స్నేహం చేయమనాలి..

తోటిచిన్నారులతో కలిసి ఆడుకునేలా, వారితో స్నేహం చేసేలా పిల్లలను ప్రోత్సహించాల్సింది పెద్ద వాళ్లే అంటున్నారు మానసిక నిపుణులు. ఈ  తీరు వారికి పలు నైపుణ్యాలను నేర్పుతుందని చెబుతున్నారు.

Published : 20 Apr 2022 01:57 IST

తోటిచిన్నారులతో కలిసి ఆడుకునేలా, వారితో స్నేహం చేసేలా పిల్లలను ప్రోత్సహించాల్సింది పెద్ద వాళ్లే అంటున్నారు మానసిక నిపుణులు. ఈ  తీరు వారికి పలు నైపుణ్యాలను నేర్పుతుందని చెబుతున్నారు.

పార్కు, మైదానంలో ఇతర పిల్లలతో కలిసేలా చేయాలి. ఎదుటి చిన్నారులను పలకరించడానికి కొందరు బిడియపడుతుంటారు. ఆ భావనను పోగొట్టేలా పెద్దవాళ్లు ముందడుగు వేయాలి. నలుగురైదుగురిని ఒకచోట చేర్చి గుండ్రంగా తిరిగేలా చేస్తూ ప్రతి ఒక్కరూ పక్క వారికి హలో చెప్పాలనే ఆట నేర్పించాలి. అలా చెప్పని వాళ్లు అవుట్‌ అవుతారనాలి. తిరిగి అదే ఆటను మరొకసారి ఆడించాలి. సరదాగా సాగే ఈ క్రీడతో తమ వయసువారిని పిల్లలు పలకరించడం నేర్చుకుంటారు. పెద్దవాళ్ల పర్యవేక్షణలో చిన్నచిన్న సాహసాలను చేయించాలి. ఎక్కడైనా ఒక వస్తువును ఉంచి బృందాలుగా వెతికి తెమ్మని చెప్పాలి. తెచ్చినవారికి కానుక ఇవ్వాలి.

సెలవు రోజుల్లో...

సెలవుల్లో చిన్నారులందరినీ బేస్‌మెంట్‌ లేదా హాల్‌లో చేర్చాలి. అందరికీ తలో డ్రాయింగ్‌ పుస్తకాన్ని ఇచ్చి బొమ్మలు గీయమనాలి. ఏదైనా ఒక బొమ్మను పెద్దవాళ్లు సూచించడం, లేదా వారికిష్టమైనది వేయమని చెబితే చాలు. ఉత్సాహంగా పని మొదలుపెడతారు. నిర్దిష్ట సమయాన్ని కేటాయించి అన్నింటినీ ఒక చోట చేర్చి ఏది బాగుందో వారితోనే ఎంపిక చేయించాలి. ఆ బొమ్మ వేసిన వారికి చిన్న కానుకను ఇచ్చి అభినందించేలా చేయాలి. పజిల్స్‌ ఇచ్చి చేయించాలి.

కథతో...

చుట్టుపక్కల పిల్లలందరినీ కాసేపు కూర్చోబెట్టి వారితో కథలు చెప్పించాలి. కొందరు కథలు చెబితే, మరికొందరిని సందేహాలేమైనా ఉంటే అడగాలని చెప్పాలి. వారికిష్టమైన అంశాల గురించి మాట్లాడించాలి. ఒకరితో మరొకరు తమ అనుభవాలను పంచుకునేలా చేయాలి. ఇవన్నీ చిన్నారుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడంతోపాటు తమ అనుభవాలను తోటి వారితో పంచుకునేలా చేస్తాయి. కథల ద్వారా సామాజిక అంశాలపైనా అవగాహన వస్తుంది. కలిసి మొక్కలు నాటడం చేయించాలి. ఇవన్నీ పిల్లల్లో సృజనాత్మకత పెంచడమే కాకుండా, ఇతరుల్లో మెరుగైన లక్షణాలను స్వీకరించడం అలవాటు చేస్తాయి. బృందంతో కలిసి పనిచేయడం తెలుసుకుంటారు. స్నేహభావమూ పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని