వంట నేర్పిన ఆర్థిక మంత్రం!

అమ్మ చేసిన వంట ఆమెలో ఆసక్తిని కలిగిస్తే.... దాన్నే అభిరుచిగా మార్చుకుని...ఆదాయ వనరుగా తీర్చిదిద్దుకుంది మిథాలీ... పాకశాస్త్రనైపుణ్యాలను తాను ఒంటపట్టించుకుని... వాటినే పాఠాలుగా వేలమంది విద్యార్థులకు బోధిస్తోంది.

Published : 25 Oct 2021 02:09 IST

అమ్మ చేసిన వంట ఆమెలో ఆసక్తిని కలిగిస్తే.... దాన్నే అభిరుచిగా మార్చుకుని...ఆదాయ వనరుగా తీర్చిదిద్దుకుంది మిథాలీ... పాకశాస్త్రనైపుణ్యాలను తాను ఒంటపట్టించుకుని... వాటినే పాఠాలుగా వేలమంది విద్యార్థులకు బోధిస్తోంది. ఆ ప్రత్యేకతే...ఆమెకు ‘వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌’ ద్వారా గిరిజన రుచులకు ఆదరణ కల్పించే అవకాశం దక్కింది. పాకశాస్త్ర పర్యటనల ద్వారా గిరిజన స్త్రీలకు ఎన్నో విషయాల్లో మెలకువలు నేర్పి వారి సాధికారత కోసం కృషి చేస్తోంది. మరెందరో మహిళలను సాధికారత బాటలో నడిపిస్తోంది. నెలకు పదిలక్షలకు పైగా టర్నోవర్‌ని అందుకుంటోన్న ఆమె ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా! 

గువాహటికి చెందిన మిథాలీకి చిన్నప్పటి నుంచి వంటలపై అమితాసక్తి. ఏ కాస్త ఖాళీ దొరికినా...వంటింట్లో అమ్మ చేసే పదార్థాలను గమనించేది. చదువయ్యాక ఎయిర్‌హోస్టెస్‌గా ట్రైనింగ్‌ తీసుకుని, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో చేరింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి విధులు నిర్వర్తించేది. ఆపై కొన్ని కారణాలతో... ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి గువాహటికి చేరుకుంది మిథాలీ. ఆపై యూనిసెఫ్‌లో ఫ్రంట్‌ డెస్క్‌ జాబ్‌లో చేరింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే ఆమెకు పెళ్లయ్యింది. ఏడాది తిరిగేసరికి ఓ బిడ్డకు తల్లయ్యింది. మెటర్నిటీ లీవ్‌లో ఉన్న సమయంలో మిథాలీకి తన చిన్నప్పటి ఆసక్తి గుర్తొచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకని ఆన్‌లైన్‌లో వంటల తరగతులు చెప్పాలనుకుంది. 2015లో ‘ఫుడ్‌ సూత్రా బై మిథాలీ’ని ప్రారంభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన పాకశాస్త్ర నిపుణుల దగ్గర నుంచి తాను నైపుణ్యాలను ఒంటపట్టించుకుంటూ...వాటినే విద్యార్థులకు నేర్పించడం మొదలుపెట్టింది. చుట్టు పక్కల మహిళలను ‘ఫుడ్‌ స్టూడియో’ పేరుతో ఒక్కటిగా చేసి వారికి కొత్త వంటకాలను పరిచయం చేసేది. కేకులు, కుకీలు, డిజర్ట్‌లు...ఇలా ఎన్నో రకాలపై శిక్షణ ఇచ్చి...వారిని స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించింది. ఈ తరగతులను వీడియోల రూపంలో ఫేస్‌బుక్‌లో పొందుపరిచేది మిథాలీ.

మలుపు తిరిగిందిలా...

సోషల్‌మీడియాలో మిథాలీ వీడియోలను చూసిన ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు కునాల్‌కపూర్‌ ‘ఉత్సవ్‌ థాలీస్‌ ఆఫ్‌ ఇండియా సిరీస్‌’లో అసోంకు సంబంధించి థాలీస్‌ ప్రదర్శనకు ఈమెను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంతో మిథాలీకి పాకశాస్త్రనిపుణురాలిగా దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. అదే ‘ది వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌’ నుంచి పిలుపు అందుకునేలా చేసింది. కజిరంగ, మానస్‌ నేషనల్‌ పార్క్‌ల సమీపంలో నివసించే గిరిజనుల వంటకాలను ప్రపంచానికి తెలియజేసే బాధ్యతను మిథాలీకి అప్పజెప్పారు. ఇది తన జీవితంలో పెద్ద మలుపు అని చెబుతుందీమె. ‘ఇవన్నీ పర్యటక ప్రాంతాలు కావడంతో అతిథులకు సేవలందించేందుకు మహిళలే ఎక్కువగా ఉండేవారు. వారికి వంట తయారీ నుంచి పరిశుభ్రత వరకూ అన్ని అంశాల్లోనూ శిక్షణనందించేదాన్ని. పాకపర్యటనల పేరుతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి... ఈ నైపుణ్యాలన్నీ నేర్పేదాన్ని. క్రమంగా అక్కడివారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి’ అంటోంది మిథాలీ. మహిళా సాధికారతకు కృషి చేసినందు ఇటీవల కేంద్రప్రభుత్వం నుంచి అవార్డునీ అందుకుంది.  ఒకే ఒక్క విద్యార్థికి శిక్షణ ఇవ్వడంతో తన కెరియర్‌ని ప్రారంభించిన మిథాలీ ప్రస్తుతం నెలకు వెయ్యిమందికి పైగానే వంటల పాఠాలు చెబుతోంది. నెలకు పదిలక్షల టర్నోవర్‌ని అందుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్