కొన్ని త్యాగాలతో కొండంత అనురాగం

ధర్మేచ.. అర్థేచ.. మోక్షేచ.. నాతి చరామి.. అనేది పెళ్లి మంత్రం. అలా గ్రాంథిక భాషలో కాకున్నా ‘ఇద్దరూ కలకాలం కలిసుండండి, సంతోషంగా గడపండి’ అని పెద్దలంతా ఆశీర్వదిస్తారు. ఆ దీవెనలు నిజమవ్వాలంటే జంటలు కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి.

Updated : 31 Mar 2022 02:05 IST

ధర్మేచ.. అర్థేచ.. మోక్షేచ.. నాతి చరామి.. అనేది పెళ్లి మంత్రం. అలా గ్రాంథిక భాషలో కాకున్నా ‘ఇద్దరూ కలకాలం కలిసుండండి, సంతోషంగా గడపండి’ అని పెద్దలంతా ఆశీర్వదిస్తారు. ఆ దీవెనలు నిజమవ్వాలంటే జంటలు కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి. చిన్న చిన్న త్యాగాలు చేయాలి. అవేం కష్టమైనవి కాదు.. ఒకరకంగా ప్రేమను వ్యక్తం చేయడానికి దొరికిన అవకాశాలు. ఇంతకీ అవేంటంటే...

* ఏ పనీ మొక్కుబడిగా చేయొద్దు. మీరు చేసేది ఇష్టంగా, వంక పెట్టలేని విధంగా ఉండాలి. అది మీ మీద ప్రేమని, గౌరవాన్ని పెంచుతుంది.  మీకు ఇష్టమైన రంగు మీ భాగస్వామికి నచ్చదనుకోండి.. ఆ రంగు దుస్తుల జోలికి వెళ్లొద్దు. మొదట్లో కాస్త బాధ కలగొచ్చు. కానీ త్వరగానే అలవాటైపోతుంది. మీరు తనకోసం వదులుకున్నట్లు తెలిసి ఆ వ్యక్తి మురిసిపోవడమే కాదు, తన అభిరుచిని మార్చుకోవడమూ కద్దు.

* తలనొప్పి, కాళ్లనొప్పి లాంటి అనారోగ్యాలు చాలా సహజం. అందుకు టాబ్లెట్‌ ఇచ్చి ఊరుకునే కంటే కాసేపు తల మర్దనా చేయడం, కాళ్లు నొక్కడం లాంటి సేవ చేస్తే మీ మీద ప్రేమ రెట్టింపవుతుంది. ఆ ఉల్లాసంతో అనారోగ్యం హుష్‌ కాకీ అయిపోయి కృతజ్ఞతా భావం నిలిచిపోతుంది.

* ఫోన్‌లో మునిగిపోయి భాగస్వామిని పట్టించుకోకపోతే కోపతాపాలు వచ్చే అవకాశముంది. కనుక కాలక్షేపాల కంటే బాంధవ్యం ముఖ్యమని మర్చిపోవద్దు.

* పుట్టినరోజు, పదోన్నతి లాంటి సందర్భాల్లో తోచిన కానుక ఇచ్చి ఇంట్లో వేడుక చేయండి. ఆ గుర్తింపూ గౌరవం మధుర స్మృతులను అందించి, ఆత్మీయత తిరుగుటపాలో వస్తుంది.  

* ఎంత ప్రేమగా మెలిగినా ఏదో విషయంలో పేచీలు తప్పవు. అలాంటప్పుడు ఒకరు సర్దుకుపోతే సరిపోతుంది. లేదంటే చిలికి చిలికి గాలివాన అవుతుంది. కోపం తగ్గాక మీ అభిప్రాయం స్థిరంగానే చెప్పొచ్చు.

* చెప్పిన మాట వినకపోవడం, వద్దన్న వస్తువు కొనుక్కురావడం.. లాంటి విషయాల్లో ఆవేశం కలిగే మాట నిజమే. కానీ ఆ కోపాన్ని కాస్త నిగ్రహించుకుని మీకు వాటి పట్ల ఎందుకు విముఖతతో, వాటిల్లబోయే నష్టాలేమిటో శాంతంగా చెప్పి చూడండి... అవతలి వ్యక్తిలో పంతాలూ పట్టింపులకు బదులు సానుకూల ప్రతిస్పందన కనిపిస్తుంది. ఇంకోసారి మీకు ఇష్టం లేని అంశాలు చోటుచేసుకోవు.

ఈ సూత్రాలు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కాదు.. ఇద్దరికిద్దరూ పాటించాల్సినవి. అప్పుడే ఆ సంసారం మూడు పూవులూ ఆరు కాయలుగా సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్