ఆమె ప్రమాదాలు జరగనివ్వదు..
ఇండోర్‌లో ఓ యువతి నృత్యం చేస్తూ వినూత్నంగా ట్రాఫిక్‌ను నియంత్రించడం అక్కడివారికి సుపరిచితం. రహదారి భద్రతపై ఈమె అందిస్తున్న అవగాహనా విధానం వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఉదయం ఆర్జేగా, మధ్యాహ్నం వాణిజ్యవేత్తగా మారిపోతుంది. సాయంత్రమైందంటే చాలు...రహదారి భద్రతలో భాగస్వామ్యురాలై అందరికీ అవగాహన కలిగిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక సేవకురాలిగా పలురకాల బాధ్యతలను నిర్వర్తిస్తోంది 24 ఏళ్ల షుభి జైన్....
ఇండోర్‌లో ఓ యువతి నృత్యం చేస్తూ వినూత్నంగా ట్రాఫిక్‌ను నియంత్రించడం అక్కడివారికి సుపరిచితం. రహదారి భద్రతపై ఈమె అందిస్తున్న అవగాహనా విధానం వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఉదయం ఆర్జేగా, మధ్యాహ్నం వాణిజ్యవేత్తగా మారిపోతుంది. సాయంత్రమైందంటే చాలు...రహదారి భద్రతలో భాగస్వామ్యురాలై అందరికీ అవగాహన కలిగిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక సేవకురాలిగా పలురకాల బాధ్యతలను నిర్వర్తిస్తోంది 24 ఏళ్ల షుభి జైన్.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌జిల్లా బినా ప్రాంతంలో పుట్టిన షుభిజైన్ పుణెలో ఎంబీఏలో చేరింది. కాలేజీలో 20 రోజులపాటు జరిగే సోషల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీస్‌లతో కలిసి బాధ్యతలు పంచుకుంది. ఇండోర్ పోలీసు విభాగం ట్రాఫిక్‌కు సంబంధించి కాలేజీ విద్యార్థులతో కలిసి వలంటీర్ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. రహదారి భద్రతపై అవగాహన అందించడమే కాకుండా విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేసేవారు. అలా 1800 మంది విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో చేరి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ తీసుకుంది షుభిజైన్. కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా ఈమె దీనిపై ఆసక్తిని తగ్గించుకోలేదు. తనవంతు సేవలందించాలని ట్రాఫిక్ వలంటీర్‌గా బాధ్యతలను కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రేమిస్తున్నా...
పుణెలో డిగ్రీ చేస్తూ మధ్యలో వలంటీర్ కార్యక్రమానికి హాజరైన షుభిజైన్ ఆ తర్వాత తిరిగి పుణె వెళ్లాల్సి వచ్చింది. ‘అదే సమయంలో లాక్‌డౌన్ మొదలవడంతో మా ఊరికి వెళ్లా. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి ఇండోర్‌కు చేరుకున్నా. అలా 2020లో ట్రాఫిక్ వార్డెన్‌గా మారా. దీన్ని సామాజిక సేవగా భావించా. ఇది నాకు పెద్ద కష్టమనిపించలేదు. అలా ఆరునెలలు విజయ్ నగర్ స్క్వేర్‌లో నా వంతు సేవలందించా. ఆ తర్వాత ఇంద్రప్రస్థా స్క్వేర్‌లో ట్రాఫిక్‌ను చూసుకుంటున్నా. పోలీసులతో సమానంగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నా. అయితే వారు రోజంతా సేవలందిస్తే, నేను సాయంకాలాలు మాత్రమే పనిచేయగలుగుతున్నా. ప్రతిరోజు 6 నుంచి 8.30 గంటల వరకు రహదారి భద్రతలో భాగస్వామ్యం వహిస్తున్నా. ఈ బాధ్యతల్లో సవాళ్లూ ఉంటాయి. ఒకే చోట ఎక్కువ సేపు నిలబడి ఉండాలి. అవసరమైతే అటూ ఇటూ పరుగు పెట్టాల్సి ఉంటుంది. ఈల వేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తుండాలి. కొందరికి చెప్పినా అర్థం కాదు. అలాంటివారితో మాట్లాడి అవగాహన కలిగిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడటానికి చాలా శక్తి అవసరమవుతుంది. అలాగే పర్యావరణ కాలుష్యం నుంచి తప్పించుకోవడం కుదరదు. వాహనాల నుంచి వచ్చే పొగ, ఎక్కువసేపు నిలబడి ఉండటం వంటివి ఉన్నా కూడా ఈ పనిని ప్రేమిస్తుండటంతో నాకు పెద్దగా కష్టమనిపించదు. అలాగే వాలీబాల్, కోకో ఆడటంలో పాఠశాల, కళాశాల స్థాయిలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచా. అవన్నీ నన్ను నిత్యం ఉత్సాహంగా ఉండేలా చేయడమే కాదు, శారీరక సామర్థ్యాన్ని పెంచాయి’ అని చెప్పే ఈమె 2021 జనవరిలో ‘మాటీవాలా’ అంకురాన్ని స్థాపించింది. ఇంట్లో పెంచుకునే తోటకు కావాల్సిన పరికరాలు, మొక్కలు, వాటికి ఎరువులు వంటివన్నీ ఈమె ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. బాల్యం నుంచి మొక్కలతో ఉన్న అనుబంధమే ఈమెను ఈ రంగంలోనూ అడుగుపెట్టేలా చేసింది. అంతేకాదు... ఉదయం వేళల్లో రేడియో మిర్చిలో జాకీగా విధులు నిర్వర్తిస్తోంది. తెలతెలవారుతూనే ‘హాయ్ ఇండోర్’ అంటూ పలకరించే ఈమె తీయని గొంతు వినకుండా అక్కడివారికి ఒక్క రోజు కూడా గడవదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.