Updated : 10/04/2022 05:55 IST

ఇలా చెబితే వింటారు

పిల్లలు మన మాట వింటున్నట్టే ఉంటారు. కానీ వినరు.. వాళ్లు చేయాలనుకున్నదే చేస్తారు. కారణం మనం వాళ్లకి చెప్పాల్సిన విధంగా చెప్పటం లేదు కాబట్టి....

పిల్లల ముందు పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలనుకోవద్దు. ఏం చెప్పినా సూటిగా, సుత్తి లేకుండా చెప్పండి. అదే వాళ్లకు అర్థమౌవుతుంది. మీరు సుదీర్ఘంగా చెప్పే మాటల్ని వాళ్లు ఏమాత్రం బుర్ర కెక్కించుకోరు సరికదా... ‘అమ్మ ఏం చెప్పినా ఇంతే బోర్‌’ అనుకుంటారు.

* ‘చిన్నీ అది చెయ్యకు’, ‘బుజ్జీ ఇలా చెయ్యకు’... ఇలా మాట్లాడటం మానేసేయండి. పిల్లలకు చెప్పేటప్పుడు ‘ఇది చెయ్యి’... ‘ఇలా చెయ్యి’... అలాంటి సానుకూల పదాలనే వాడాలి. అప్పుడే పిల్లలతో మీరు అనుకున్న పనులు చేయించగలరు.

* గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది పెద్దవాళ్ల విషయంలోనే కాదు... పిల్లల విషయంలోనూ వర్తిస్తుంది. మీరు చెప్పింది వాళ్లు వినాలని మీరు కోరుకున్నట్టే... వాళ్లు కూడా తాము చెప్పేది అమ్మానాన్నలు వినాలని అనుకుంటారు. కాబట్టి వాళ్లు చెప్పేది మనసుపెట్టి వినండి.

* ‘హోం వర్క్‌ చెయ్‌?’ ‘అన్నం తిను’ ఇలా పిల్లలకి ఎప్పుడూ హుకుంలు జారీ చేయకండి. అదే మాటని ఇలా చెప్పి చూడండి. ‘హోంవర్క్‌ ఇప్పుడు చేస్తావా?... కాసేపున్నాక చేస్తావా?’ ఇలా రెండు ఆప్షన్‌లు ఇస్తే ఏదో ఒకటి ఎంచుకుంటారు. రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నందుకూ, సొంతంగా నిర్ణయం తీసుకున్నందుకు సంతోషపడతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని