చేనేతకు అద్దిన ఆధునికత

నేత చీరలపై మక్కువ చూపే మహిళలెందరో. కొన్నిసార్లు తీసుకుని మోసపోయే వారు కొందరైతే, ధర ఎక్కువని వెనక్కి తగ్గేవారు మరికొందరు. ఈ అనుభవం రీతూ ఒబెరాయ్‌కూ అయ్యింది. అందుకు ఆమెకు తోచిన ఉపాయం పది రాష్ట్రాల్లో వందల నేత పని వారికి ఆదాయం తెచ్చిపెడుతోంది. అందుకు తను ఏం చేస్తోందో చదవండి....

Published : 28 Jun 2021 00:59 IST

నేత చీరలపై మక్కువ చూపే మహిళలెందరో. కొన్నిసార్లు తీసుకుని మోసపోయే వారు కొందరైతే, ధర ఎక్కువని వెనక్కి తగ్గేవారు మరికొందరు. ఈ అనుభవం రీతూ ఒబెరాయ్‌కూ అయ్యింది. అందుకు ఆమెకు తోచిన ఉపాయం పది రాష్ట్రాల్లో వందల నేత పని వారికి ఆదాయం తెచ్చిపెడుతోంది. అందుకు తను ఏం చేస్తోందో చదవండి.

రీతూ ఒబెరాయ్‌ 15 ఏళ్లపాటు మీడియా- అడ్వర్టైజింగ్‌ రంగంలో మార్కెటింగ్‌ విభాగంలో పనిచేసింది. కొంత విరామం తీసుకుని, ముంబయి వదిలి దేశమంతా చుట్టి రావాలనుకుంది. అలా ప్రయాణిస్తున్న క్రమంలో నేత పనివారి నైపుణ్యాలను చూసింది. హ్యాండ్లూమ్‌ ఎగ్జిబిషన్లలో దొరికే వాటికీ వీటికీ ఎంత వ్యత్యాసముందో అర్థమైంది. ‘మామూలుగానే చీరలంటే నాకు ప్రాణం. నాణ్యమైన నేత చీరలు దొరకడం ఎంత కష్టమో నాకూ అనుభవమే. ఖర్చు పెట్టినా ఒక్కోసారి నిరాశ తప్పదు. వీళ్ల పనితీరు చూశాక వాస్తవం తెలిసొచ్చింది’ అంటుంది రీతూ. తన మార్కెటింగ్‌ నైపుణ్యాలతో వీటికి ఒక వేదిక కల్పించాలనుకుంది. ఉద్యోగానికి స్వస్తి పలికి 2018లో ముంబయిలో ‘ఫర్‌ శారీస్‌’ను ప్రారంభించింది.

దీన్ని గ్రామీణ నేతకారులతో నేరుగా పనిచేసే సామాజిక వ్యాపార సంస్థగా నిలపాలన్నది ఆమె ఉద్దేశం. తద్వారా వారి నైపుణ్యాన్ని పట్టణాలు, నగరాల వారికి దగ్గర చేయాలనుకుంది. దీనిలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ‘దీని ద్వారా ఈ రంగం ఎదుర్కొంటున్న రెండు సమస్యలను పరిష్కరించవచ్చు. ఒకటి గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి, రెండోది మహిళా సాధికారత’ అంటోంది రీతూ.

సులువేమీ కాలేదు...  నిర్ణయం, ఆశయం రెండూ బానే ఉన్నాయి. రీతూదేమో మార్కెటింగ్‌ నేపథ్యం. అన్నేళ్ల అనుభవం స్టార్టప్‌ను ఏర్పాటు చేయడానికి పనికొస్తుంది. కానీ చీరలంటే ఫ్యాషన్‌పై అవగాహన ఉండాలి. రెండూ భిన్న ధ్రువాలు. పైగా ఆమెకు 41 ఏళ్లు. కొత్తగా నేర్చుకోవడం సాధ్యమేనా అనుకుంది. కానీ తపనే తనను నడిపించిందని చెబుతోంది. చేనేత ఫ్యాషన్‌ ధోరణులపై ఎంతో పరిశోధించింది. ఆపై ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. వీరి లక్ష్యం.. నేతకారులకు స్థిర ఆదాయాన్ని కల్పించడం.

అప్‌స్కిల్లింగ్‌.. అదనపు నైపుణ్యాలను జోడించడం కార్పొరేట్‌ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఈ విధానం. దాన్నే ఇక్కడా ఆచరించింది. మార్కెట్‌, ఫ్యాషన్‌ ధోరణులకు అనుగుణంగా నేత వారికి శిక్షణనిప్పించేది. దాంతో వారు చీరలపై కొత్త డిజైన్లను రూపొందించే వారు. పశ్చిమ్‌ బంగ చుట్టుపక్కల గ్రామాల మహిళలు ‘కాంత చీరల’ను నేస్తారు. శాంతినికేతన్‌ ప్రాజెక్టు పేరిట వీరికి శిక్షణనిచ్చి మెట్రో వర్కింగ్‌ విమెన్‌కు నప్పే కాటన్‌ చీరలను డిజైన్‌ చేయించేది. సహజ రంగులనే ప్రోత్సహించేది. ఫలితం.. నాణ్యత, నేరుగా నేతవారి నుంచే పొందుతుండటంతో ఎంతోమంది వీటిపై ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. సినీ తారలూ వీటిని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు తను 10 రాష్ట్రాల నుంచి నేరుగా 250 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. కచ్‌, చందేరీ, శాంతినికేతన్‌, పోచంపల్లి, అజ్రక్‌పుర్‌, సంబల్‌పుర్‌, రాజస్థాన్‌లోని చౌబందీ, బర్‌ద్వాన్‌ ఇంకా ఎన్నో గ్రామాల వాళ్లు రీతూతో కలిసి పని చేస్తున్నారు.

ఆ సమయంలో.. లాక్‌డౌన్‌లో అమ్మకాలు పడిపోయాయి. దీంతో నేతవారిని హస్త కళలపై దృష్టిపెట్టేలా ప్రోత్సహించింది. వారు అలంకరణ సామగ్రిని చేయడం మొదలుపెట్టారు. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అమ్ముతోంది. ఈ క్లిష్ట సమయంలో వారికి ఆదాయం తగ్గకూడదనేదే ఆమె ఉద్దేశం. ‘ఒక చీర నేయడానికి కనీసం వారం పడుతుంది. బుటీలు, డై వంటి వాటిని బట్టి ఇంకాస్త సమయం పడుతుంది. శ్రమబట్టి ధర ఉంటుంది. అన్ని స్థాయుల వారినీ దృష్టిలో ఉంచుకుని ధరలను నిర్ణయిస్తాం. కళ, నైపుణ్యం ఉన్న వారికి వారి శ్రమకు తగ్గ ఆదాయం కల్పించడంతోపాటు దేశ సంప్రదాయ కళలకు ప్రాచుర్యం కల్పించాలన్న నా కోరిక ఇలా నెరవేరుతుండటం చాలా ఆనందంగా ఉంది’ అంటోంది రీతూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్