటి మాటలు చెప్పండి.
* ఏది నిజమైన ఫిర్యాదో, ఏది ఉత్తుత్తి ఆరోపణో మీకు స్పష్టంగానే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్లు నటులు కాదు. సోమరితనంతోనో, తెలియనితనంతోనో ఆరోపణలు చేస్తుండొచ్చు. వాటికి చలించిపోతూ మీ చిన్నారి మీద జాలి కురిపించి, అవతలి వ్యక్తులను నిందిస్తే మరింత ప్రోత్సాహాన్ని అందించినట్లవుతుంది. సహేతుకంగా ఉంటేనే చర్య తీసుకోండి. లేదంటే వ్యతిరేకత తగ్గే మాటలతో ప్రవర్తనలో మార్పు తెండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.